రెండు చోట్లా ఆయనేనా….!!

ticket-fighting-in-rajahmundry-rural-constiuency

పొత్తులో భాగంగా గత ఎన్నికల్లో టిడిపి వదులుకున్న రాజమండ్రి అర్బన్ సీటు రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ఈ స్థానంపై రూరల్ ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నం చేయడంతో సైకిల్ పార్టీలో వర్గ పోరు తారా స్థాయికి చేరుకుంటుంది. ఈ టికెట్ మాకే దక్కాలని ముగ్గురు హేమాహేమీలు సిగపట్లకు దిగుతుండటంతో అధిష్టానానికి తలపోట్లు తప్పేలా లేదు. గోరంట్లకు పోటీ గా గోదావరి అర్బన్ డెవలెప్ మెంట్ అధారిటీ ఛైర్మెన్ గన్ని కృష్ణ, ఎమ్యెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఢీ అంటే ఢీ అని తలపడుతున్నారు. దాంతో రాజమండ్రి రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కిపోతున్నాయి.

పల్లకి మోసేది లేదంటున్న గన్ని కృష్ణ…

దశాబ్దాలుగా పార్టీకి సేవ చేస్తున్నా తనతో పాటు పార్టీలో చేరినవారు ఎమ్యెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయ్యారు. తాను మాత్రం నామినేటెడ్ పదవికే పరిమితం అయ్యాననే భావనతో వున్నారు గూడా ఛైర్మెన్ గన్ని కృష్ణ. ప్రతి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి చిత్తశుద్ధితో కృషి చేసిన తాను ఇక పల్లకి మోసే ఓపిక లేదన్నారు. ఈసారి ఇదే విషయాన్ని అధినేతకు స్పష్టం చేసేస్తానని అంటున్నారు గన్ని. అయితే అధిష్టానం ఫైనల్ గా టికెట్ ఎవరికి ఇచ్చినా పార్టీకి చివరిసారి పని చేస్తానని కూడా చెప్పడం విశేషం. తన పుట్టిన రోజు సందర్భంగా గన్ని చేసిన వ్యాఖ్యలు సంచలనమే అయ్యాయి. ఇటీవల కొందరు పుట్టినరోజు పేరుచెప్పి ఫ్లెక్సీలు ఊరంతా వేయించుకొన్నారని, తాను అలా చేయనని సేవాకార్యక్రమాలు చేపడతానని ప్రత్యర్థులను దెప్పి పొడుస్తున్నారు గన్ని.

అమీతుమీకి ఆదిరెడ్డి సిద్ధం …

రాజమండ్రి, అర్బన్, రూరల్ నియోజకవర్గాలపై కన్నేసిన ఎమ్యెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మంచి దూకుడు మీద వున్నారు. తన కుమారుడు శ్రీనివాస్ కోసం ఆదిరెడ్డి చేయని కార్యక్రమం లేదు. శుభ, అశుభ కార్యక్రమాలన్నిటిలో తన సహాయం ఉండేలా గత రెండేళ్లుగా పని చేస్తూ క్యాడర్ ను తమవైపు తిప్పుకుంటున్నారు ఆయన. పార్టీ తలపెట్టే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొటున్నారు. రెండు నియోజకవర్గాల్లో కోట్లరూపాయల నిధులు తానే ముఖ్యమంత్రిని ఒప్పించి తెచ్చినట్లు ఆయన జీవోలు చూపిస్తూ టిడిపి లో టికెట్ ఆశిస్తున్న వారికి ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. దాంతో ఇటు అర్బన్ అటు రూరల్ ఎమ్యెల్యేలు ఆయన పై గుర్రుగా వున్నారు. తమ నియోజకవర్గాల్లో ఆదిరెడ్డి జోక్యం ఏమిటని ఆ నిధులు తామే తెచ్చామని మీడియా సమావేశాల్లో చెప్పుకొస్తున్నారు. వ్యవహారం ఈ రకంగా సాగుతూ ఉండటంతో అప్పారావు వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పార్టీ టికెట్ దక్కించుకునేందుకు సిద్ధం అయిపోయారు.

గోరంట్ల అంత ఈజీగా వదలరుగా …

పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన రాజమండ్రి రూరల్ ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అర్బన్ స్థానం తిరిగి ఆశిస్తున్నారు. బిజెపితో పొత్తును 2014 లోనే బాహాటంగా వ్యతిరేకించిన గోరంట్ల తన సీనియారిటీని ఉపయోగించి తిరిగి తన స్థానం తాను దక్కించుకునే ఎత్తుగడల్లో నిత్యం బిజీగా గడుపుతున్నారు. ఒక పక్క రూరల్ లో కార్యక్రమాలు చేస్తూనే అర్బన్ లో తన అనుచరగణంతో కార్యక్రమాలు ఏర్పాటు చేయించి రెండు చోట్లా తానే అనే రీతిలో చక్రం తిప్పేస్తున్నారు. అర్బన్ వ్యవహారాల్లో గోరంట్ల తలదూర్చకుండా గన్ని కృష్ణ, ఆదిరెడ్డి అప్పారావు లకు అధిష్టానం ఇంచార్జ్ హోదా కల్పించినా గోరంట్ల తనదైన శైలిలో అర్బన్ పార్టీని నడిపిస్తున్నారు. పార్టీ సిటీ అధ్యక్షుడు తన సొంత మనిషి కావడంతో గోరంట్ల ప్రమేయం లేకుండా కార్యక్రమాలు ముందుకు సాగని పరిస్థితి నడుస్తుంది. ఇది ఇప్పుడు ఆయనను వ్యతిరేకిస్తున్న రెండు వర్గాల శిబిరాల్లో అగ్గి రాజేస్తోంది. మరి ఈ ముగ్గురి సమరాన్ని చాపకింద నీరులా సాగుతున్న అంతర్గత పోరాటాన్ని అధిష్టానం ఏ రకంగా చల్లారుస్తుందో చూడాలి.

Ram Tatavarthi
About Ram Tatavarthi 1795 Articles
Ram has been continuing in the journalism for the past 25 years. He started his career from Samacharam and worked for various print and electronic media houses like Eenadu, Andhra Bhoomi, the evening daily Sandhya, in cable, Andhra Prabha, Citi Cable, TV 9, CCC channel etc.. By having extensive experience in journalism and also by always keeping up to date with the latest technology he is now working as a freelance journalist.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*