
వంగవీటి రాధా కోసం తెలుగుదేశం ప్రయత్నాలు ముమ్మరంగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఎన్నికల వేళ వంగవీటి రాధాను పార్టీలోకి రప్పించుకోవడానికి ఏకంగా మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ను రంగంలోకి దించారు. రాధాకు ఇటీవల భర్తీ చేసిన ఎమ్మెల్సీ పదవుల్లోనూ చోటు కల్పించలేదు. వంగవీటి రాధాను పార్టీలోకి తీసుకువచ్చే బాధ్యతను లగడపాటికి అప్పగించారని తెలుస్తోంది. అందుకే లగడపాటి రాజగోపాల్, వంగవీటి రాధా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రాధా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నెలన్నర రోజులు గడుస్తున్నా ఏ పార్టీలో చేరలేదు.
అనుచరుల ఒత్తిడి కారణంగా….
ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారనుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా వంగవీటి రాధా పార్టీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. అయితే రాధాకు అనుచరులు, సన్నిహితుల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. నేటికీ ముఖ్యులతో పార్టీలో చేరికపై ఆయన మంతనాలు సాగిస్తున్నారు. రాధా పార్టీలో చేరకపోవడానికి కారణాలపై ఇటీవల చంద్రబాబునాయుడు సయితం ఆరా తీసినట్లు సమాచారం. రాధాను ఎలాగైనా తీసుకురావాలని దూతలను ఆయన వద్దకు పంపినా వర్క్ అవుట్ కాలేదు.
లగడపాటి రాయబారం….
అయితే తాజాగా లగడపాటి వంగవీటి రాధాను టీడీపీలో చేర్చుకునే బాధ్యతను తన భుజాల మీద వేసుకున్నారు. కానీ రాధాకు కృష్ణా జిల్లాలో ఎంపీ స్థానం గాని, ఎమ్మల్యే స్థానం గాని ఖాళీ లేదు. లగడపాటి ప్రతిపాదనల ప్రకారం రాధాకు ఉభయ గోదావరి జిల్లాలు, అనకాపల్లి పార్లమెంటు స్థానాల్లో ఏదో ఒకచోట పోటీ చేసేందుకు టీడీపీ అధిష్టానం టిక్కెట్ ఇచ్చేందుకు నిర్ణయించింది. అనకాపల్లి పార్లమెంటు స్థానం కూడా అవంతి శ్రీనివాస్ పార్టీని వీడటంతో అక్కడ ఖాళీగా ఉంది. ఇక్కడి నుంచి రాధాను పోటీకి దింపాలని టీడీపీ భావిస్తుంది.
కాపుల కోటలో పోటీకీ…..
అనకాపల్లి రాధాకు ఇష్టం లేకుంటే రాజమహేంద్రవరం, కాకినాడ పార్లమెంటు స్థానాలైనా ఇస్తామని రాధాకు కబురు పంపింది. మొత్తం మీద లగడపాటి పార్లమెంటు స్థానాల్లో మాత్రమే పోటీ చేయాలని రాధాకు సూచించారట. రాధా మాత్రం ఇంకా తాను టీడీపీలో చేరలేదని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రాధాను బరిలోకి దింపి అక్కడి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా రాధా ప్రభావం ఉండేలా టీడీపీ సరికొత్త వ్యూహాన్ని రచించింది. మరి రాధా దీనికి అంగీకరిస్తారా? లేదా? చూడాలి.
Leave a Reply