
ముఖ్యమంత్రి వసుంధరరాజేకు రాష్ట్రంలోనే కాదు తన సీటులోనూ కంగారెత్తించేందుకు కాంగ్రెస్ సిద్ధమయిపోయింది. వసుంధర రాజే పనితీరు బాగాలేదని, ఆమె వ్యవహారశైలితోనే ఈసారి ఓటమి తప్పదని విశ్లేషణలు వెలువడతున్న నేపథ్యంలో వసుంధర రాజే తాను పోటీ చేసే నియోజకవర్గంలోనూ చెమటోడ్చాల్సిన పరిస్థితి తలెత్తింది. వసుంధర రాజే గత కొన్నేళ్లుగా ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. రాజస్థాన్ లోని ఝలరాపటాన్ నియోజకవర్గం ఆమెకు కంచుకోటగా చెప్పాలి. 2003, 2008, 2013 లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
అచ్చొచ్చిన నియోజకవర్గం…..
మరోసారి ఝలాపటాన్ నియోజకవర్గం నుంచే వసుంధర బరిలోకి దిగుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆమెను గుక్కతిప్పుకోనివ్వకుండా చేసేందుకు సరైన అభ్యర్ధిని ఇదే నియోజకవర్గంలోకి బరిలోకి దించుతోంది. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్ కుమారుడు మాన్వేంద్ర సింగ్ ను ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని నిర్ణయించింది. ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో పోటీ రసవత్తరంగా మారే అవకాశముంది. మాన్వేంద్ర సింగ్ తనకు, తన తండ్రికి బీజేపీ చేసిన అవమానాలకు నిరసనగా ఈ ఏడాది పార్టీని వీడారు.
అన్ని సామాజిక వర్గాల వారితో…..
వసుంధరకు ఈ నియోజకవర్గంలో తిరుగులేదన్నది అందరికీ తెలిసిందే. అన్ని సామాజిక వర్గాల వారినీ ఆమె కుటుంబంలో కలుపుకోవడమే ప్లస్ పాయింట్ గా చెబుతారు. రాజ్ పుత్ సామాజికవర్గానికి చెందిన జాట్ సామాజికవర్గం ఇంటి కోడలయ్యారు. ఆతర్వాత తన కుమారుడు దుష్యంత్ సింగ్ కు గుజ్జర్ల సామాజిక వర్గానికి చెందిన యువతితో వివాహం జరిపారు. ఈ మూడు సామాజిక వర్గాలు ఝలరాపటాన్ నియోజకవర్గంలో కీలక పాత్ర పోషించనున్నాయి. గెలుపోటములను నిర్ణయించనున్నాయి. ఈ నేపథ్యంలో గెలుపు తనదేనన్న ధీమాతో ఉన్నారు.
రాజ్ పుత్ లు, గుజ్జర్ల ఆగ్రహం….?
అయితే జస్వంత్ సింగ్ కు జరిగిన అవమానంతో రాజ్ పుత్ లు ఆగ్రహంతో ఉన్నారు. జస్వంత్ సింగ్ ను రాజ్ పుత్ లు నేటికీ తమ నాయకుడిగా భావిస్తారు. అటువంటి జస్వంత్ సింగ్ ను పార్టీ పక్కనపెట్టడంపై కమలంతో రాజ్ పుత్ లు ఊగిపోతున్నారు. అందుకే రాజ్ పుత్ లు మానేంద్రసింగ్ కు అండగా నిలుస్తారని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తుంది. మరోవైపు గుజ్జర్లు కూడా రిజర్వేషన్ల అంశంపై రగలిపోతున్నారు. ఈ సామాజిక వర్గం అండకూడా తమకు లభిస్తుందని కాంగ్రెస్ భావిస్తుంది. సో… బలమైన అభ్యర్థిని రంగంలోకి దించడంతో రాజమాత ఇక శ్రమించకతప్పదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.
Leave a Reply