అధికారాలేమీ లేకున్నా… కీలక సమయంలో?

ఉపాధ్యక్షుడు

అంతర్జాతీయ సమాజం చూపంతా అమెరికా అధ్యక్షుడిపైనే ఉంటుంది. అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికవుతారు, ఆయన వైఖరి ఎలా ఉంటుంది, తమ దేశానికి కలిగే లాభ, నష్టాలపైనే వివిధ దేశాల అధినేతలు చర్చించుకుంటారు. అంతేతప్ప ఉపాధ్యక్ష పదవి ఒకటి ఉంటుందని, అతని అధికారాలు, అధికార పరిధులు, పాత్ర గురించి ఎవరికీ అంత లోతుగా తెలియదు. అయితే అమెరికా చరిత్రలో ఒక మహిళ, అందునా విదేశీ (భారతీయ) మూలాలున్న ఒక మహిళ కమలా హారిస్ ఎన్నికవడంతో ఇప్పుడు చర్చంతా ఉపాధ్యక్ష పదవిపై నడుస్తోంది. ఈ నెల 20న అధ్యక్ష, ఉపాధ్యక్షులు బైడెన్, కమలా హారిస్ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఉపాధ్యక్ష పదవిపై అంతటా ఆసక్తి నెలకొంది.

విశేష అధికారలేమీ లేవు….

రెండు శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన అమెరికా రాజ్యాంగం ఉపాధ్యక్షుడికి విశేష అధికారాలు ఏమీ కట్టబెట్టలేదు. అదే సమయంలో ఆయన పాత్రను తక్కువ చేసి కూడా చూడలేదు. కొన్ని సందర్భాల్లో ఆయనకు కీలక పాత్ర కల్పించింది. అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల ఫలితాలను నిర్థారించే అధికారాన్ని ఆయనకే కట్టబెట్టింది. ఈ సందర్భంగానే ఇటీవల రిపబ్లికన్ పార్టీకి చెందిన ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఫలితాల నిర్థారణ సందర్భంగా నిక్కచ్చిగా వ్యవహరించి అందరి మన్ననలు అందుకున్నారు. హుందాగా వ్యవహరించి ఉపాధ్యక్ష పదవికి వన్నె తెచ్చారు. ఫలితాల ప్రకటన సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి వచ్చిన ఒత్తిళ్లను లెక్క చేయకుండా స్వతంత్రంగా వ్యవహరించారు. దీనిని బట్టి ఉపాధ్యక్షుడికి రాజ్యాంగం ఎంతటి ప్రాధాన్యం కల్పించిందో అర్థమవుతుంది.

అవసరమైన సమయంలో…..

అదే సమయంలో అవసరాన్నిబట్టి, సందర్భాన్ని బట్టి అధ్యక్ష పదవిని చేపట్టేందుకు ఉపాధ్యక్షుడికి అవకాశం కల్పించింది. అధ్యక్షుడు మరణించినా, తీవ్ర అనారోగ్యం పాలైనా, అభిశంసనకు గురైనా, మరే కారణం చేత పదవి నుంచి వైదొలగినా నేరుగా అధ్యక్ష పదవిని చేపట్టవచ్చు. మిగిలిన పూర్తి పదవీ కాలానికి అధ్యక్షుడిగా కొనసాగవచ్చు. తద్వారా దేశాన్ని పాలించే, ప్రపంచాన్ని ప్రభావితం చేసే అరుదైన అవకాశం ఉపాధ్యక్షుడికి కల్పించింది. 1800 సంవత్సరం ప్రాంతంలో నాటి అధ్యక్షుడు విలియం హెన్రీ అధ్యక్ష పదవిని చేపట్టిన నెల రోజులకే మరణించారు. దాంతో ఉపాధ్యక్షుడు జాన్ టైలర్ పూర్తికాలం అధ్యక్షుడిగా వ్యవహరించారు.

మన ఉప రాష్ట్రపతికీ…..

అమెరికా ఉపాధ్యక్షుడికి, భారత ఉప రాష్ర్టపతికి కొన్ని పోలికలు ఉన్నాయి. మన దేశంలో ఉప రాష్రపతి రాజ్యసభ సభ్యుడు కానప్పటికీ ఎక్స్ అఫీషియో సభ్యుడు హోదాలో సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. ఏదైనా అంశంపై అధికార, విపక్షాల మధ్య ఓటింగ్ జరిగి ఇరువురికి సమాన ఓట్లు లభించినప్పుడు ఓటేస్తారు. మంత్రివర్గ సమావేశాలకు హాజరుకారు. రాష్ట్రపతి మరణించినా, తీవ్ర అనారోగ్యం పాలైనా తాత్కాలిక రాష్ట్రపతిగా ఆరు నెలల పాటు మాత్రమే వ్యవహరిస్తారు. అమెరికా ఉపాధ్యక్షుడు కూడా మన రాజ్యసభ లాంటి సెనెట్ కు అధ్యక్షత వహిస్తారు. ఆయనకూ కీలక సందర్భాల్లో అంటే ఇరు పక్షాలకూ సమాన ఓట్లు వచ్చినప్పుడు ఓటేసే అధికారం ఉంటుంది. మన ఉప రాష్రపతి మాదిరిగా కాకుండా అమెరికా ఉపాధ్యక్షుడు మంత్రివర్గ సమావేశాలకు
హారవుతారు. ఉపాధ్యక్ష పదవి ఎలాంటి అధికారాలు లేని ఆరో వేలు వంటిదన్న విమర్శలు ఉన్నప్పటికీ ఆయనకూ కొన్ని సందర్భాల్లో కీలకంగా వ్యవహరించే అవకాశం ఉందన్న వాస్తవాన్ని విస్మరించరాదు. ప్రత్యేక సందర్భాల్లో ఏకంగా అమెరికా అధ్యక్ష పదవినే అందుకునే అవకాశం ఉంది. అందువల్ల ఉపాధ్యక్ష పదవి మరీ అంత కీలకం కాదు, మరీ అంత అప్రాధాన్య పదవి కూడా కాదన్నది వాస్తవం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 35931 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*