టీడీపీకి ఈ సీటు కష్టమేనా…??

telugudesamparty-in-darsi-constiuency

నిన్న మొన్నటి వరకూ మంత్రిగా పనిచేసిన శిద్ధా రాఘవరావు ఒంగోలు పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. దీంతో ఇక్కడ అభ్యర్థిని మార్చాల్సి వచ్చింది. టీడీపీ అధినేత ఖరారు చేసిన అభ్యర్థి ఇంకా నిలదొక్కుకోలేదు. పార్టీ క్యాడర్ ఆయనను ఓన్ చేసుకోలేకపోతుంది. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో తెలుగుదేశం పార్టీ సాధించుకున్న ఈ సీటును ఈసారి కోల్పోయే అవకాశాలున్నాయన్నది విశ్లేషకుల అంచనా. శిద్దా రాఘవరావు కుటుంబానికి టిక్కెట్ ఇవ్వకపోవడం టీడీపీ చేసిన పెద్ద తప్పుగా భావిస్తున్నారు. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొంత ముందంజలో ఉన్నారని తెలుస్తోంది.

తేలిపోతుందా….?

ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో హోరా హోరీ పోరు జరుగుతుందనుకున్నా అది తేలిపోయేటట్లే కన్పిస్తుంది. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా శిద్ధారాఘవరావు, వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీచేశారు. అయితే శిద్దా బూచేపల్లిపై కేవలం 1300 ఓట్ల తేడాతోనే విజయం సాధించారు. అంటే గత ఎన్నికల్లోనే ఇక్కడ నెక్ టు నెక్ పోటీ జరిగిందన్నది గణాంకాలు చూస్తుంటేనే తెలిసిపోతుంది. ఇక్కడ టీడీపీ సామాజిక వర్గాల సమీకరణల్లో భాగంగా టిక్కెట్ ను కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావుకు ఇచ్చింది.

శిద్దాకు ఇవ్వకపోవడంతో…..

శిద్ధారాఘవరావుకే టిక్కెట్ ఇవ్వాలని చివరి నిమిషం వరకూ దర్శి నియోజకవర్గం టీడీపీ నేతలు పట్టుబట్టారు. రాజీనామాలకు సయితం సిద్ధపడ్డారు. అయితే కనిగిరి టిక్కెట్ కు దర్శి టిక్కెట్ కు ముడిపడటం, పార్లమెంటు అభ్యర్థిగా శిద్ధాను పంపించాల్సి ఉండటంతో కదిరికే టిక్కెట్ ను చివరి నిమిషంలో కన్ఫ్మర్మ్ చేశారు. నామినేషన్ కు రెండు రోజుల ముందు టిక్కెట్ ఖరారు కావడంతో ఇక్కడ కదిరి బాబూరావు చెమటోడుస్తున్నారు. టీడీపీ శ్రేణుల నుంచి ఆశించినంత సహకారం అందడం లేదు. దర్శిలో కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ. మొత్తం 13 సార్లు ఎన్నికలు జరిగితే నాలుగు సార్లు మాత్రమే ఇక్కడ టీడీపీ విజయం సాధించింది.

ఇద్దరూ కాపు సామాజికవర్గానికి…..

ఇక వైఎస్సార్ కాంగ్రెస్ కూడా అభ్యర్థులను మార్చి మార్చి చివరకు మద్దిశెట్టి వేణుగోపాల్ పేరును ఖరారు చేసింది. వాస్తవానికి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీ చేయనని చెప్పడంతో మద్దిశెట్టి వేణుగోపాల్ ను తన అభ్యర్థిగా జగన్ ప్రకటించారు. ఈయన కూడా కాపు సామాజిక వర్గానికిచెందిన నేత కావడం విశేషం. మద్దిశెట్టి వేణుగోపాల్ విజయానికి బూచేపల్లి వర్గం కృషి చేస్తోంది. దీంతో పార్టీలు వేరేనా అక్కడి అభ్యర్థులు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆ సామాజిక వర్గం ఓట్లు చీలే అవకాశాలున్నాయి. దీంతో గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో బయటపడిన టీడీపీకి ఈసారి విజయం ఇక్కడ కష్టమేనంటున్నారు.

Ravi Batchali
About Ravi Batchali 40484 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*