బలం పెరిగిందా..?…అదే ప్రమాదంగా మారిందా…?

telugudesamparty in visakhapatanm district

బలం పెరిగిందనుకోవాలా…? అదే బలహీనతగా మారిందని భావించాలా? తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు అదే జరుగుతుంది. స్థానిక ఎమ్మెల్యేలపై కిందిస్థాయి క్యాడర్ తిరగబడుతుండటం ఆ పార్టీ నేతలను కలవరపరుస్తోంది. నాలుగున్నరేళ్లుగా ఎమ్మెల్యేలపై ఉగ్గబట్టి ఉన్న కోపాన్ని ఎన్నికలకు ముందు బాహాటంగా బయటపెట్టేస్తున్నారు ద్వితీయ శ్రేణి నేతలు. ఆయనకు టిక్కెట్ ఇస్తే తాము సహకరించేది లేదు పొమ్మని తెగేసి చెబుతున్నారు. కొందరైతే నేరుగా అమరావతికి ప్రత్యేక బస్సుల్లో వెళ్లి మరీ సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద ఫిర్యాదు చేసి వస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయికి వెళ్లిందో ఊహించుకోవచ్చు.

సిట్టింగ్ ఎమ్మెల్యేలపై…..

విశాఖ జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలుంటే 11 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఆతర్వాత పాడేరు, అరకు ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావులు వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో పార్టీ బలం విశాఖ జిల్లాలో 13కు పెరిగింది. ఇదంతా పైకి కన్పిస్తున్న బలమేనంటున్నారు. లోలోపల ఎమ్మెల్యేలపై రగిలిపోతున్న క్యాడర్ ఎన్నికల వేళ బయటపడుతోంది. తమ సహకారంతో ఎమ్మెల్యే అయి, నాలుగున్నరేళ్లుగా తమపై కర్ర పెత్తనం చేయడం తప్ప వారు చేసిందేమీ లేదని అధినాయకత్వానికి తెగేసి చెబుతున్నారు. బహిరంగంగా ఆందోళనలకు దిగుతున్నారు.

వంగలపూడి అనితపై…..

పాయకరావుపేట నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు సొంత పార్టీ నేతలే టిక్కెట్ ను అడ్డుకుంటున్నారు. ఆమెకు వ్యతిరేకంగా ఆ నియజకవర్గంలో నిరసనలు చేస్తుంటం విశేషం. కోటవృట్లలో ‘‘అనిత వద్దు…టీడీపీ ముద్దు’’ అని బ్యానర్లు పెట్టి మరీ ఆందోళనకు దిగారు. పాయకరావుపేట పట్టణ అధ్యక్షుడు మజ్జూరి నారాయణరావు ఆధ్వర్యంలోనే ఈనిరసనలు జరగడం విశేషం. అనితకు టిక్కెట్ ఇస్తే తాము ఓడించి తీరుతామని ర్యాలీలో అసమ్మతి నేతలు ప్రకటించారు. దీంతో పార్టీ అధిష్టానం కూడా అనిత విషయంలో వెనకడుగు వేస్తున్నట్లు కన్పిస్తోంది.

వాసుపల్లికి టిక్కెట్ ఇస్తే…..

విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు టిక్కెట్ ఇవ్వొద్దంటూ పెద్ద రగడే చేస్తున్నారు తెలుగుతమ్ముళ్లు. విశాఖదక్షిణ నియోజకవర్గానికి చెందిన మైనారిటీ, మహిళా విభాగం నేతలతో పాటు మాజీ కార్పొరేటర్లు ప్రెస్ మీట్లు పెట్టి మరీ వాసుపల్లిపై దండెత్తారు. ఇక దళితనేతలయితే ఏకంగా పార్టీ కార్యాలయంలోనే ధర్నాకు దిగారు.ఎమ్మెల్యే తమపైనే దౌర్జన్యానికి పాల్పడుతున్నారన్నది వారి ప్రధాన ఆరోపణ. ఇక గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుపై మాజీ కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు ధ్వజమెత్తుతున్నారు.ఆయన సీనియర్ నేత కావడం, తనకు టిక్కెట్ ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థిగానైనాపోటీ చేసి పల్లాను ఓడించి తీరుతానని శపథం చేశారు. మొత్తం మీద విశాఖ జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎన్నికల వేళకు సొంత పార్టీ నుంచే సెగ పుట్టుకొస్తుంది.మరి అధినేత నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

Ravi Batchali
About Ravi Batchali 35928 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*