
లోక్ సభ ఎన్నికల వేళ ఉత్తర భారతదేశంలో రాజస్థాన్ పైనే కమలం ఆశలు పెట్టుకుంది. మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రంలో బలంగా ఉన్నా రాజస్థాన్ విషయానికొచ్చేసరికి ఈసారి ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ కమలనాధులకూ లేకపోలేదు. రాజస్థాన్ లో ఈసారి గెలుపోటములపై రెండు ప్రధాన పార్టీలు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ లు ధీమాగా ఉన్నాయి. అయితే ఈసారి రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటి తన ప్రభావం ఉందని నిరూపించుకోవాలనుకుంటున్నారు.
చెమటోడుస్తున్నారు……
రాజస్థాన్ లో మొత్తం 25 పార్లమెంటు స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో మొత్తం సీట్లను కైవసం చేసుకున్న కమలం పార్టీకి ఈసారి అంత సీన్ లేదని చెబుతున్నప్పటికీ అత్యధిక స్థానాలను దక్కించుకోవడానికి చెమటోడుస్తుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజస్థాన్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిందన్న మాటేగాని మిత్రుల సాయంతోనే అన్నది విస్మరించకూడదు. అధికారంలో ఉండటంతో తాము సులువుగా సీట్లను కైవసం చేసుకోవచ్చన్నది కాంగ్రెస్ పార్టీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.
మోడీ ప్రభావం…..
రాజస్థాన్ లో ఈసారి బాగల్ కోట్ దాడుల ప్రభావం ఎక్కువగా ఉండవచ్చంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ మీద కన్నా అప్పటి ముఖ్యమంత్రి వసుంధరరాజే పై ఉన్న వ్యతిరేకతతోనే కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగిందన్నది కాదనలేని వాస్తవం. అంతేకాకుండా రాజస్థాన్ లో ఒకసారి అధికారంలోకి వచ్చిన వారికి మరొకసారి పవర్ దక్కదన్న సెంటిమెంట్ గత ఎన్నికల్లోనూ కన్పించింది. అయితే లోక్ సభ ఎన్నికల్లో మాత్రం మళ్లీ ఛేంజ్ కనపడుతుందన్నది విశ్లేషకుల అంచనా.
మిషన్ 25….
ప్రస్తుతమున్న అసెంబ్లీ స్థానాల బలీలను బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ పన్నెండు నుంచి పదమూడు స్థానాలను దక్కించుకోవాల్సి ఉంటుంది. కానీ వివిధ జాతీయ మీడియా సంస్థలు జరిపిన సర్వేలను చూస్తే కాంగ్రెస్ ఏడు లోక్ సభ స్థానాలకే పరిమితమవుతుందన్నది అంచనా. ఈ సంఖ్య కూడా గత ఎన్నికలతో పోల్చుకుంటే చాలా ఎక్కువే. వసుంధర రాజే అభ్యర్థుల గెలుపునకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మిషన్ 25 పెట్టుకున్నా రాజే మాత్రం 18 స్థానాలు ఖచ్చితంగా కమలం పార్టీ ఖాతాలో పడతాయని చెబుతున్నారు. మొత్తం మీద రాజస్థాన్ ఎన్నికలు వసుంధర రాజేకు పరీక్ష లాంటివే అని చెప్పక తప్పదు.
Leave a Reply