
ప్రజా సేవ చేయడానికి రాజకీయ రంగం ఓ వేదిక. ఇంకా ఇతర రంగాల ద్వారా కూడా సేవ చేయవచ్చు. అయితే ప్రజల సొమ్ముతో చేసే సేవ కాబట్టి రాజకీయ రంగానికి కళ, కలరింగ్ బాగా ఎక్కువ ఉంటుంది. ఇక ఈ దేశంలో మారుతున్న పరిస్థితులు చూసినపుడు, రాజకీయాల్లో చోటు చేసుకున్న వాతావరణాన్ని గమనంలోకి తీసుకున్నపుడు రాజకీయమంటే పదవులు, అధికారమేనని అనిపించకమానదు. రాజకీయాల్లోకి వచ్చేది కుర్చీ కోసమేనని సిగ్గు లేకుండా చెప్పేస్తున్నారు. వివిధ రంగాల్లో స్టార్లు, సూపర్ స్టార్లు అనిపించుకున్న వారు కూడా నేను ముఖ్యమంత్రినైతే అంటున్నారు తప్ప ఎమ్మెల్యేగా నిలబడి సేవ చేస్తానని చెప్పడంలేదు. ఇక కొన్ని దశాబ్దాలుగా రాజకీయాలు చాలా ఖరీదైపోయాయి. ఎన్నికల్లో టికెట్ తెచ్చుకోవడం దగ్గర నుంచి పోటీ చేసి గెలవడం వరకూ ఎన్ని కోట్లు ఖర్చు అవుతోందో వేరే చెప్పనక్కరలేదు. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు ఓడిపోయిన వాడు, ప్రతిపక్షంలో ఉన్న వాడు ఒక్కటేనన్న భావన చాలా మందిలో కల్గుతోంది. అదే వారిని గోడ దూకుళ్ళకు ఎగదోస్తోంది.
రెండు దశాబ్దాలుగా….
ఇక ఏపీ వరకూ రాజకీయాలు చూసుకుంటే రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో గోడ దూకుళ్ళు ఎక్కువైపోయాయి. ఎటువంటి జంకూ గొంకూ లేకుండా ఫిరాయించేస్తున్నారు. తాము ప్రజలకు సేవ చేసేందుకే ఈ జంపింగ్ అంటూ సర్దిచెప్పుకుంటున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉండగా టీఆర్ఎస్ నుంచి టీడీపీ నుంచి కొందరు ఎమ్మెల్యేలు జంప్ చేశారు. ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ టైంలో ఏకంగా ప్రజారాజ్యం పార్టీ వారంతా గుత్తమొత్తంగా విలీనం అయిపోయారు. ఇది టోకు గా ఫిరాయింపు అన్న మాట. ఇక అక్కడ టీఆర్ఎస్, ఇక్కడ టీడీపీ 2014లో అధికారంలోకి వచ్చాక మరీ ఎక్కువగా ఫిరాయింపుల కంపు పెరిగింది. కేసీయార్ టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ అన్న తేడా లేకుండా అందరినీ లాగేశారు. అందులో ఒకరికి మంత్రి పదవి ఇచ్చారు. ఇక ఏపీలో చంద్రబాబు కేసీయార్ కే గురువు అందుకే ఏకంగా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను లాగేసి నలుగురుకి మంత్రి పదవులు ఇచ్చేశారు.
ఆత్మరక్షణలో టీడీపీ….
ఇక ఇపుడు టీడీపీ వంతు వచ్చింది. ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. దాంతో తన ఎమ్మెల్యేలను కాపాడుకోవాలనుకుంటోంది. అయితే అది సాగేలా కనిపించడంలేదు. వైసీపీ మీరు మాకు వద్దు అని గేట్లు మూసేసినా బీజేపీ మాత్రం రెడీ అంటోంది. కన్ను కొడుతోంది. ఆ పార్టీ ఏకంగా పదహారు మంది వరకూ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుని బీజేపీలో టీడీపీ విలీనం అన్న ప్రకటన చేయించాలను కుంటోంది. ఇక కొంతమంది టీడీపీ తమ్ముళ్ళు వైసీపీలోకి వస్తామని, జగన్ పెట్టిన షరతు మేరకు రాజీనామా కూడా చేస్తామని చెబుతున్నారు. అంటే ఎలాగైనా అధికార పార్టీ ఎమ్మెల్యే అనిపించుకోవాలని తాపత్రయపడుతున్నారు. మరి ఈ విధంగా ప్రజా తీర్పును కాలరాస్తూ కించపరుస్తూ గోడ దూకడం సబబేనా…? ప్రతిపక్షంలో అయిదేళ్ళు ఉండి పోరాడలేరా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అందరూ ఇలాగే అనుకుంటే అప్పట్లో ఓ వావిలాల గోపాలక్రిష్ణయ్య, చండ్ర రాజేశ్వరరావు, నర్రా రాఘవరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, వెంకయ్యనాయుడు, జైపాల్ రెడ్డి వంటి వారు ప్రతిపక్షంలోనే ఉండే వారు కాదు కదా అంటున్నారు. అయినా వారికంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్నది విపక్ష ఎమ్మెల్యేలుగానే కదా అంటున్నారు.
Leave a Reply