
బిజెపి తో అమీతుమీకి చంద్రబాబు పార్లమెంట్ ను వేదిక చేసుకోవాలని వ్యూహం రూపొందించారు. అందుకోసం ప్రత్యేక దళాలను రెడీ చేసి యాక్షన్లోకి దింపేశారు. దేశంలోని 18 పార్టీల ముఖ్య నేతలను కలుసుకుని పార్లమెంట్లో టిడిపి ప్రవేశపెట్టబోయే అవిశ్వాసానికి మద్దsi కోరడంతో బాటు ఏపీకి అండగా నిలవాలని ఈ బృందాలు విజ్ఞప్తి చేయనున్నాయి. ఇప్పటికే మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి నేతృత్వంలోని బృందం టీఆర్ఎస్ నేత కె. కేశవరావు ను కలిసి విభజన బిల్లు హామీలు అమలు కోసం ఎపి చేస్తున్న పోరాటానికి మద్దతు కోరింది. అదేవిధంగా విభజన బిల్లు ను సవరించి రెండు రాష్ట్రాలకు అవసరమైన ప్రయోజనాలను పొందుపర్చాలన్న డిమాండ్ ఇరువర్గాలు ఈ సందర్భంగా వ్యక్తం చేశాయి.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు …
వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే చక్రం తిప్పాలని భావిస్తున్న చంద్రబాబు ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టాలని స్కెచ్ గీశారు. ఒక పక్క బిజెపి ని ఉక్కిరి బిక్కిరి చేసేలా అలాగే దేశంలోని బిజెపియేతర పార్టీలతో సఖ్యత కలిగివుండేలా ద్విముఖ వ్యూహాన్ని ఖరారు చేశారు. ఇది చక్కటి ఫలితం ఇస్తుందని తెలుగుదేశం థింక్ ట్యంక్ భావిస్తుంది. మరోపక్క రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాల్లో ఛాంపియన్ తానె అన్న ప్రొజెక్షన్ లభిస్తుందని కూడా అంటుకుంటున్నారు.
ఉండవల్లి చెప్పింది ఇదేనా…?
చంద్రబాబు కు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటూ లేఖలపై లేఖలు రాస్తున్న మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ సూచనలను టిడిపి కొంతవరకు పరిగణలోకి తీసుకున్నట్లే కనిపిస్తుంది. అన్ని పార్టీల నేతలతో మాట్లాడి అశాస్త్రీయ విభజన, చట్టం అమలు చేసేలా ఒత్తిడి, పార్లమెంట్లో ప్రధాని ఇచ్చిన హామీల అమలుకు అరుణ కుమార్ టిడిపి కి రాజకీయాలకు అతీతంగా అనేక సూచనలు చేస్తూ వచ్చారు. సమాజ్ వాదీ, తృణమూల్, బీఎస్పీ, ఇలా అనేక పార్టీలు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని వారిని సంప్రదించాలని కోరారు. పార్లమెంట్లో నాటి విభజన జరిగిన తీరు పై చర్చ పెట్టాలని పదేపదే ఉండవల్లి అభ్యర్ధించారు. మొత్తానికి ఇప్పటికి ఆదిశగా టిడిపి అడుగులు వేయడంతో బిజెపి ఈ వ్యూహాన్ని ఎలా ఎదుర్కొంటుందన్నది ఆసక్తిగా మారింది. గత సమావేశాల్లో అవిశ్వాసం చర్చకు రాకుండా సభను వాయిదా వేస్తూ వచ్చిన అధికార పక్షం ఈ వర్షాకాల సమావేశాల్లో ఎలా వ్యవహరించనుంది అన్న ఉత్కంఠ ఎపి వాసుల్లో నెలకొనివుంది.
Leave a Reply