వర్లరామయ్య అడ్డంగా బుక్కయ్యారు …!

సోషల్ మీడియా నేత్రం వెనుకే ఉందన్న సత్యం నేతలకు ఇంకా వంటబట్టడం లేదు. ఏ మాత్రం తేడా మాట్లాడినా తప్పుడు పని చేసినా సెలబ్రిటీలనుంచి సామాన్యుల వరకు జరిగే సంఘటనలు అన్ని క్షణాల్లో ప్రపంచానికి చేరిపోతున్నాయి. ఈ సత్యం చాలా తక్కువమంది నాయకులే గమనించి జాగ్రత్త పడుతున్నారు. చాలా మంది మాత్రం పబ్లిక్ లో అడ్డంగా బుక్కయ్యి తరువాత వివరణలు ఇచ్చుకోవాలిసి వస్తుంది. అప్పటికే సెలబ్రిటీ ల హోదాలో వున్న వారికి జరగాలిసిన డ్యామేజ్ జరిగిపోతుంది. తాజాగా ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ వర్లరామయ్య సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అయ్యారు.

అసలు వర్ల ఏమి చేశారు ..?

వర్లరామయ్య రొటీన్ కి భిన్నంగా సమాజఉద్ధరణకు ప్రయాణికులను కలిసే ప్రయత్నం చేశారు. వారి నుంచి ఆర్టీసీ కోసం నాలుగు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ పనిలో ఆయన ఒక విద్యార్థి చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటుంటే దగ్గరకు వెళ్ళి ఆ విద్యార్థిని గదమాయించారు. ఏమి చదువుతున్నావు ? మీ నాన్న ఏమి చేస్తాడు ? ఈ వయస్సులో నీకు మొబైల్ ఎందుకు ? ఇలా అయితే చదువు అంతే సంగతులు అంటూ అక్కడిదాకా బాగానే హితబోధ చేశారు. అక్కడితో ఆగకుండా నీ కులం ఏమిటి ? మాలా? మాదిగ అని ప్రశ్నించారు. మాదిగ అయితే ఇక చదువు అంతే సంగతులు మీ నాన్న కష్టం వృధా చేసినట్లే అంటూ పక్కనున్న వారిని రంజింప చెయ్యడానికి డైలాగ్స్ కొట్టి బుక్ అయ్యారు. ఆయన పక్కనే ఈ వ్యవహారాన్ని కొందరు మొబైల్ లో షూట్ చేసి సోషల్ మీడియా లో అప్ లోడ్ చేశారు. ఇంకేముంది వర్ల రామయ్య తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకోవాలిసి వచ్చింది. తన మంచి ఉద్దేశ్యాన్ని అర్ధం చేసుకోవాలని కోరుకున్నారు రామయ్య.

పోలీస్ శాఖ నుంచి రావడంతో …

వర్ల రామయ్య టిడిపి లో దూకుడుగా వుండే నాయకుడు. స్వతహాగా పోలీస్ శాఖ లో వివిధ హోదాల్లో పనిచేసిన రామయ్యకు ఇంకా ఆ డిపార్ట్మెంట్ చేష్టలు… మాటలు పోలేదు. ఆయన మాట్లాడే తీరు చాలా సందర్భాల్లో టిడిపికి ప్లస్ గానే వుంటూ వచ్చింది. ముఖ్యంగా విపక్ష నేత జగన్ ను విమర్శించే దళంలో రామయ్య కూడా ఒకరు. ఆయన దూకుడు ప్రత్యర్థులపై విరుచుకుపడే మాటలు వర్లను ఉన్నతస్థాయి పదవి వరించేలా చేశాయి. తాజా గా జరిగిన సంఘటనతో రామయ్య ఇరుకున పడ్డారు. దాంతో ఇప్పుడు ఆయన ఆచితూచి మాట్లాడటం నేర్చుకుంటారో లేదో చూడాలి.

Ram Tatavarthi
About Ram Tatavarthi 1686 Articles
Ram has been continuing in the journalism for the past 25 years. He started his career from Samacharam and worked for various print and electronic media houses like Eenadu, Andhra Bhoomi, the evening daily Sandhya, in cable, Andhra Prabha, Citi Cable, TV 9, CCC channel etc.. By having extensive experience in journalism and also by always keeping up to date with the latest technology he is now working as a freelance journalist.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*