
రాజస్థాన్ ఈసారి కమలనాధులకు గట్టి షాకిచ్చేటట్లే ఉంది. ప్రదాని నరేంద్ర మోదీ గ్రాఫ్ పడిపోవడం, ముఖ్యమంత్రి వసుంధర రాజే ఒంటెత్తుపోకడలు పార్టీకి కష్టాలనే తెచ్చిపెట్టనున్నాయి. గత ఉప ఎన్నికల సమయంలోనే వార్నింగ్ బెల్స్ మోగినా ఇటు పార్టీ కేంద్ర నాయకత్వం కాని, వసుంధర రాజే కాని ఎటువంటి నష్టనివారణ చర్యలకు దిగలేదు. మహారాణి వన్ మ్యాన్ షో కారణంగానే పార్టీ పూర్తిగా దిగజారిపోయిందని, మరోవైపు కాంగ్రెస్ బాగా పుంజుకోవడంతో కమలం పార్టీ రాజస్థాన్ లో వికసించడం అంత సులువు కాదన్నది విశ్లేషకుల అంచనా.
వసుంధర హామీలను….
మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే గంట ముందు వసుంధర రాజే ఇచ్చిన హామీలు ఎంత మాత్రం పనిచేస్తాయన్నది ప్రశ్న. వసుంధర రాజే రైతులకు ఉచిత విద్యుత్తును ఇస్తున్నట్లు ప్రకటించడం సంచలనమే కలిగించింది. దాదాపు నాలుగున్నరేళ్ల పాటు రైతులను పట్టించుకోని రాజే ఎన్నికల ముందర చేసిన విన్యాసాలు వర్క్ అవుట్ కాదన్నది కాంగ్రెస్ నేతల అంచనా. ఈ హామీ పట్ల రైతుల నుంచి కూడా అంత పెద్దగా స్పందన కన్పించక పోవడం గమనార్హం. కనీసం ఆరునెలల ముందైనా ఉచిత విద్యుత్తును రాష్ట్రంలో అమలుపర్చి ఉంటే బాగుండేదని కమలం పార్టీ నేతలే అభిప్రాయపడుతుండటం విశేషం.
సర్వేల్లోనూ……
తాజాగా ఏబీపీ న్యూస్ – సీ ఓటరు సర్వేలోనూ వసుంధర రాజేకు ఓటమి తప్పదని తేలిపోయింది. మరో సర్వే సంస్థ సీ ఫోర్ కూడా తన సర్వే ఫలితాలను వెల్లడించింది. ఈ సర్వేలో 200 శాసనసభ స్థానాలున్న రాజస్థాన్ లో 130 నుంచి 124 స్థానాల వరకూ హస్తం పార్టీ గెలుచుకుంటుందని తేలింది. రాజస్థాన్ లో ఉన్న సంప్రదాయం ప్రకారమే అధికార పార్టీకి ఓటర్లు మళ్లీ పట్టం కట్టరని కూడా తేలింది. అలాగే ముఖ్యమంత్రి అభ్యర్థిగా సచిన్ పైలెట్ ను 36 శాతం మంది ఓటర్లు సమర్థించగా, వసుంధరరాజేకు 27 శాతం మంది మాత్రమే మద్దతు పలకడం విశేషం.
చివరిగా ఎన్నికల వల్ల……
అయితే ఎన్నికల షెడ్యూల్ ప్రకారం రాజస్థాన్ ఎన్నికలు చివరిగా డిసెంబరు మొదటి వారంలో జరుగుతుండటంతో ఇక ప్రధాని నరేంద్రమోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా చెమటోడ్చాల్సి ఉంటుంది. కమలం పార్టీ అంతర్గత సర్వేల్లోనూ రాజస్థాన్ లో గెలుపు కష్టమేనని తేలడంతో ప్రధాని నరేంద్రమోదీ విస్తృత పర్యటనలకు బీజేపీ ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న అగ్రవర్ణాలను, రైతులను ఆకట్టుకునేందుకు మోదీ కసరత్తులు చేయనున్నారు. మరోవైపు విపక్షాల కూటమిలో చీలికలు రావడం తమకు లాభిస్తుందని కమలనాధులు నమ్ముతున్నారు. మరి ఇవి ఎంత మేరకు సత్ఫలితాలిస్తాయో తెలియదు కాని, రాజస్థాన్ లో పొరపాటున బీజేపీ గెలిస్తే అది మోదీ వల్లనేనని చెప్పక తప్పదు.
Leave a Reply