బాపట్ల ఈసారి మాదే….!

వేగేశ్న న‌రేంద్ర వ‌ర్మ. గుంటూరు జిల్లాలోనే కాకుండా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హోరెత్తుతున్న పేరు ఇది! సౌమ్యుడు, స్నేహ‌శీలి. స‌మాజ అభివృద్ధి ధృక్ఫథం ఉన్న వ్యక్తి కావ‌డంతో అన‌తి కాలంలోనే ఆయ‌న పేరు రాష్ట్రంలో మార్మోగింది. వేగేశ్న ఫౌండేష‌న్ పేరుతో ఆయ‌న ఆప‌న్నుల‌ను ఆదుకోవ‌డంలో ముందున్నారు. ముఖ్యంగా బాప‌ట్ల నియోజ క‌వ‌ర్గంలో పార్టీల‌కు అతీతంగా ఆయ‌న సేవా కార్యక్రమాల‌తో దూసుకు పోతున్నారు. స్థానిక స‌మ‌స్యల‌ను పార్టీల‌కు అతీతంగా ప‌రిష్కరించ‌డంలోను ఆయ‌న ముందుంటున్నారు. ఒక‌ప‌క్క ఆయ‌న సామాజిక సేవ‌లో త‌ల‌మున‌క‌ల‌వుతూనే.. రాజ‌కీయంగానూ మెరుపులు మెరిపించాల‌ని చూస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌లు మ‌రో ఆరేడు మాసాలే ఉండ‌డం, అత్యంత కీల‌కంగా మార‌డం వంటి నేప‌థ్యంలో అటు వేగేశ్న ఫౌండేష‌న్ అధినేత గాను, బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ నాయ‌కుడి గాను వేగేశ్న న‌రేంద్ర వ‌ర్మ ఎలాంటి వ్యూహంతో ఉన్నారు? ఆయ‌న రాజ‌కీయాల్లో ఎలాంటి పాత్ర పోషించాల‌ని అనుకుంటున్నారు? వ‌ంటి అంశాల‌ను ఆయ‌న నుంచే “తెలుగుపోస్ట్” ప్రత్యేక‌ ఇంట‌ర్వ్యూలో తెలుసుకుందాం..

ప్రశ్న: ప్రజా సేవ‌లో ఉన్న మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలని అనిపించింది ?
నరేంద్ర వర్మ : మనిషిగా ఎంత సంపాదించినా ప్రజాసేవతో ప్రజలను ఆదుకోవడంలో ఉన్న తృప్తిని మించింది ఏమీ ఉండదు. వాస్తవంగా చూస్తే 2018 నుంచి నేను సేవాకార్యక్రమాలకు స్వీకారం చుట్టాలనుకున్నా. పార్టీ యువనేత లోకేష్‌ సూచనల మేర‌కు మూడేళ్లు ముందుగానే నా వేగేశ్న ఫౌండేష‌న్ ద్వారా నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృత స్థాయిలో సేవాకార్యక్రమాలు స్టార్ట్ చేశాను. నియోజకవర్గంలో ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తూ పార్టీల‌కు అతీతంగా సామాన్యుల్లోకి కూడా చొచ్చుకుపోయాను.

ప్రశ్న: ప్రత్యక్ష రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఎందుకు అనుకుంటున్నారు ? ఏవైనా కార‌ణాలు ఉన్నాయా ?
నరేంద్ర వర్మ : నేను సంపాదించిన డ‌బ్బులో కొంత ఖ‌ర్చు చేసి చేస్తోన్న సేవ‌ల‌తో కొంత వ‌ర‌కే తృప్తి పొందుతున్నా… ఒక ప్రజాపాలకుడిగా ఎన్నికైతే ప్రజాధనంతో ప్రజలకు ఎంతో ఉపయోగపడేలా నీతి, నిజాయితీతో మరింత సేవ చేసే వీలు ఉంటుంది. ప్రజాధనం సక్రమమార్గంలో ప్రజలకు అందాలంటే అలాంటి వ్యక్తిలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా ఆదర్శవాది, నవ్యాంధ్ర నిర్మాత, ఈ వయస్సులో కూడా నిత్యం కష్టపడుతున్న మన హీరో చంద్రబాబు నాయుడు గారి ఆదర్శభావంతోనే ఈ రోజు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను. అలాగే ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అన్న ఎన్టీఆర్‌ మాటే నాకు స్పూర్తి. పేద ప్రజలకు సాయం చెయ్యాలన్న ఆయన సంకల్ప బ‌లం నాకు ఎంతో ఇష్టం. రాజ‌కీయాల‌తో వ్యక్తిగ‌త అభివృద్ధి అవ‌స‌రం లేదు.. ఎన్టీఆర్ కెరీర్‌లో ఉన్నతంగా ఉండి రాజ‌కీయాల్లోకి వ‌చ్చి విప్లవాత్మక మార్పులు తేవ‌డంతో పాటు ఎంతో మంది పేద‌ల జీవితాల్లో వెలుగులు నింపారు. ఇవ‌న్నీ నాకు స్ఫూర్తే.

