
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి నలుగురు వ్యక్తులు ఏం చేయబోతున్నారనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. ముగ్గురు మాత్రం యాక్టివ్ గా కనిపిస్తున్నారు. మరో వ్యక్తి తన తెరవెనక పాత్రలోనే ఒదిగి ఉండిపోయారు. వారే ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, కేవీపీ రామచంద్రరావు. వీరిలో ఒక్కొక్కరిది ఒక్కో రకమైన బలం. వ్యూహాలు, తెరవెనక తతంగాలు, ప్రజల్లో భావోద్వేగాలు రేకెత్తించడం, ఒక తార్కికమైన వాదనను ప్రజల ముందు పెట్టడం వంటివి వీరి విడివిడి ప్రత్యేకతలు. 2019 ఎన్నికల్లో వీరు పోషించబోయే పాత్ర ఏమిటనేదే ఇప్పుడు చర్చ. ఏ పార్టీకి వీరు ప్రత్యక్ష, పరోక్ష సహకారం అందించబోతున్నారన్న చర్చ నడుస్తోంది. ఉండవల్లి రాజకీయాల్లో ఉండనంటూనే పాలిటిక్స్ పై ప్రజల్లో అమితాసక్తి రేకెత్తిస్తున్నారు. సబ్బం హరి కొంచెం తెలుగుదేశం పార్టీ వైఖరికి చేరువ అవుతూ రంగప్రవేశానికి వేదికను సిద్ధం చేసుకుంటున్నారు. లగడపాటి రాజగోపాల్ తన పొలిటికల్ యాక్టివిటీని బాగా విస్త్రుతం చేశారు . తన మార్కు సర్వేలకు పదును పెడుతున్నారు. అధికార పార్టీతో టచ్ లో ఉన్నారు. వీరందరిలోనూ నిగూఢమైన వ్యక్తిత్వం కేవీపీ రామచంద్రరావుది. కాంగ్రెసు పార్టీలోనేకొనసాగుతూ అధిష్ఠానం వద్ద పలుకుబడిని బాగానే పెంచుకున్నారు కానీ ఆయన కార్యకలాపాలు ఏమిటనేది మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు.
ఉండవల్లి మాత్రం…
ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి రెండోసారి ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నప్పటికీ విభజన ఇంకా రాజ్యాంగబద్ధం కాదంటారు ఉండవల్లి అరుణ్ కుమార్. సుప్రీం కోర్టులో ఈ విషయమై ఆయన వేసిన కేసు అతీగతీ లేకుండా పడి ఉంది. వాగ్ధాటి, చెప్పే విషయంలో తార్కికతతో ప్రజలను,మీడియాను ఆకట్టుకోవడంలో దిట్ట. రెండుసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన అరుణ్ కుమార్ కు కాంగ్రెసులో మంచి పేరు ఉండేది. రాష్ట్రవిభజన తర్వాత పూర్తిగా పార్టీనే ఆయన దూరం పెట్టారు. అయితే పొలిటికల్ యాక్టివిటీ మాత్రం చేస్తున్నారు. పోలవరం, భ్రమరావతి వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని బాగా ఇరుకున పెట్టారు. తాజాగా ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకుని అఖిలపక్షాన్ని నిర్వహించారు. తన మనసులోని భావాలను దాచుకోవడానికి ఇష్టపడరు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, జగన్ కు మధ్య వ్యత్యాసాన్ని స్పష్టంగా చెప్పగలరు. జగన్ పై తనకున్న అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టగలరు. అదే ఆయనకు రాజకీయ, మీడియా, పబ్లిక్ వేదికలపై క్రెడిబిలిటీ తెచ్చిపెట్టింది. తాజాగా ఆయన చేపట్టిన చర్యలు వైసీపీకి కొంత అడ్వాంటేజ్ అవుతాయనే భావన వ్యక్తమవుతోంది.
