ఈ టీడీపీ పెద్దాయన దుమ్ము దులిపేశారే

ఆయన తెలుగుదేశం పార్టీలో ఎన్నో పదవులను అలంకరించారు. మచ్చలేని రాజకీయ జీవితానికి చిరునామాగా పని చేశారు. రైతు బజార్లకు రూపకల్పన చేసిన వ్యక్తి. అవినీతి మకిలి అంటని స్వచ్ఛమైన రాజకీయం ఆయనది. రైతు జనబాంధవుడిగా వెలిగిన ఆ నేత వడ్డే శోభనాధీశ్వర రావు. తెలుగుదేశం పార్టీ కి చెందిన వాడైనా ప్రస్తుత ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు ఆయన. అమరావతిని రియల్ ఎస్టేట్ గా మార్చడం కోసం రైతులకు అన్యాయం చేశారంటూ ఆక్రోశించారు. ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఐవైఆర్ రచించిన అమరావతి ఎవరిది పుస్తకం ఆయనకే అంకితం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వడ్డే, కమ్యూనిస్ట్ లు ఏమన్నారు ?

బలవంతంగా, భయపెట్టే భూములు లాగారు ….

రాజధాని భూసేకరణలో దారుణాలు చేశారు. బలవంతంగా భయపెట్టి భూములు లాక్కున్నారు. ఊరికి ఒక ఆర్డీఓ ను నియమించారు. వారితో తంతంగం నడిపించారు. ఇది మంచి పద్ధతి కాదు. రాష్ట్రం ఆర్ధికంగా బలపడే వరకు ప్రస్తుతం ఉన్న తాత్కాలిక రాజధానిలో వుండండి. ఉద్యోగులకు అవసరమైన క్వార్ట్రర్స్ నిర్మించండి చాలు. పచ్చని భూముల్లో వ్యవసాయ ఆధారిత ఆగ్రో సంబంధిత పనులు అభివృద్ధి చేయండి. ఆధునిక సేద్య పద్ధతులకు ఆ ప్రాంతాన్ని కేంద్రం చేయండి. కనీసం ఇప్పటికైనా ఒంటెద్దు పోకడలు వదిలిపెట్టండి. ఏకపక్ష నిర్ణయాలు మానండి. అమరావతిలో ప్రజలు సంతోషంగా ఉండాలి. ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు. కిలోమీటర్ కి 14 కోట్ల నుంచి 35 కోట్లరూపాయలు వరకు ఎస్టిమేషన్లు పెంచి ఇవన్నీ చేస్తున్నారు. ఇదంతా ఎవరి డబ్బు. ఇలాంటివి ప్రశ్నిస్తే నన్ను విమర్శిస్తున్నారు. ఎవరో ఎదో అంటున్నారని నిజాలు చెప్పడం మానేసేది లేదు. నేను ఆచార్య రంగా, చౌదరి చరణ్ సింగ్ వంటి వారి సహచర్యంలో వున్న వ్యక్తిని. వారు చూపిన బాటలోనే వెళతా. పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో కొత్త ఆశాకిరణం. ప్రజా సమస్యలపై ఆయన నిబద్ధతతో పని చేయాలని కోరుకుంటున్నా. స్వచ్ఛత తో కూడిన రాజకీయాలు ఏపీలో చేయాలని భావిస్తున్నా. ఆయన పోరాటాలను లాజికల్ కంక్లూజన్ కి తీసుకువెళ్లాలి. పుస్తకంలో ఆంధ్రుల రాజధానులు నుంచి ఐవైఆర్ చక్కగా వివరించారు.

