
ఒకే ఇంట్లో రెండు పదవులా…? ఇక వేరేవారికి అవకాశం ఇవ్వకూడదా? ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గంలో ఈ ప్రచారం జోరుగా సాగింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త టీజీ వెంకటేశ్ కుమారుడు టీజీ భరత్ తెలుగుదేశం పార్టీ తరుపున అభ్యర్థిగా బరిలోకి దిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ తరుపున ముస్లిం సామాజిక వర్గానికిచెందిన అబ్దుల్ హఫీజ్ ఖాన్ పోటీ చేశారు. ఇద్దరి మధ్య పోరు హోరా హోరీ నడిచింది. రెండు పార్టీల నేతలు గెలుపు తమవైపే ఉందని చెబుతున్నారు. కానీ ఇక్కడ పనిచేసిన నినాదం టీజీ భరత్ విజయంపై ఎఫెక్ట్ పడిందంటున్నారు.
రాజ్యసభ సభ్యుడిగా….
టీజీ వెంకటేశ్ ప్రముఖ పారిశ్రామికవేత్త. కర్నూలు పట్టణంలో బలమైన నేతగా ఉన్నారు. వైశ్య సామాజిక వర్గానికి చెందని టీజీ వెంకటేష్ కాంగ్రెస్ సేత. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. గత ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ఎస్వీ మోహన్ రెడ్డిచేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన పట్టుబట్టి మరీ చంద్రబాబును అడిగి రాజ్యసభ సభ్యత్వాన్ని తెచ్చుకున్నారు. ఆయన మరో నాలుగేళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా ఉంటారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు.
ఎస్వీ టిక్కెట్ దక్కకపోవడంతో….
అయితే వైసీపీ గుర్తుమీద గెలిచిన ఎస్వీ మోహన్ రెడ్డి 2016లో టీడీపీలో చేరిపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా తనకు టిక్కెట్ ఇవ్వాలని ఎస్వీ మోహన్ రెడ్డి గట్టిగానే పోరాడారు. ముఖ్యమంత్రి తనయుడు నారాలోకేష్ కర్నూలు పర్యటనలో అభ్యర్థిగా ఎస్వీ మోహన్ రెడ్డి ఉంటారని ప్రకటించారు కూడా. అయితే టీజీ వెంకటేష్ గట్టి గా పట్టుబట్టడం, భూమా ఫ్యామిలీలో మూడు టిక్కెట్లు ఏంటని? పార్టీలో చర్చకు దారితీయడం వంటి కారణాలతో ఎస్వీ మోహన్ రెడ్డిని పక్కన పెట్టి టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ కు చంద్రబాబు టిక్కెట్ఇచ్చారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి తిరిగి వైసీపీలో చేరిపోయారు.
వైసీపీకి ఎడ్జ్ ఉందని….
టీజీ వెంకటేష్ రాజ్యసభ సభ్యుడిగాఉన్నారని, తిరిగి ఆయన కుమారుడికి టిక్కెట్ ఇవ్వడమేంటన్న చర్చ టీడీపీలోనే జోరుగాజరిగింది. దీంతోపాటు ప్రజల్లో కూడా ఈ ప్రచారాన్ని బాగానే ప్రత్యర్థి పార్టీ వైసీపీ తీసుకెళ్లగలిగింది. ముఖ్యంగా ముస్లింలు, బ్రాహ్మణులు, బీసీల్లో ఈ చర్చ బాగా పనిచేసిందంటున్నారు. వారి కుటుంబానికే అన్ని పదవులు కావాలా? అన్న ప్రశ్న తలెత్తడంతో కర్నూలులో టీజీ వెంకటేష్ కుమారుడు భరత్ విజయం అంత సులువు కాదంటున్నారు. పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి టీజీని ఓడించాలని కసితో పని చేయడం వైసీపీ అభ్యర్థికి కలసి వచ్చిందంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Leave a Reply