
వంగలపూడి అనిత. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా ఐదేళ్ల తెలుగుదేశం పాలనలో కీ వాయిస్ గా మారారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల నోళ్లను మూయించడానికి అనిత తెలుగుదేశం పార్టీకి తురుపుముక్కలా ఉపయోగపడేవారు. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై అనిత విరుచుకుపడేవారు. అలాంటి వంగలపూడి అనిత ఇప్పుడు తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోనున్నారు. వంగలపూడి అనిత గత ఎన్నికల్లో పాయకరావుపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఒక దశలో మంత్రివర్గ విస్తరణలో అనిత పేరు కూడా విన్పించడం విశేషం.
పాయకరావుపేట నుంచి….
అటువంటి అనితకు ఈ ఎన్నికలకు ముందు సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురయింది. పాయకరావుపేటలో అనితకు టిక్కెట్ ఇస్తే తాము మద్దతివ్వబోమని పాయకరావుపేట తెలుగుదేశం పార్టీ నేతలు అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు. పెద్ద సంఖ్యలో ప్రదర్శన కూడా నిర్వహించారు. ఎన్నికలకు ముందు అనిత పాయకరావుపేట నియోజకవర్గంలో పాదయాత్ర కూడా చేసి ఇటు అధిష్టానం, అటు ప్రజల ఆశీస్సులను పొందాలని ప్రయత్నించారు. చివరి నిమిషం వరకూ మంత్రి గంటా శ్రీనివాసరావు మద్దతుతో పాయకరావుపేట టిక్కెట్ కోసం ప్రయత్నించారు. కానీ చివరకు అధిష్టానం ఆమెకు మొండిచేయి చూపింది.
సేఫ్ ప్లేస్ అయినా…..
పాయకరావుపేట ఇవ్వకపోయినా టీడీపీకి సేఫ్ ప్లేస్ అయిన కొవ్వూరు నియోజకవర్గం టిక్కెట్ ఇవ్వడం కొంత ఊరట కల్గించే విషయమే. అప్పటి వరకూ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న జవహర్ ను తప్పించి అనితకు అవకాశమిచ్చింది. నిజానికి టీడీపీ అభ్యర్థిగా ఎవరు పోటీ చేసినా ఇక్కడ గెలుపు ఖాయమని అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఎన్నికలు జరిగిన అనంతరం ఇక్కడ విశ్లేషణలు అనితకు వ్యతిరేకంగా వస్తుండటం గమనార్హం. అనిత నాన్ లోకల్ కావడం కొంత ఇబ్బందులు ఎదురయ్యాయంటున్నారు.
నాన్ లోకల్ కావడంతో…..
అంతేకాదు జవహర్ వర్గం కూడా అనితకు మద్దతివ్వలేదని చెబుతున్నారు. జవహర్ ను సాగనంపిన వర్గం మాత్రం అనితకు అండగా నిలిచింది. మరోవైపు ఇక్కడ తానేటి వనిత వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. గత ఎన్నికలలో పోటీ చేసిన వనిత ఓటమి పాలయ్యారు. ఆ సానుభూతి ఇప్పుడు పనిచేస్తుందని లెక్కలు వేస్తున్నారు. వైసీపీ క్యాడర్ మొత్తం కలసి కట్టుగా పనిచేయడం కలసి వచ్చే అంశంగా చెబుతున్నారు. అనితకు మాత్రం టీడీపీలోని ఒక వర్గం మద్దతే కరువవ్వడంతో కొంత వెనకబడి ఉన్నారని చెబుతున్నారు. ఏది ఏమైనా ఇది టీడీపీ కంచుకోట కావడంతో గెలుపోటములు ఊహించలేకపోయినప్పటికీ అనితను పరాయి నేతగానే చూసినట్లు పోలింగ్ సరళిని బట్టి స్పష్టమవుతోంది.
Leave a Reply