తోట ‘‘వాణి’’ విన్పిస్తుందా…?

thota-vani-ysrcongress-party

పెద్దాపురం నియోజకవర్గం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అట్రాక్షన్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి చినరాజప్ప ఈసారి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. చినరాజప్ప గెలుపు అంత ఈజీ కాదన్నది పరిస్థితులను బట్టి చూస్తుంటే అర్థమవుతోంది. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో చినరాజప్ప మరోసారి పోటీకి దిగుతున్నారు. చినరాజప్ప స్థానికుడు కాకపోయినప్పటికీ గత ఎన్నికల్లో పెద్దాపురం ప్రజలు ఆదరించారు. చినరాజప్ప స్వస్థలం అమలాపురం. గత ఐదేళ్లుగా నియోజకవర్గం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అది కాదనలేని వాస్తవం. అయితే పార్టీలో అసంతృప్తులు ఆయనకు తలనొప్పిగా మారబోతున్నాయి.

ఇద్దరూ స్థానికేతరులే…..

మరోవైపు నిన్న మొన్నటి వరకూ తెలుగుదేశం పార్టీలోనే ఉండి రాత్రికి రాత్రి పార్టీ మారిన తోట నరసింహం దంపతులు పెద్దాపురం టిక్కెట్ తెచ్చుకున్నారు. తోట నరసింహం ఆరోగ్యం సక్రమంగా లేకపోవడంతో ఆయన సతీమణి తోట వాణి పోటీకి దిగారు. వైసీపీ అభ్యర్థిగా ఆమె బరిలో ఉన్నారు. మెట్ల సత్యనారాయణ కూతురిగా తోట వాణి పెద్దాపురం ప్రజలకు పరిచయమైనా ఆమె కూడా అక్కడ స్థానికేతరులే కావడం విశేషం. వారిది జగ్గంపేట నియోజకవర్గం. తోట నరసింహం దంపతులు పట్టుబట్టి మరీ పెద్దాపురం టిక్కెట్ ను తెచ్చుకున్నారు. తాము గెలుస్తామన్న ధీమాతోనే పెద్దాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు.

కాపు సామాజిక వర్గమే….

పెద్దాపురం నియోజకవర్గంలో రెండు పెద్ద మున్సిపాలీటీలు ఉన్నాయి. పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీ పరిధిలో ఈ నియోజకవర్గం ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత పెద్దాపురం నియోజకవర్గంలో 2014 ఎన్నికల ముందు వరకూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే దాదాపు ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కానీ గత ఎన్నికల్లో మాత్రం కాపు సామాజికవర్గానికి చెందిన చినరాజప్పను ఇక్కడకు తెచ్చి విజయం సాధించింది. ఈ నియోజకవర్గంలో ఎక్కువగా బీసీలే ఉన్నారు. 48 వేల మంది వరకూ కాపులున్నారు. కాపు సామాజిక వర్గమే ఇక్కడ గెలుపోటములను డిసైడ్ చేస్తుంది.

చినరాజప్పకు చిక్కులేనా….?

ఒకవైపు హోంమంత్రి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. మైనింగ్ ఆరోపణలను ఆయన తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. మరోవైపు బొడ్డు భాస్కరరామారావు చినరాజప్పకు వ్యతిరేకంగా చేసే అవకాశముంది. తెలుగుదేశం పార్టీ స్థానిక నేతలే చినరాజప్పను వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆయన అందరినీ కలుపుకుని వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే తోట వాణి మాత్రం దూకుడుగా వెళుతున్నారు. కాపు సామాజిక వర్గంతో పాటు టీడీపీలో ఉన్న కొంతమందిని తమవైపు తిప్పుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో తోట వాణికి బంధువులు కూడా ఎక్కువగా ఉండటంతో ఆమెకు కలసి వచ్చే అంశంగా చెబుతున్నారు. మొత్తం మీద చివరి క్షణంలో పార్టీ మారి టిక్కెట్ తెచ్చుకున్న తోట వాణి పెద్దాపురంలో పాగా వేస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Ravi Batchali
About Ravi Batchali 32298 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*