
పిల్లి సుభాష్ చంద్రబోస్ పేరు చెప్పగానే వైఎస్ ఆర్ కి అత్యంత సన్నిహితుడిగా అందరికి తెలుసు. ఒక ఎన్నికల్లో వైఎస్ పార్టీ ఫండ్ గా ఇచ్చిన సొమ్ము ను ఎన్నికల్లో ఖర్చు పెట్టగా మిగిలింది తీసుకువెళ్లి ఇచ్చిన నిజాయితీ పరుడిగా బోస్ కు రాజకీయ వర్గాల్లో మంచి పేరు వుంది. మంత్రివర్గంలో కొనసాగుతుండగా వైఎస్ మరణం బోస్ ని కలచివేసింది. కాంగ్రెస్ పార్టీలో ఎదురులేని నేతగా వైఎస్ మరణానంతరం కూడా మంత్రిగా కొనసాగే అవకాశం వున్నా తన పదవిని తృణప్రాయంగా వదులుకుని వైఎస్ జగన్ స్థాపించిన వైసిపి పార్టీలోకి బోస్ వచ్చేశారు. నాటి నుంచి నేటి వరకు జగన్ కోటరీలో అత్యంత ముఖ్యుడైన బోస్ కు వున్న విలువ అందరికి తెలిసిందే. వైసిపి అధికారంలోకి వస్తే గ్యారంటీ గా మంత్రి అయ్యే సుభాష్ చంద్రబోస్ కి మండపేట నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి వేగుళ్ళ జోగేశ్వర రావు చెమటలు పట్టించారు.
శెట్టిబలిజ నేతలను టార్గెట్ చేసి మరీ …
సిట్టింగ్ ఎమ్యెల్యే టిడిపి అభ్యర్థి జోగేశ్వర రావు కు సామాజికవర్గాల పరంగా బోస్ సామాజికవర్గంతో పోలిస్తే తక్కువ ఓటర్లే వున్నారు. కానీ ఎన్నికల యుద్ధ తంత్రంలో ఆరితేరిన జోగేశ్వర రావు ‘‘లక్ష్మి’’ దేవినే నమ్ముకున్నారని అంటున్నారు. బోస్ వెనుక వుండే వారికి భారీ మొత్తంలో ఆఫర్స్ పెట్టి తనవైపుకు తిప్పుకుంటున్నారని దాంతో వైసిపి శిబిరంలో ఆందోళన మొదలైంది. అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి ఆర్ధిక అండ ఉన్నప్పటికీ జోగేశ్వర రావు ధన ప్రభావం ముందు బోస్ తేలిపోయారని విశ్లేషకుల పరిశీలన.
జగన్ ఆదేశాలను పాటించి …
నిజానికి పిల్లి సుభాష్ చంద్రబోస్ కి తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో గట్టి పట్టువుంది. దశాబ్దాల తరబడి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ గెలుపు ఓటములు చవి చూసిన ఆయన ఆ నియోజకవర్గం నుంచి అనివార్యంగా తప్పుకోవాలిసి వచ్చింది. కొన్ని రకాల ఈక్వేషన్స్ కారణంగా బోస్ స్థానంలో చెల్లుబోయిన వేణుగోపాల్ కి వైసిపి రామచంద్రపురం కేటాయించింది. దాంతో తనకు అత్యంత ప్రీతీ పాత్రుడు అయినా పిల్లి బోస్ ను కమ్మ సామాజిక వర్గం కంచుకోట మండపేట నుంచి పోటీ చేయించారు జగన్. కొత్త నియోజకవర్గం కావడం ఒక సమస్య అయితే మరో పక్క క్యాడర్ లో ఎవరు ఎలా పనిచేస్తారో తెలియని పరిస్థితి, ఇంకోవైపు టిడిపి అభ్యర్థి ఆర్ధిక బలం వైసిపి తురుపు ముక్కను ముప్పుతిప్పలు పెడుతుంది. మరి దీనిని రాజకీయ నిపుణుడైన బోస్ తట్టుకుని ఎలా బయటపడతారో చూడాలి. పోలింగ్ తర్వాత మాత్రం తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని బోస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Leave a Reply