
గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం టీడీపీకి సేఫ్ ప్లేస్ అంటారు. ఇక్కడ ఎవరు పోటీ చేసినా గెలుస్తారన్న బలమైన నమ్మకం ఆ పార్టీలో ఉంది. ఒక నొక దశలో మంత్రి నారా లోకేష్ పేరు కూడా ఈ నియోజకవర్గం నుంచి విన్పించింది. అయితే చివరకు నారా లోకేష్ మంగళగిరి వెళ్లిపోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే కొమ్మాల పాటి శ్రీధర్ కే తిరిగి చంద్రబాబునాయుడు టిక్కెట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు కొమ్మాలపాటికి సొంత సామాజిక వర్గమే దెబ్బేసిందన్న టాక్ బలంగా ఉంది. నిజానికి పెదకూరపాడు నియోజకవర్గంలో ఒకప్పుడు కాంగ్రెస్ బలంగా ఉండేది. ఐదసార్లు వరసగా కాంగ్రెస్ పార్టీ గెలిచిన సందర్భం లేకపోలేదు. గత రెండు సార్ల నుంచి టీడీపీ ఇక్కడ గెలుస్తూ వస్తుంది.
టీడీపీ బలంగా ఉన్నా….
ఇక్కడ సామాజిక వర్గాలుగా చూస్తే టీడీపీ బలంగా ఉండాలి. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,10,000 మంది ఓటర్లున్నారు. ఇందులో కమ్మ సామాజిక వర్గం ఓటర్లు 40 వేలమంది వరకూ ఉన్నారు. రెడ్డి సామాజికవర్గం ఓటర్లు కేవలం 13,500 మాత్రమే. కాపు సామాజికవర్గం ఓటర్లు 23 వేల మంది ఉన్నారు. ఎస్టీలు 12 వేలు, ఎస్సీలు (మాలలు 14,000, మాదిగలు 27000) మంది ఉన్నారు. 28 వేల మంది ముస్లిం ఓటర్లు న్నారు. వైశ్యులు 8వేల మంది ఉన్నారు. ముస్లింలు, కమ్మలు, వైశ్యులు తనకే మద్దతిస్తారన్న విశ్వాసంతో కొమ్మాలపాటి శ్రీధర్ ఉన్నారు. అయితే కమ్మ సామాజిక వర్గానికి చెందిన నంబూరి శంకరరావును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించింది.
సొంత సామాజికవర్గంలోనే….
అయితే కమ్మ సామాజికవర్గంలో కొందరిని మాత్రమే కొమ్మాలపాటి శ్రీధర్ ఈ ఐదేళ్లలో దగ్గరకు తీశారని, ఆయన సొంత ప్రయోజనాలకోసమే ఎక్కువ సమయం కేటాయించారన్నది అదే సామాజికవర్గం నుంచి కొందరు నేతలు విమర్శిస్తున్నారు. ఇక ఇసుక రీచ్ ల విషయంలో కూడా టీడీపీ ద్వితీయ శ్రేణినేతలు తమకు ఎలాంటి లాభం చేకూరలేదని, ఎమ్మెల్యే తన అనుచరులు, సన్నిహితులకే కేటాయింపులు చేశారన్న ఆగ్రహంతో ఉన్నారు. అందుకే టీడీపీలోని ద్వితీయశ్రేణి నేతలు కొందరు ఎన్నికల సమయానికి సహకరించ లేదని చెబుతున్నారు. రెండుసార్లు వరసగా గెలవడం వల్ల కూడా వ్యతిరేకత బాగానే పోలింగ్ రోజున కనపడిందంటున్నారు.
కమ్మ – 40,000
రెడ్డి – 13,500
కాపులు – 23,000
ఎస్టీలు – 12,000
మాలలు – 14,000
మాదిగలు – 27,000
ముస్లింలు – 28,000
యాదవులు -14,000
వైసీపీ నమ్మకమిదే….
అయితే ఈసారి ఎస్సీ, ఎస్టీ,బీసీలతో పాటు ముస్లింలు కూడా తమ వైపు నిలిచారని వైసీపీ అభ్యర్థి నంబూరి శంకరరావు ధీమాగా ఉన్నారు. మాదిగ రిజర్వేషన్ కు చంద్రబాబు వ్యతిరేకంగా ఉండటం, రావెల కిశోర్ బాబును మంత్రి పదవి నుంచి తప్పించడంతో గంపగుత్తగా వైసీపీకే వారు ఓట్లు వేశారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక యాదవులు కూడా తమవైపే మొగ్గు చూపారంటున్నారు. ఈ నియోజకవర్గంలో రెండు పార్టీల అభ్యర్థులు కోట్లు కుమ్మరించారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. అయితే గత ఎన్నికల మాదిరిగా ఈసారి టీడీపీకి ఇక్కడ గెలవడం అంత ఈజీకాదు. వైసీపీ గెలిచినా ఆశ్చర్యపోవాల్సినపనిలేదు. మరి పోలింగ్ ముగిసినతర్వాత విశ్లేషణలు మాత్రం వైసీపీకే ఎడ్జ్ ఉందని చెబుతున్నాయి.
Leave a Reply