
వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీ లో చేరతారన్న ప్రచారం జోరుగా సాగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వంగవీటి రాధా తాను ఏ పార్టీలో చేరుతుందీ అధికారికంగా ఇప్పటి వరకూ ప్రకటించలేదు. దీనికి తోడు టీడీపీ నేతలు రాధా నివాసానికి వెళ్లి చర్చలు జరపడం, రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని టీడీపీ ఆఫర్ చేసిందని మాత్రం వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా టీడీపీ నేతలకు వంగవీటి రాధా ఈ నెల 25వ తేదీన పార్టీలో చేరుతున్నారని చెప్పడం కూడా చకా చకా జరిగిపోయాయి. అయితే పది రోజులు గడుస్తున్నా రాధా టీడీపీ వైపు చూడకపోవడానికి కారణాలేంటి?
రంగా హత్య విషయంలో…..
అయితే ఆ తర్వాత రాధా మీడియా సమావేశం పెట్టి వైసీపీతో పాటు జగన్ ను కూడా నిందించారు. రంగా విగ్రహావిష్కరణ చేసేందుకు కూడా వైసీపీలో ఆంక్షలు తనపై విధించారని సంచలన ప్రకటన చేశారు. అంతవరకూ చెప్పేసి తాను టీడీపీలో చేరుతున్నానంటే బాగుండేది. కానీ రంగా హత్య విషయంలో టీడీపీని వెనకేసుకు రావడమే రంగా అనుచరుల ఆగ్రహానికి గురైందంటున్నారు. రంగా హత్యలో టీడీపీ ప్రమేయం లేదన్నట్లుగా, ఎవరో కొందరు వ్యక్తులు ఆ హత్యకు పాల్పడ్డారని చెప్పడాన్ని రంగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ ప్రెస్ మీట్ తర్వాత రాధా ఫోన్ కు రంగా అనుచరుల నుంచే నెగిటివ్ మెసేజ్ లు వందల సంఖ్యలో వస్తుండటంతో రాధా కొంత సందిగ్దంలో పడినట్లు తెలిసింది.
వైసీపీని వీడిన కారణమేంటి?
దీనికి తోడు వైసీపీని వీడటానికి ప్రధాన కారణం తనకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తనకు ఇవ్వకపోవడమే. అక్కడ మల్లాది విష్ణును ఇన్ ఛార్జిగా నియమించి, రాధాకు తూర్పు నియోజకవర్గం కేటాయిస్తామని చెప్పడంతోనే మనస్థాపానికి గురయ్యారు. తనకు పట్టున్న నియోజకవర్గం కాకుండా వేరొక నియోజకవర్గం కేటాయించడమేంటని రాధా తన అనుచరులతో జరిగిన సమావేశంలోనూ ప్రశ్నించారు. వైసీపీ బందరు పార్లమెంటు సీటు ఇస్తామన్నా తాను ఒప్పుకోలేదని చెప్పారు. అయితే టీడీపీ రాధాకు ఇచ్చిన ఆఫర్ ఏంటన్న చర్చ ఆయన అనుచరుల్లో జరుగుతోంది.
టీడీపీ బంపర్ ఆఫర్ ఇవ్వలేదే….
కేవలం ఎమ్మెల్సీ పదవి కోసం తెలుగుదేశం పార్టీలో చేరితే రాజకీయ భవిష్యత్తు సమాధి అవుతుందని ఆయన సన్నిహితులు రాధాకు నూరిపోస్తున్నారు. టీడీపీ కన్నా జనసేనలో చేరితేనే భవిష్యత్తు ఉంటుందని ముఖ్యులు రాధా కు చెబుతున్నారని తెలుస్తోంది. దీనికి తోడు విజయవాడలో కొన్ని స్థలాల్లో పట్టాలు ఇవ్వాలన్నది కూడా రాధా టీడీపీ అధినాయకత్వం ముందుంచిన డిమాండ్. ఆ డిమాండ్ కు కూడా టీడీపీ అధినాయకత్వం సానుకూలంగా స్పందించడం లేదంటున్నారు. ఇటు అనుచరుల నుంచి కూడా టీడీపీ చేరేందుకు సుముఖత వ్యక్తం కాకపోవడంతో రాధా టీడీపీలో చేరిక ఆలస్యమయిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. మరి రాధా ఇంతకీ టీడీపీలో చేరతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Leave a Reply