ప్రశ్న: ఇంత‌కీ మీరు రాజ‌కీయాల్లో కి ఎప్పుడు కాలు పెడుతున్నారు? దీనిపై ఏమైనా చ‌ర్చలు జ‌రిగాయా ?
నరేంద్ర వర్మ : పార్టీ యువనేత, మంత్రి లోకేష్ ముందుగా ప్రజల్లోకి వెళ్లి సేవ చెయ్యండి… ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోండి… ప్రజల్లో గుర్తింపు ఉంటే టీడీపీలో మీకు తప్పని సరిగా ప్రయార్టీ ఉంటుందని లోకేష్‌ చెప్పారు. ఆయన చెప్పిన మాటల మీద విశ్వాసంతోనే నేను 2015లోనే సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. మూడున్నర ఏళ్లుగా బాపట్లలో నిర్విరామంగా సేవాకార్యక్రమాలు చేస్తున్నాను. ఈ రోజు పార్టీల‌కు అతీతంగా వ‌ర్మ అంద‌రివాడు అన్న విధంగా చేరువ‌య్యాను.

ప్రశ్న: టీడీపీలో బాప‌ట్ల టికెట్‌ మీకు కేటాయిస్తార‌నే ధీమా ఉందా ?
నరేంద్ర వర్మ : టికెట్‌ రేసులో ఎంత మంది అయిన పోటీ ఉండవచ్చు. మెజార్టీ ప్రజల్లో ఉన్న అభిప్రాయం మేరకే అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని నేను భావిస్తున్నాను. నియోజకవర్గ ప్రజలు ఎక్కువ మంది కోరుకుంటే టికెట్‌ రావడం, గెలవడం సులువు అవుతుంది. ఆ నమ్మకాన్ని ప్రజల్లో నేను ఏర్పరుచుకున్నానని భావిస్తున్నాను. ఇక అధిష్టానం కూడా ఫీడ్‌బ్యాక్ తీసుకుని ఇక్కడ ఎవరైతే సరైన వ్యక్తో… ఎవరి వల్ల పార్టీ బలపడిందో ఆ నివేదికల ప్రకారమే సీటు ఇస్తుంది. బాప‌ట్లలో గ‌త నాలుగేళ్లలో పార్టీ బ‌ల‌ప‌డ‌డానికి కార‌ణం ఎవ‌రు ? సాధార‌ణ జ‌నాలు ఎవ‌రి ప‌ట్ల సుముఖంగా ఉన్నార‌న్న నివేదిక‌లు అధిష్టానం వ‌ద్ద ఉంటాయి. దీని ప్రకార‌మే అధిష్టానం నిర్ణయ‌మే ఫైన‌ల్‌.

ప్రశ్న: కోన ర‌ఘుప‌తి మీకు ప్రత్యర్థి అయితే మీరు ఆయ‌న‌ను ఎలా నిలువ‌రిస్తారు ?
నరేంద్ర వర్మ : బాపట్ల ఎమ్మెల్యేగా కోన రఘుపతి నాలుగున్నర ఏళ్లలో ఏం చేశారు… ఆయన వల్ల నియోజకవర్గానికి ఏం ఒరిగింది… ఎక్కడ ఎంత అభివృద్ధి జరిగిందన్నది ప్రజలకు తెలుసు. ఎవరికి ఓటు వేస్తే అభివృద్ధి జరుగుతుంది… ఏ పార్టీని ఇక్కడ గెలిపించుకోవాలో వాళ్లు ఇప్పటికే డిసైడ్ అయ్యారు. ఏ పార్టీ వల్ల ఈ రోజు గుంటూరు జిల్లాతో పాటు బాపట్ల నియోజకవర్గం అభివృద్ధి జరిగిందో తెలుసుకుని విచక్షణతో ఓటు వేసే ఆలోచన బాపట్ల ప్రజలకు ఉంది. బాపట్ల ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో ఓటు వేస్తారని బలంగా నమ్ముతున్నాను.

