టీడీపీకి గుడ్ బై చెప్పేస్తారా….. ?

తోట త్రిమూర్తులు ఈ పేరు చెప్పగానే అందరికి గుర్తుకు వచ్చేది రామచంద్రాపురం ఎమ్యెల్యే. దళితుల శిరోముండనం కేసులో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఖ్యాతికెక్కారు తోట త్రిమూర్తులు. రెండు దశాబ్దాలు దాటినా ఆ కేసు విచారణ ఇంకా సాగుతూ ఉండగా తోట త్రిమూర్తులు పలు సంచలన రాజకీయ నిర్ణయాలకు కేంద్ర బిందువుగా మారుతూ వచ్చారు. విభిన్నమైన తీర్పు ఇచ్చే తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి ఆ తరువాత టిడిపి లోకి ఆ తరువాత చిరంజీవి ప్రజా రాజ్యం, అటు పిమ్మట కాంగ్రెస్ లోకి చిరంజీవి తో నడిచి తిరిగి టిడిపి గూటికి చేరి కొనసాగుతున్న త్రిమూర్తులు కు ఇప్పుడు సందిగ్ధ పరిస్థితి రాజకీయంగా ఎదురు అవుతుంది. ఆయన కొనసాగుతున్న టిడిపికి వచ్చే ఎన్నికల్లో గుడ్ బై కొట్టక తప్పని పరిస్థితి సామాజికపరంగా ఎదుర్కొంటున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఎలాంటి వత్తిడి ఎదురైందో అదే వత్తిడి ఇప్పుడు క్యాడర్ నుంచి జనసేనలోకి చేరి తీరాలన్న డిమాండ్ రోజు రోజుకు పెరిగిపోతుంది.

రెండు కులాల నడుమ …

తోట త్రిమూర్తులు ఎంటర్ కాకముందు క్షత్రియ సామాజికవర్గం, కమ్మ సామజిక వర్గం రామచంద్రపురం రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఎప్పుడైతే బలమైన శెట్టిబలిజ సామాజిక వర్గం నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, మరో బలమైన కాపు సామాజిక వర్గం నుంచి తోట త్రిమూర్తులు పాలిటిక్స్ లోకి వచ్చారో నియోజకవర్గ ముఖ చిత్రం మొత్తం మారిపోయింది. రెండు సామాజిక వర్గాల నేతల్లో ఎవరో ఒకరిని గెలిపించి అసెంబ్లీకి పంపడం ఈ నియోజకవర్గ ఓటర్లు రివాజుగా మార్చేశారు. రెండు సామాజిక వర్గాలనుంచి గెలుపు ఓటములు ఇతర సామాజిక వర్గాలు నిర్ణయిస్తూ వస్తుంటాయి. తోట, పిల్లి నడుమ పార్టీలన్నవి నామ మాత్రంగానే మిగులుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికలకు టిడిపి లో కొనసాగడం అన్నది తోటకు సొంత సామాజిక వర్గంనుంచి వచ్చే వత్తిడిని ఎదుర్కొని కష్టమే అన్నది అక్కడి వారి టాక్. తోట పార్టీ మారబోతున్నారంటూ చాలా కాలంగా ఆయనపై గట్టిగా ప్రచారం సాగింది. ఆయన తొలుత వైసిపి లోకి వెళతారన్న ప్రచారం సాగింది. పిల్లి బోస్ అభ్యంతరాల నడుమ ఆ విషయం అటకెక్కింది. ఆ తరువాత గోదావరి జిల్లాల్లో జనసేన కు సొంత సామాజిక వర్గం నీరాజనాలు పడుతున్న పరిస్థితుల్లో తోట అడుగులు ఆటే వెయ్యక తప్పదన్నది విశ్లేషకుల అంచనా.

త్రిమూర్తులు కుమారుడి నిశ్చితార్ధానికి …

వచ్చే ఎన్నికల్లో బాబు కు తోట హ్యాండిచేస్తారన్న టాక్ ఉండగానే త్రిమూర్తులు తన కుమారుడి నిశ్చితార్ధానికి పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా ఆహ్వానించడం జనసేనాని కూడా హాజరుకావడం మరో చర్చకు తెరలేపింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో మెగాస్టార్ అడుగులో అడుగు వేసిన తోట నాటి ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తరువాత పిల్లి బోస్ మంత్రి పదవికి శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి వైసిపి లో చేరిన తరువాత జరిగిన ఉపఎన్నికల్లో తోట త్రిమూర్తులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి ఎమ్యెల్యే అయ్యారు. విభజన దెబ్బకు కాంగ్రెస్ కు జనం ఓటెయ్యరని గ్రహించిన తోట 2014 ఎన్నికల్లో టిడిపిలో చేరి మళ్ళీ గెలిచారు. ఇప్పుడు 2019 ఎన్నికల్లో జనసేన లో తోట చేరితే ప్రజారాజ్యం లో ఎదురైన చేదు అనుభవాలు ఆయన్ను ఒకవైపు భయపెడుతున్నాయి. ఆయన ఏ పార్టీలో వున్నా ఆయన సామాజిక వర్గం ఓటర్లు త్రిమూర్తులు వెంటే ఉంటారని గత ఎన్నికల్లో నమోదైన ఓట్లు చెబుతున్నాయి. అయితే ఇతర కులాల ఓటర్లను కలుపుకుని వెళ్లగలిగితేనే ఆయన గెలుపు సాధ్యం అవుతుంది. కమ్యూనిటీ ఈక్వేషన్స్ మీద ఆధారపడే నడిచే ఇక్కడి ఎన్నికల్లో తోట భవిష్యత్తులో తీసుకునే నిర్ణయం ఆయన హ్యాట్రిక్ సాధిస్తారా లేదా అన్నది తేలుస్తుంది.

Ravi Batchali
About Ravi Batchali 26825 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*