
వంగవీటిరాధా ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? అని అడిగితే ఠక్కున సమాధానమివ్వడం ఎవరికీ సాధ్యం కాదు. వంగవీటి రాధా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం రాజీనామా చేశారు. ఆయన ఇంకా తెలుగుదేశం పార్టీలో చేరలేదు. ఆయనకు ఇచ్చిన హామీలు కూడా టీడీపీ అధినేత పక్కనపెట్టినట్లే కన్పిస్తోంది. రాధా భవిష్యత్ ఇప్పుడు గాలిలో దీపంలా మారింది. దాదాపు నెలన్నర క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాధా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగుదేశ పార్టీ నేతలు కూడా ఆయన ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు.
బాబు దూతలు వచ్చి…..
చంద్రబాబునాయుడు పంపిన దూతలు రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఉండటంతో వీలుకాదని, కృష్ణా జిల్లాలో పోటీకి అవకాశం లేదని ఎమ్మెల్సీ పదవి ఇస్తామని, ప్రస్తుతానికి సర్దుకోమని రాధాకు వివరించారు. దీంతో పాటు కృష్ణలంక ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని, ఇది చిరకాల వాంఛ అని రాధా చెప్పడంతో దానిని కూడా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇందులో రెండు హామీలు ఇంతవరకూ జరగలేదు.
ఎమ్మెల్సీ ఇస్తామని….
తాజాగా నలుగురు ఎమ్మెల్సీలను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎంపిక చేశారు. వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కూడా. అయితే అందులో రాధా పేరు లేకపోవడం ఇప్పుడు బెజవాడలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇందుకు తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్న కారణాలు కూడా వేరే విధంగా ఉన్నాయి. వంగవీటి రాధా పార్టీలో చేరకుండా ఎమ్మెల్సీగా ఎలా ఎంపిక చేస్తామన్న వాదన కూడా టీడీపీ చేస్తుంది. ఈ వాదన సహేతుకమైనదే. పార్టీలో చేరకుండా ఎమ్మెల్సీని చేస్తే పార్టీలోనే తప్పుడు సంకేతాలు వెళతాయి.
చేరకుండా ఎలా?
ఉన్న ఎమ్మెల్సీ పోస్టులన్నీ భర్తీ అయిపోయాయి. కృష్ణా జిల్లాలో సీట్లన్నింటినీ దాదాపుగా చంద్రబాబు అనధికారికంగా ప్రకటించేశారు. ఇప్పుడు రాధా పార్టీలో చేరినా ఎలాంటి పదవీ దక్కే అవకాశం లేదు. ఇన్నాళ్లూ తెలుగుదేశం పార్టీలో రాధా చేరకపోవడానికి ఎమ్మెల్సీ పదవి నచ్చకపోవడమేనని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా గెలిచి అసెంబ్లీలోకి వెళ్లాలన్నది ఆయన కోరిక. అయితే ఈసారి రాధాకు అది నెరవేరేటట్లు కనపడటం లేదు. వైసీపీకి రాజీనామా చేశారు. తెలుగుదేశంలో చేరినా ఇక పదవీ, టిక్కెట్ దక్కదు. దీన్ని బట్టి రాధా తొందరపాటు తనం తనను ఏ స్థాయికి తీసుకెళ్లిందో అర్థమయిందిగా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు విన్పిస్తున్నాయి. అదే వైసీపీలో ఉంటే తూర్పు నియోజకవర్గం గాని, బందరు పార్లమెంటు టిక్కెట్ గాని లభించి ఉండేదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. మొత్తం మీద రాధా రాజకీయ భవిష్యత్తుపై మాత్రం నీలినీడలు కమ్ముకున్నాయి.
Leave a Reply