
తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ అని గట్టిగా చెబుతారు. మరి ఆ పార్టీలో ఇటీవల కాలంలో అది కనిపించడంలేదు. ఎన్నడూ లేనిది వీధుల్లోకి వచ్చి నాయకులు కార్యకర్తలు సొంత పార్టీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేసే దాకా పరిస్థితి వచ్చింది. ఓ వైపు టీడీపీ హై కమాండ్ టికెట్ల కోసం అభ్యర్ధుల ఎంపిక కార్యక్రమం చేపడితే ఫలనా వారికి టికెట్ ఇవ్వవద్దు అంటూ తమ్ముళ్ళు ఏకంగా మీడియాకు ఎక్కుతున్నారు. రోడ్ల మీదకూ వస్తున్నారు. విశాఖ అర్బన్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, సౌత్ అసెంబ్లీ ఎమ్మెల్యే అయిన వాసుపల్లి గణేష్ కుమార్ కి ఈసారి టికెట్ ఇవ్వవద్దంటూ ఏకంగా ముస్లిం నాయకులు మీటింగు పెట్టారు. గణేష్ కుమార్ వైఖరిని వారు కడిగిపారేశారు. అది చాలదన్నట్లుగా దళిత సంఘాల నేతలు వీధుల్లోకి వచ్చి బల ప్రదర్శనలు నిర్వహించారు.
మహిళలు వద్దంటున్నారు…
ఇక టీడీపీలో మహిళా ఎమ్మెల్యే, పాయకరావుపేటకు చెందిన అనితకు వ్యతిరేకంగా మహిళా లోకమే తరలివచ్చి పెద్ద ఎత్తున వీధులో ప్రదర్శనచేపట్టారు. ఆమెకు టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని శపధం కూడా చేశారు. అనిత వల్ల ఎటువంటి అభివ్రుద్ధి జరగలేదని కూడా టీడీపీ వారే జనానికి చెప్పడం విశేషం. ఇక అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణకు టికెట్ ఇవ్వవద్దంటూ ఆ పార్టీ నాయకులు గట్టిగా డిమాండు చేస్తున్నారు. ఈసారి స్థానికులకే టికెట్ ఇవ్వాలని వారు కోరుతున్నారు. అదే విధంగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా సొంత పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు లేళ్ల కోటేశ్వరరావు రోడ్డెక్కరు. ఇక్కడ టీడీపీలో ఇతర నాయకులు కూడా ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలపై నిరసన వ్యక్తం చేస్తూ తమకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆయన్ని తప్పించండి…..
ఇక సీనియర్ నేత పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణకు కాకుండా తమకు ఈసారి టికెట్ ఇవ్వాలని కూడా అక్కడ తమ్ముళ్ళు కోరుతున్నారు. ఎపుడూ పాతవారికే టికెట్లు ఇస్తే తమకు చాన్స్ ఎలా వస్తుందని కూడా లాజిక్ పాయింట్ తీస్తున్నారు. ఏజెన్సీలో అయితే ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని పక్కన పెట్టాలని కోరుతున్నారు. మొత్తానికి చూసుకుంటే ప్రతీ నియోజకవర్గంలో కూడా తమ్ముళ్ళు టికెట్ కోసం సిగపట్లు పట్టడమే కాదు. తన్నుకుంటున్నారు. దీన్ని చూసి ఏకంగా జనమే ముక్కున వేలేసుకోవాల్సివస్తోంది. ఇపుడే ఇలా అయితే రేపు టికెట్ ఒకరికి ఇచ్చినా మిగిలిన వారు బుద్ధిగా సహకరిస్తారా అన్న సందేహాలు పార్టీ పెద్దలకు వస్తున్నాయి. చూడాలి ఈ తగవు ఎంతవరకూ వెళ్తుందో.
Leave a Reply