టీడీపీకి షాక్ తప్పట్లేదుగా !!

telugudesamparty-ysrcongressparty

టీడీపీ వయసు 37 ఏళ్ళు. ఆ పార్టీ పెట్టిన నాటి నుంచి ఏపీలో ఎంపీ సీటు కొట్టనిది ఒకటి ఉంది. అది కడప. ఆ తరువాత టీడీపీకి చిక్కకుండా దక్కకుండా చేస్తున్న మరో సీటు విశాఖ ఎంపీ. టీడీపీ 1982లో ఏర్పాటు చేశాక ఇప్పటికి పదిసార్లు పార్లమెంట్ కు ఎన్నికలు జరిగాయి. ఇందులో టీడీపీ గెలుచుకుంది మాత్రం ముచ్చటగా మూడుసార్లు మాత్రమే. టీడీపీ చరిత్ర చూసుకుంటే ఉమ్మడి ఏపీతో పాటు నవ్యంధ్రను కలుపుకుని మొత్తం 22 ఏళ్ళ పాటు అధికారంలో ఉంది. మరి ఇంత సుదీర్ఘంగా అన్న నందమూరి, చంద్రబాబు హయాంలో ముఖ్యమంత్రులుగా అధికారం చలాయించినా విశాఖ ఎంపీ సీట్లో మాత్రం పసుపు జెండా రెపరెపలు లేకుండా పోయాయి. ఎక్కడైనా ఓటు వేస్తాం కానీ విశాఖ ఎంపీకి కుదరదు పొమ్మంటున్నారు జనం.

మెజారిటీ కాంగ్రెస్ పరం…

టీడీపీ ఏర్పడిన తరువాత ఇప్పటికి అయిదు సార్లు విశాఖ ఎంపీ సీటుని కాంగ్రెస్ కైవశం చేసుకుంది. ఇక్కడ కాంగ్రెస్ కి గట్టి బలం ఉండడమే కారణం. విభజన తరువాత ఆ బలమంతా వైసీపీకి షిఫ్ట్ కావడంతో తాజా ఎన్నికల్లో ఫ్యాన్ గిర్రున తిరిగింది. ఇక 2014 ఎన్నికల్లో మోడీ గాలిలో ఒకసారి బీజేపీ కూడా ఇక్కడ తన తడాఖా చూపించింది. నిజానికి టీడీపీకి మొదట్లో విశాఖ సిటీలో మంచి బలమే ఉండేది. అన్న గారు పార్టీ పెట్టాక 1984లో జరిగిన ఎన్నికల్లో మాజీ మంత్రి దివంగత భాట్టం శ్రీరామమూర్తి ఇక్కడ నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. ఆ తరువాత వలసవాదులకు, విశాఖలో పెద్దగా లేని సామాజిక వర్గానికి టీడీపీ టికెట్లు ఇవ్వడంతో కొంత ఇబ్బంది వచ్చింది. చివరికి రెండుసార్లు ఎంవీవీఎస్ మూర్తి ఎంపీ అయితే అందులో కూడా ఒకసారి అన్న గారి టైంలోనే విజయం దక్కింది. అంటే చంద్రబాబుకి విశాఖ ఎంపీ సీటు చుక్కలే చూపిస్తోందన్నమాట.

కేంద్రంతో సన్నిహితంగా ఉంటేనే….

విశాఖ పారిశ్రామికనగరం. ఇక్కడ పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. అలాగే ఉత్తరాదివారు కూడా ఎక్కువ జనాభా ఉంటారు. వారంతా కేంద్రంలో అధికారంలోకి వచ్చే జాతీయ పార్టీలకే తొలి ప్రాధాన్యత ఇస్తారు. ఒకవేళ జాతీయ పార్టీలు బలంగా లేకపోతే వాటితో పొత్తులు పెట్టుకున్న పార్టీలను నెగ్గిస్తారు. ఇక ఏపీలో వైసీపీ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తాయన్న అంచనాల మధ్య కూడా ఈసారి వైసీపీకి ఓటు వేసి విశాఖ ఎంపీ సీటుని జనం కట్టబెట్టారు. మరో వైపు టీడీపీ బీజేపీతో పొత్తు తెంచుకోవడమే కాకుండా మోడీని టార్గెట్ చేయడం వల్ల కూడా విశాఖ ఎంపీ సీటు చేజారింది. ఏది ఏమైనా గత రెండు దశాబ్దాలుగా ఎనలేని పోరాటం చేస్తున్నా కూడా విశాఖ ఎంపీ సీటుని మాత్రం టీడీపీ దక్కించుకోలేకపోవడం విశేషమైతే ఇపుడు ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ విశాఖ సిటీపై ప్రత్యేక శ్రధ్ధను పెట్టాలనుకుంటోంది. అదే కనుక జరిగితే ఇక్కడ ఆ పార్టీకి బలమైన పునాదులు ఏర్పడతాయి. అపుడు 2024 నాటికి కూడా పసుపు పార్టీ కల సాకారం అయ్యే చాన్స్ ఉండదేమో.

Ravi Batchali
About Ravi Batchali 16596 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*