
పిట్టపోరు పిట్ట పోరు పిల్లి తీర్చిందన్న చందంగా తయారైంది కర్నూలు నియోజకవర్గం పరిస్థితి. కర్నూలు సిటీ నియోజకవర్గం పరిధిలో రాజకీయాలు ఆరు నెలల ముందు నుంచే వేడెక్కాయి. సీటు తమకు కావాలంటే తమకు కావాలని రెండు వర్గాలు పట్టుబడుతుండటంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే….మరోవైపు గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థి. ఇద్దరి నడుమ చంద్రబాబు నలిగిపోతున్నారు. అదేకర్నూలు నియోజకవర్గం. ఇప్పుడు కేఈ కృష్ణమూర్తి ఆ సమస్యను పరిష్కరించే దిశగా కొత్త ఆలోచనను అధినేత ముందుంచి కొత్త వివాదానికి తెరదీశారంటున్నారు.
ఎస్వీ విశ్వప్రయత్నాలు…..
కర్నూలు నియోజకవర్గానికి ప్రస్తుతం ఎస్వీ మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గా ఉన్నారు. ఆయన 2014 ఎన్నికల్లో వైఎస్సార్ పార్టీ నుంచి గెలిచారు. ఆ తర్వాత తన బావ భూమా నాగిరెడ్డి వైసీపీ నుంచి టీడీపీలోకి మారడంతో తాను కూడా అదే పంథాను అనుసరించక తప్పలేదు. వచ్చే ఎన్నికల్లోనూ తనకే టిక్కెట్ లభిస్తుందని ఎస్వీమోహన్ రెడ్డి బలంగా విశ్వసిస్తున్నారు. కొంతకాలం క్రితం కర్నూలుకు వచ్చిన లోకేష్ ద్వారా తానే అభ్యర్థినని ప్రకటించుకోవడంలో కూడా ఎస్వీ మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు. అయితే తీరా ఎన్నికల సమయానికి వచ్చే సరికి పార్టీలోని తన ప్రత్యర్థులు దూకుడు పెంచడంతో అమరావతి చుట్టూ ఎస్వీ ప్రదిక్షిణలు చేస్తున్నారు.
టీజీ దారి…..
ఇదే నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయిన టీజీ వెంకటేశ్ తన తనయుడు టీజీ భరత్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికలలోనే భరత్ ను రాజకీయ అరంగేట్రంచేయించాలన్న పట్టుదలతో వెంకటేశ్ ఉన్నారు. తన వద్ద పట్టిష్టమైన ఓటుబ్యాంకు తో పాటు ఆర్థిక అంశాలను కూడా అధిష్టానానికి టీజీ చెబుతుండటం విశేషం. ఎస్వీ అయితే ఆ సీటును వదులుకోవాల్సిందేనన్న సంకేతాలను కూడా ఇస్తున్నారు. ఇప్పటికే టీజీ భరత్ కర్నూలు పట్టణంలో యాత్రను కూడా ప్రారంభించారు.
కేఈ కొత్త ఆలోచన….
ఈ ఇద్దరూ తమకే కర్నూలు సీటు కావాలని పట్టుబడుతుండగా, కోట్ల కుటుంబం చేరికతో తమ సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందోనని భావించిన కేఈ కృష్ణమూర్తి సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. కోట్ల కుటుంబం కర్నూలు లోక్ సభ స్థానంతో పాటు డోన్ అసెంబ్లీ నియోజకవర్గం కోరుకుంటోంది. డోన్ కోట్ల కుటుంబానికి వెళ్లకూడదని భావించిన కేఈ కర్నూలు స్థానం నుంచి కోట్ల సుజాతమ్మను పోటీ చేయిస్తే బాగుంటుందని సూచించారట. కర్నూలు టౌన్ లో సుజాతమ్మకు టిక్కెట్ ఇస్తే టీజీ, ఎస్వీ వర్గాలు కలసి పనిచేస్తాయనికూడా సలహా ఇచ్చారట. దీంతో చంద్రబాబు కర్నూలు విషయంలో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. మొత్తం మీద కేఈ సోదరులు తమను కాపాడుకునేందుకు కర్నూలు ప్రతిపాదన పెట్టారన్న టాక్ పార్టీలో విన్పిస్తుంది.
Leave a Reply