రాజధాని నిర్మాణం ప్రజలపై వేస్తారా : సిపిఎం మధు

ఇది మంచి పరిణామం. రాబోయే రోజుల్లో మరిన్ని పుస్తకాలు రావాలి. ఐవైఆర్ కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు పుస్తకంలో. రాజధాని నిర్మాణం అనేది ప్రజలకు భారం కాకూడదు. రాజధానిని లక్ష ఎకరాల్లో లక్షకోట్లతో అంటున్నారు. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేశారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ నుంచి వచ్చిన సామాన్యులు ఇక్కడ ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉందా ? ప్రభుత్వం అనుసరిస్తున్న కేంద్రీకరణ వైఖరి చాలా ప్రమాదకరం. వికేంద్రీకరణ ప్రయోజనాలు కేంద్రీకరణ వల్ల నష్టాలు చాలా ప్రామాణికంగా శివరామకృష్ణన్ కమిటీ తెలియచేసింది. శ్రీకృష్ణ కమిటీ ఉత్తరాంధ్ర రాయలసీమకు ప్యాకేజీ అవసరమని సూచించింది. ఇప్పటికి రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలనుంచి వలసలు పెరిగిపోతున్నాయి. అనంతపూరం లో గతంలో ఆరులక్షల మంది వలసబాట పడితే ఇప్పడు ఆ సంఖ్య 9 లక్షలకు చేరింది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలో సామాన్యుల పరిస్థితి అంతే. భూ సమీకరణ పెద్ద దగా. గుజరాత్ లోని డోలేరా లో అట్టర్ ప్లాప్ అయ్యింది. భూములు ఇవ్వమని చెప్పిన రైతులపై సైన్యాన్ని దింపి అన్యాయంగా దౌర్జన్యంగా వారి భూములు లాగేశారు. దళితులు కు ఇచ్చే నష్టపరిహారం వేరు ఇతరులకు వేరు. వారికి కావలిసిన వారికి కార్నర్ ప్లాట్ లు కేటాయించారు. కంప్యూటర్ లను కూడా మేనేజ్ చేసేశారు. కేంద్రం మొండి చెయ్యి ఇచ్చింది. ప్రపంచ బ్యాంక్ పొమ్మంది. ఇప్పుడు బాండ్లు అంటున్నారు. రాజధానికి ఎంత భూమి కావాలో అంతే ఉపయోగించాలి. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి పడేశారు. రాజధాని నిర్మాణం ప్రజలపై వీపరీతంగా వేసి ప్రజాధాని అంటున్నారు. ప్రజా భాగస్వామ్యం అంటే అమరావతిలో ఎవరైనా ఒక ప్లాట్ కొనే పరిస్థితి ఉందా ? ఇలాంటి రాజధాని 40 ఏళ్ళు అయినా అభివృద్ధి చెందదు. రాజధాని అంటూ జపాన్, సింగపూర్, ఇంగ్లాండ్ అంటూ తిరిగివస్తే బొంతలో బొంత రాయి పడింది. ఇప్పటికైనా క్షమించమని ముఖ్యమంత్రి ప్రజలను వేడుకోవాలి. ఆంధ్రుల పోరాట వైఖరి తక్కువ అంచనా వేయకండి ఇచ్ఛాపురం నుంచి మద్రాస్ దాకా పోరాడిన చరిత్ర మనది. శివరామ కృష్ణన్ కమిటీ ఏమి చెప్పింది. ఎక్కువమంది రైతులను బాధితులను చేయొద్దు అంది. పంట భూములు నాశనం చేయొద్దని చెప్పింది. తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మించాలి అంది. బిజెపికి రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంటే బాధ్యత లేదా ..? ఇలా చేస్తున్నప్పుడు ముందే హెచ్చరించి అదుపు చేయాలి కదా..? ఐవైఆర్ కొన్ని ఘట్టాలు ఇంకా పొందు పరిచి ఉంటే మరింత బాగుండేది.

ఐవైఆర్ కి అపూర్వ పబ్లిసిటీ : సిపిఐ రామకృష్ణ

ఇక్కడ పుస్తక ఆవిష్కరణ జరుగుతుంటే రాఘవయ్య పార్క్ లో పుస్తక వ్యతిరేకుల ఆందోళనకు అనుమతి ఇచ్చిన తలకాయలేని పోలీసులు ఎవరు ? ఐవైఆర్ కి గతంలో ఎన్నడూ లేని పబ్లిసిటీ దీనివల్ల దక్కింది. నాలుగేళ్లుగా ఒక్క ప్రాధాన్యత అంశం ప్రభుత్వం చేపట్టలేకపోయింది. అభివృద్ధి అంతా ఒకే చోట చేస్తే మిగిలిన ప్రాంతాల మాట ఏమిటి ? అమరావతిలో 7 ఆసుపత్రులు దేనికి ? విద్యా వైద్యం అన్ని ఇక్కడేనా ? ప్రజలు వున్న చోట పెట్టండి. కేంద్ర సహకారంతో రాజధాని అని ఎపి పునర్విభజన చట్టం చెబుతుంది చుడండి. ఎపి విడిపోయేటప్పటికీ 97 వేలకోట్ల రూపాయల అప్పు ఉంటే ప్రత్యేక విమానాల్లో తిరిగి రెండున్నర లక్షల కోట్లకు అప్పు పెంచారు. దేశంలోనే ఇంత సమర్ధవంతంగా అప్పులు చేసిన ముఖ్యమంత్రి మరొకరు లేరు. అంత అన్యాయంగా రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడు. ఇది ప్రజల్లో చర్చనీయాంశం అవుతుంది. ప్రభుత్వ విధానాలపై లోతుగా చర్చ జరగాలి. మార్పు రావాలి. కోటీశ్వరులు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. దర్శిలో ఎమ్యెల్యే ఎన్నికల్లో 30 కోట్లు ఖర్చు పెట్టారంటే ఏమనుకోవాలి..? అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Ram Tatavarthi
About Ram Tatavarthi 1610 Articles
Ram has been continuing in the journalism for the past 25 years. He started his career from Samacharam and worked for various print and electronic media houses like Eenadu, Andhra Bhoomi, the evening daily Sandhya, in cable, Andhra Prabha, Citi Cable, TV 9, CCC channel etc.. By having extensive experience in journalism and also by always keeping up to date with the latest technology he is now working as a freelance journalist.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*