ఉండవల్లి ఊరికే అంటారా?

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేవనెత్తిన అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి. ఆదరణ, ఎన్టీఆర్ క్యాంటిన్ వంటి పథకాల్లో కూడా అవినీతిని ఆయన ప్రశ్నించడం అధికార తెలుగుదేశం పార్టీని ఇరుకునపెడుతుంది. ఉండవల్లి అరుణ్ కుమార్ సీనియర్ నేత. ఆయన ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలో లేరు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత ఉండవల్లి దాదాపు రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. అయితే ప్రభుత్వం చేస్తున్న తప్పొప్పులను ఉండవల్లి ప్రశ్నిస్తూ వస్తున్నారు. పోలవరం, పట్టిసీమ, అమరావతి బాండ్లు ఇలా ఒకటేమిటి…చివరికి ఎన్టీఆర్ క్యాంటిన్లో కూడా అవినీతి జరిగిందని ఉతికారేశారు ఉండవల్లి. వీటిపై దేనిపైనేనా చర్చకు సిద్ధమంటూ ప్రకటించారాయన.

ఏ పార్టీలో లేనని…..

ఉండవల్లి అరుణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరతారనుకున్నారు. అయితే ఆయన అందుకు ఇష్టపడలేదు. తాను ఇక రాజకీయాలు చేయలేనని చెప్పేశారు. ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంటికి స్వయంగా వైసీపీ అధినేత జగన్ వచ్చినప్పుడు కూడా ఆయన వైసీపీలో చేరతారన్న అనుమానాలు వచ్చాయి. కానీ ఉండవల్లి అన్ని పార్టీలకూ సమానదూరాన్ని పాటిస్తున్నారు. మొన్నా మధ్య జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెట్టిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి కూడా హాజరయ్యారు. ఇంకేముంది ఆయన పవన్ పార్టీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది. అందుకు ఉండవల్లి వెంటనే స్పందించారు. పవన్ గౌరవంగా పిలిస్తేనే తాను వెళ్లానని, తాను జనసేనలో చేరేది లేదని స్పష్టం చేశారు.

టీడీపీకి తలనొప్పిగా మారి……

కాని వైసీపీ నేతలకంటే ఉండవల్లి పెట్టే ప్రెస్ మీట్లు తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారాయి. ప్రతి అంశాన్ని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతనే ఆరోపణలు చేసే ఉండవల్లిపై టీడీపీ నేతలు కూడా ఎదురు దాడికి దిగే సాహసం చేయలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు అమరావతి బాండ్ల పై మాత్రం స్పందించారు. అంతే తప్ప పోలవరంపై ఉండవల్లి చేస్తున్న ఆరోపణలకు ఆ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా స్పందించడం లేదు. దీనికి ప్రధాన కారణం ఉండవల్లి చెప్పేదాంట్లో నిజముందని సోషల్ మీడియాలో పెద్దయెత్తున నెటిజన్లు స్పందిస్తున్నారు.

పరోక్షంగా సాయం……

ఉండవల్లి వాస్తవానికి వైసీపీ అధినేత జగన్ కు పరోక్షంగా లాభం చేకూరుస్తున్నారన్న అనుమానం టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. కాని దానిని బయటకు చెప్పలేరు. ఉండవల్లి ఆరోపణలను ఖండించలేరు. దీంతో వైసీపీ వాయిస్ కొంత వీక్ అయినా ఉండవల్లి మీడియా మీట్లతో అధికార తెలుగుదేశం పార్టీ ఆందోళన పడుతోంది. కనీసం రాజమండ్రిలోనే ఉన్న టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఉండవల్లి ఆరోపణలపై స్పందించకపోవడం గమనార్హం. మొత్తం మీద ఉండవల్లి పరోక్షంగా జగన్ పార్టీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సయితం ఉండవల్లి ఊరికే అనరు…నిజం లేకపోతే అని వ్యాఖ్యానిస్తుండం విశేషం.

Ravi Batchali
About Ravi Batchali 35835 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*