
రాజస్థాన్ ఎన్నికలను ప్రధాని మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలు సవాలుగా తీసుకున్నారు. త్వరలోనే జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను ముఖ్యమంత్రి వసుంధర రాజే చేతిలో పెడితే పరాజయం తప్పదని భావించిన అమిత్ షా నేరుగా రంగంలోకి దిగారు. ఇటు పార్టీ అంతర్గత సర్వేల్లోనూ వసుంధర రాజేపై తీవ్ర అసంతృప్తి పెల్లుబుకుతున్న నేపథ్యంలో ఆమెను కట్టడి చేయాలని అమిత్ షా నిర్ణయించారు. అందుకే ఆమెను పక్కన పెట్టేందుకే డిసైడ్ అయినట్లు కన్పిస్తోంది. వసుంధర రాజే ఒంటెత్తు పోకడలతో పార్టీకి తీవ్రంగా నష్టం జరిగిందని కమలనాధులు గుర్తించారు. ఇందుకోసం పీసీసీ చీఫ్ ను వసుంధరరాజే సిఫార్సు చేసిన వ్యక్తినే నియమించినా… టిక్కెట్ల విషయంలో ఆమెకు స్వేచ్ఛను ఇవ్వకూడదని అమిత్ షా భావిస్తున్నారు.
ప్రభుత్వ వ్యతిరేకతతో…..
రాజస్థాన్ లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2013లో జరిగిన శాసనసభ ఎన్నికలలో బీజేపీ 162 స్థానాలను సాధించి అధికార పగ్గాలు చేపట్టింది. కాంగ్రెస్ గత ఎన్నికల్లో కేవలం 21 స్థానాలకే పరిమితమయ్యింది. అయితే ఇటీవల కాలంలో కాంగ్రెస్ బాగా పుంజుకుంది. దీనికితోడు గుజ్జర్ల ఆందోళన, ప్రభుత్వంపై వ్యతిరేకత కమలనాధులను విజయానికి దూరం చేస్తాయన్న వార్తలు వచ్చాయి. అంతేకాదు ఎమ్మెల్యేలపై అసమ్మతి కూడా విపరీతంగా ఉంది. అంతేకాకుండా రాజస్థాన్ లో ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి గెలవడం జరగదు. కానీ ఈసారి చరిత్ర మార్చాలని అమిత్ షా వ్యూహాలు రచిస్తున్నారు.
జాబితాలో కోత….
తొలుత పార్టీలో టిక్కెట్ల వ్యవహారమంతా వసుంధర చూస్తారనుకున్నారు. కానీ ఇదంతా అమిత్ షా పర్యవేక్షణలోనే జరుగుతోంది. ఇప్పటికే రాజస్థాన్ రాష్ట్రంలో ఒకసారి తిరిగి వచ్చిన ఆర్ఎస్ఎస్ కూడా నివేదిక సమర్పించింది. మొత్తం 200 స్థానాలున్న రాజస్థాన్ లో ఇప్పటికే వసుంధర పంపిన జాబితాను దాదాపుగా పక్కనపెట్టేసినట్లు తెలిసింది. దాదాపు 150 స్థానాలకు వసుంధర జాబితాను పంపారు. అయితే అందులో 60 స్థానాలకు మాత్రమే వసుంధర పంపిన జాబితాలో వారికి చోటు దక్కిందంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను ఖచ్చితంగా మార్చాల్సిందేనన్న సంకేతాలు షా ఇచ్చారు.
సిట్టింగ్ లలో సగం మందికి….
తిరిగి అధికారంలోకి వస్తే టిక్కెట్ దక్కని వారికి అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తామని బీజేపీ చెబుతోంది. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలలో దాదాపు సగం మందిని పక్కన పెట్టాలని అమిత్ షా నిర్ణయించారు. వసుంధర పంపిన జాబితాలో అందరూ తనకు అనుకూలురైన వారినే పంపడంతో ఆ జాబితాను మరోసారి స్కాన్ చేయాలని అమిత్ షా నిర్ణయించారు. వసుంధర సిఫార్సుచేసిన వారికి కేవలం 60 మందికే టిక్కెట్లు ఇవ్వాలని, అదీ గెలుపు గుర్రాలయితేనే ఇస్తామని షా రాజస్థాన్ నేతలతో చెప్పడం విశేషం. మొత్తం మీద ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అమిత్ షా ముఖ్యమంత్రి వసుంధరను పూర్తిగా పక్కనపెట్టేశారనే చెప్పాలి.
Leave a Reply