
రాజకీయ రాజధాని విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఈసారి రసవత్తర పోరు జరగనుంది. టీడీపీ, వైసీపీ, జనసేన అభ్యర్ధులు ఎన్నికల్లో హోరాహోరీగా తలపడనున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిన గద్దె రామ్మోహన్..మరోసారి ఎన్నికల బరిలో ఉండగా…వైసీపీ నుంచి బొప్పన భవకుమార్ పోటీ చేస్తున్నారు. ఇక జనసేన నుంచి బత్తిన రాము బరిలో ఉన్నారు. అయితే ఇక్కడ ఎప్పుడూ…కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్యే పోరు నడుస్తుంది. కానీ ఇప్పుడు టీడీపీ-వైసీపీ అభ్యర్ధులు ఇద్దరు కమ్మ సామాజికవర్గ నేతలు కాగా, జనసేన అభ్యర్ధి కాపు సామాజికవర్గం నేత.
రాధా చేరికతో…..
ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున దాదాపు 15 వేల ఓట్ల పై మెజారిటీతో గెలిచిన గద్దె రామ్మోహన్…ఇక్కడ కులమతాలకి అతీతంగా అభివృద్ధి చేశారు. సంక్షేమ పథకాలని అందరికీ అందేలా చేయడం…నిరంతరం ప్రజలకి అందుబాటులో ఉంటూ…వారి సమస్యలని పరిష్కరించారు. అలాగే అవినీతి, అక్రమాల వంటి వాటి జోలికి కూడా వెళ్లకపోవడం వంటివి గద్దె ఇమేజ్ను పెంచాయి. ఇక కాపు సామాజికవర్గానికి పెద్ద దిక్కుగా ఉన్న వంగవీటి రాధా టీడీపీలో చేరడం..గద్దెకి ఫుల్ సపోర్ట్ ఇవ్వడం కలిసి రానున్నాయి. అలాగే ఇక్కడ ఉన్న దేవినేని అనుచరులు కూడా గద్దెకి మద్ధతు పలుకుతున్నారు. అయితే గత ఎన్నికల్లో మద్ధతు ఇచ్చిన జనసేన ఇప్పుడు ఎన్నికల బరిలో ఉండటం కొంత ఇబ్బందికరమైన అంశం.
యలమంచిలి సహకరిస్తారా..?
మరోవైపు గద్దె సామాజికవర్గానికి చెందిన బొప్పన భవకుమార్ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. విజయవాడ 3వ డివిజన్ కార్పొరేటర్‌గా పనిచేసిన బొప్పనకి నియోజకవర్గంపై మంచి పట్టే ఉంది. అలాగే కొంత ప్రభుత్వ వ్యతిరేకత బొప్పనకి కలిసిరావొచ్చు. కానీ వంగవీటి పార్టీని వీడటం పెద్ద మైనస్. అటు టికెట్ ఆశించి భంగపడ్డ యలమంచి రవి బొప్పనకి ఏ మేర సహకరిస్తారో చెప్పలేం. టికెట్ దొరకక బత్తిన రాము కూడా వైసీపీని వీడి జనసేనలో చేరి..ఆ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. కాపు ఓట్లు ఎక్కువ ఉండటం, పవన్ ఇమేజ్‌లు మాత్రమే బత్తినకి పాజిటివ్ కానున్నాయి. అయితే నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సుమారు 30 వేల కాపు ఓట్లు ఉన్నాయి.
ఆ ప్రభావం ఎవరిపైన…?
అటు కమ్మ సామాజికవర్గం ఓట్లు కూడా సుమారు 25 వేల వరకు ఉంటాయి. ఇక బీసీ, ఎస్సీ , మైనారిటీ ఓటర్లు కూడా అధికంగానే ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులని బట్టి అంచనా వేసుకుంటే ఇక్కడ టీడీపీ అభ్యర్ధి గద్దె రామ్మోహన్‌కే విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే జనసేన చీల్చే ఓట్ల ప్రభావం వైసీపీతో పాటు…గద్దె మీద కూడా పడనుంది. అలాగే ఎన్నికల సమయానికి చోటు చేసుకునే మార్పులు బట్టి కూడా ఫలితం అటు ఇటు అయ్యే అవకాశం ఉంది. మరి చూడాలి ఈసారి తూర్పు ప్రజలు ఎవరి వైపు ఉంటారో అనేది.
Leave a Reply