బాబుకు దగ్గరగా లగడపాటి…
ఆంధ్రా అక్టోపస్ తెలంగాణ అసెంబ్లీ ఫలితాల అంచనాల్లో బొక్కబోర్లాపడ్డారు. ఆయన స్థాపించిన పరిశ్రమలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆర్థికంగా సంక్షోభ పరిస్థితి. అయితే వ్యాపార కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. సర్వేల పేరిట ఎంతగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారో, ఇటీవల తెలంగాణపై అంచనాల్లో అంతగానూ చెడ్డపేరు మూటగట్టుకున్నారు. క్రమేపీ తెలుగుదేశం పార్టీకి సన్నిహితమవుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో దఫదఫాలుగా చర్చిస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయవాతావరణాన్ని మదింపు చేయడానికి ఆయన పై చంద్రబాబు ఆధారపడుతున్నట్లుగా పార్టీ వర్గాల సమాచారం. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉంటున్నప్పటికీ ఏదేని అవకాశం కలిసి వస్తే అందిపుచ్చుకునేందుకు సిద్దమేననేది ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. చంద్రబాబుకు , లగడపాటికి మధ్య పొలిటికల్ అండర్ స్టాండింగ్ కుదిరిందని రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి. నియోజకవర్గాల వారీ సర్వేలు చేసి , దిద్దుబాటు చర్యలకు సంబంధించి ప్లానింగ్ ను లగడపాటి అందచేస్తున్నారని టీడీపీ వర్గాలు విశ్వసిస్తున్నాయి.
సబ్బం హరి….
ఒకప్పుడు జగన్ కు సన్నిహితంగా మెలిగేవారు. జగన్ ఎంపీగా ఎన్నికైన కొత్తలో ఢిల్లీలో అందరి వద్దకూ తీసుకెళ్లి పరిచయాలు చేసే కార్యక్రమం సబ్బం నేతృత్వంలోనే సాగుతుండేది. వైసీపీ స్థాపించిన తర్వాత ఏకవచనంతో పిలిచేంత చనువు తనకు ఇబ్బందికరమని జగన్ దూరంగా పెడుతూ వచ్చారు. దీనిని గ్రహించిన సబ్బం కూడా దూరమయ్యారు. తెలుగుదేశం పార్టీతో ఏడాదికాలంగా టచ్ లో ఉన్నారు. ప్రజల నాడి పట్టి చూసే పొలిటీషియన్ గా, వాస్తవిక దృక్పథంలో రాజకీయాలను అవగాహన చేసుకున్న వ్యక్తిగా సబ్బం కు మంచి పేరు ఉంది. తార్కికంగా ఒక విషయాన్ని విశ్లేషించి, అది నిజమేనని మీడియా చేత ఒప్పింపచేయడంలో దిట్ట. ఆయన సేవలను టీడీపీ వ్యూహరచన, మేనిఫెస్టోకు సంబంధించిన విషయాల్లో వాడుకోవచ్చని తెలుస్తోంది. ఫలితంగా ఎంపీ స్థానాన్ని ఇచ్చేందుకు ఆస్కారం ఉందని పార్టీలో చర్చ నడుస్తోంది.
కేవీపీ రూట్….
వైఎస్ జమానాలో ఆయనతో సమానమైన ప్రధాన్యాన్ని పొందిన వ్యక్తి కేవీపీ రామచంద్రరావు. తెరవెనక తతంగాలన్నీ కేవీపీ హయాంలోనే సాగుతుండేవి. ఎన్నికల వంటి సందర్భాల్లో ఎవరికి నిధులివ్వాలి? వాటిని ఎక్కడ్నుంచి సమకూర్చాలి? వంటి కీలకాంశాలను ఆయనే చూస్తుండేవారు. వైఎస్ నిర్ణయం తీసుకుంటే అమలు బాధ్యత కేవీపీదే. రాష్ట్ర విభజన తర్వాత అంతటి ముఖ్యనేత వెలుగూ క్షీణిస్తూ వచ్చింది. కాంగ్రెసులోనే ఉంటున్నప్పటికీ రాజకీయ భవిష్యత్తు శూన్యమనేది ఆయనకు తెలుసు. అలాగని తొలి నుంచి ఉన్న పార్టీని వదిలి వైసీపీలోకి వెళ్లలేని దుస్థితి. జగన్ తనకు పెద్దగా ప్రాధాన్యమివ్వరని ఆయనకు తెలుసు. అయితే వైసీపీకి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తూ దిశానిర్దేశం చేయాల్సిందిగా ఇటీవలి కాలంలో రాయబారాలు నడిచినట్లు తెలుస్తోంది. జగన్ కోరితే ఆ పాత్ర నిర్వహించేందుకు సిద్ధమేనన్నట్లుగా సంకేతాలు పంపుతున్నారు. తన తండ్రితో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా తనపై పెత్తనం చేస్తారేమోననే సందేహంతో జగన్ దూరం పెడుతున్నారు. మొత్తమ్మీద ఈ నలుగురు రానున్న ఎన్నికల్లో ఏదోరకమైన పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్నారు.
– ఎడిటోరియల్ డెస్క్
Leave a Reply