ఛేంజ్ చేస్తే ఛేజ్ చేసేస్తారా..???

telugudesamparty-in-satyavedu-constiuency

ఇక్కడ అభ్యర్థులను మారిస్తేనే గెలిచే సంప్రదాయ ఉన్నట్లుంది. ఎస్సీ నియోజకవర్గం కావడంతో ప్రధాన పార్టీలు కూడా తరచూ అభ్యర్థులను మార్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. ఒకసారి గెలిచిన అభ్యర్థి మరొకసారి గెలవకపోవడం ఈ నియోజకవర్గం విశిష్టతగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అందుకే ఇక్కడ పార్టీలన్నీ ఒకసారి గెలిచిన అభ్యర్థికి మరొకసారి టిక్కెట్ ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నాయి. గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కన్పిస్తుంది. చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో పరిస్థితి ఇదీ.

ఆరుసార్లు గెలిచి…..

సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీకి మంచి పట్టుంది. ఇప్పటివరకూ జరిగిన పన్నెండు ఎన్నికల్లో టీడీపీ ఆరుసార్లు గెలిచింది. 1983 తర్వాత ఒకసారి గెలిచిన అభ్యర్థి మరొకసారి ఇక్కడ గెలవకపోవడం విశేషంగానే చెప్పుకోవాలి. ఇక్కడ కాంగ్రెస్ మూడు సార్లు మాత్రమే గెలిచింది. 2009, 2014 ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీయే విజయం సాధించింది. 2009 ఎన్నికల్లో హేమలత టీడీపీ ఎమ్మెల్యేగా గెలిస్తే, 2014 ఎన్నికల్లో అభ్యర్థిని మార్చి తలారి ఆదిత్యకు ఇవ్వడంతో ఆయన కూడా విజయం సాధించారు. ఈసారి కూడా టీడీపీ అదే ఫార్ములాను ఫాలో అయింది.

మళ్లీ కొత్త అభ్యర్థి….

సిట్టింగ్ ఎమ్మెల్యే తలారి ఆదిత్యకు ఈసారి టిక్కెట్ ఇవ్వకుండా జేడీ రాజశేఖర్ కు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. తలారి ఆదిత్యను పక్కన పెట్టింది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే సహకారం ఈయనకు లభించడం లేదు. చివరి నిమిషంలో టిక్కెట్ దక్కడంతో టీడీపీ అభ్యర్థి ప్రచారంలో వెనుకంజలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పనితీరుపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి ఈయనపై పడే అవకాశముందంటున్నారు. రాజకీయాలకు కొత్త కావడం కూడా ఈయనకు మైనస్ గానే చెప్పవచ్చు. అయితే నియోజకవర్గంలో సేవా కార్యక్రమాల ద్వారా ఇదివరకే సుపరిచితుడు కావడం కొంత అనుకూలమనే చెప్పాలి. టీడీపీ శ్రేణులంతా కలసి పనిచేస్తేనే ఇక్కడ విజయం దక్కుతుంది.

వైసీపీ కూడా బలంగా….

ఇక వైఎస్సార్సీపీ అభ్యర్ధిగా ఆదిమూలం కోనేటి బరిలో దిగారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆదిమూలం ఓడిపోయారు. కేవలం నాలుగువేల ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో ఓటమిపాలయినప్పటికీ ఆయనకే తిరిగి జగన్ టిక్కెట్ ఇచ్చారు. ఓటమి పాలవ్వడంతో తనకు సానుభూతి ఉంటుందని ఆదిమూలం భావిస్తున్నారు. సర్పంచ్ గా, ఎంపీటీసీ, జడ్పీటీసీ గా పనిచేసి ఉండటంతో ప్రజలతో సత్సంబంధాలు ఆదిమూలంకు ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి. అయితే ఈసారి సత్యేవేడును తిరిగి నిలుపుకోవాలని టీడీపీ, ఎలాగైనా గెలుచుకోవాలని వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటి వరకూ చూసుకుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొంత ఎడ్జ్ ఉన్నట్లు కన్పిస్తుంది.

Ravi Batchali
About Ravi Batchali 34017 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*