
నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అన్నీ కలసి వచ్చినట్లే కన్పిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఇదే నియజకవర్గాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈసారి కూడా అదే ధీమాతో ఉంది. అంతేకాకుండా బలమైన నేతలందరూ ఇప్పుడు వైసీపీలో ఉండటం ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థికి సునాయాస విజయం చేకూరుస్తుందన్న అంచనా వేస్తున్నారు. గూడూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ నాలుగుసార్లు మాత్రమే గెలిచింది. ఐదుసార్లు కాంగ్రెస్, ఒకసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. పోలింగ్ ముగిసిన తర్వాత వైఎస్సార్సీపీ శ్రేణులు పండగ చేసుకున్నాయి. విజయం తమదేనన్న ధీమాలో ఉన్నాయి.
సునీల్ పార్టీ మారడంతో….
గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పాశం సునీల్ కుమార్ టీడీపీ అభ్యర్థి బి.రాధా జ్యోత్సపై తొమ్మిది వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే ఆ తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ తో పాశం సునీల్ కుమార్ వైసీపీ ని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆయనకు మళ్లీ పోటీ చేసే అవకాశం టీడీపీ అధిష్టానం ఇచ్చింది. పార్టీ మారడంతో ఆయన ప్రజల నుంచి కొంత అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. టీడీపీ శ్రేణులు కూడా పెద్దగా సహకరించకపోవడం మైనస్ గానే చెప్పుకోవాలి. తొలి నుంచి జెండా పట్టుకున్న తమకు కాదని, మధ్యలో వచ్చిన వారికి టిక్కెట్ ఎలా ఇస్తారని టీడీపీనేతలు సూటిగానే ప్రశ్నిస్తున్నారు. ప్రచారం కంటే ముందు వీరిని మచ్చిక చేసుకోవడానికే సునీల్ కుమార్ ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు.
ఎంపీని బరిలోకి దించి….
ఇక ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా నిన్న మొన్నటి వరకూ తిరుపతి వైసీపీ పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన వరప్రసాద్ ను ఆ పార్టీ బరిలోకి దింపింది. నియోజకవర్గానికి వరప్రసాద్ కొత్త వారు కావడంతో కొంత ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే అయినప్పటికీ ఇక్కడ వైసీపీ స్ట్రాంగ్ గా ఉండటమే కలసి వచ్చే అంశంగా చెప్పాలి. ఎందుకంటే రిజర్వడ్ నియోజకవర్గం కావడంతో నెల్లూరు జిల్లాలోని అగ్రనేతల ప్రభావం దీనిపై ఎక్కువగా ఉంటుంది. నిన్న మొన్నటి వరకూ వైసీపీ ఇన్ చార్జిగా ఉన్నమేరిగ మురళికి టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.
మూడు కుటుంబాల మద్దతు…
అయినా ఇక్కడ నేదురుమిల్లి, నల్లపురెడ్డి, ఆనం కుటుంబాలకు పట్టు ఎక్కవగా ఉంది. నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి గూడూరు నియోజకవర్గంలో తిష్ట వేసి వరప్రసాద్ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిలు కూడా నియోజకవర్గాల్లో పర్యటించి తమ వర్గాన్ని వరప్రసాద్ కు చేరువ చేశారు. అంతేకాకుండా 2009లో టీడీపీ అభ్యర్థిగా గెలిచిన బల్లి దుర్గాప్రసాద్ కూడా వైసీపీలో చేరడంతో వరప్రసాద్ విజయం సునాయాసమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మరి గత ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా విజయం సాధించిన వరప్రసాద్ ఈసారి శాసనసభలో కాలుమోపుతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Leave a Reply