ప్రశ్న: రాజ‌కీయాల్లోకి వ‌స్తే.. విమ‌ర్శలు త‌ప్పవు ? సౌమ్యంగా ఉండే మీరు వీటిని భ‌రించ‌గ‌ల‌రా ?
నరేంద్ర వర్మ : మీర‌న్నట్టు సేవలో విమర్శలు ఉండవేమో. రాజకీయాల్లోకి వచ్చాక ప్రత్యర్థి పార్టీల నుంచి విపక్షాల నుంచి విమర్శలు సహజం. అయితే అవినీతి లేనప్పుడు అక్రమాలు లేనప్పుడు సమాజసేవ చేస్తూ … రాజకీయం చేస్తునప్పుడు నా పై విమర్శలు చేసేందుకు ఛాన్సే ఉండదు. సమాజంలో ప్రజల నుంచి మర్యాద, మన్ననలు పొందే రాజకీయాలు చేసినప్పుడు… పార్టీ కార్యకర్తలకు అనుగుణంగా నడుచుకుని వారితో మమేకమై వారి కష్టసుఖాల గురించి తెలుసుకున్నప్పుడు విపక్షాల నుంచే కాదు ఎవరి నుంచి కూడా విమర్శలు రావు. సహజంగా విమర్శలు చెయ్యడంలో వైసీపీ ముందు ఉంటుంది. పార్టీలతో సంబంధం లేకుండా అందరిని కలుపుకుని నీతి, నిజాయితితో ముందుకు వెళ్లడ‌మే నా ధ్యేయం. ఈ క్రమంలో ఎవరు విమర్శలు చేసినా పట్టించుకోను. నాయకులు రాజ‌కీయ కోణంలో చేసే విమర్శలు నేను పట్టించుకోను. ప్రజల విమర్శలు మాత్రమే నాకు ఫీడ్ బ్యాక్‌లాంటివి.

ప్రశ్న: ఈ టికెట్ కోసం అనేకమంది పోటీలో ఉన్నారు. మీకు ఇస్తే.. వారు యాంటీ అయ్యే అవ‌కాశం లేదా?
నరేంద్ర వర్మ : బాపట్ల టీడీపీలో వర్గాలు… గ్రూపులు లేవు. ఎవరికి సీటు ఇవ్వాలో పార్టీ అధినేత చంద్రబాబు గారికి తెలుసు. ఎవరికి సీటు ఇచ్చినా బాపట్లలో టీడీపీ జెండా ఎగరవేస్తామన్న ఆత్మవిశ్వాసం మాకు ఉంది. ఎవరికి సీటు ఇచ్చినా పని చెయ్యడానికి నేను సిద్దం. నాకు ఎలాంటి వర్గాలు లేవు.. ఎవరితో అయినా పార్టీ అభివృద్ధి కోసం… బాపట్లలో టీడీపీ గెలుపు కోసం… చంద్రబాబు సీఎం అయ్యేందుకు ఎవరితో అయిన కలిసి పని చేస్తాను. పార్టీకి ద్రోహం చేసే చర్యలు నేను చెయ్యను…. ఎవరు చేసినా నేను క్షమించను.

ప్రశ్న: రాజ‌కీయాల్లో కోట్లు కుమ్మరించాలి…? దీనికి మీరు ఏమ‌ంటారు?
నరేంద్ర వర్మ : డబ్బుతో రాజకీయాలు చెయ్యడం కొంతవరకు మాత్రమే సాధ్యమౌతుంది. ఎప్పుడు డబ్బుతోనే గెలవచ్చు అనే భావన పనికిరాదు. సమాజంలో ప్రజల మెప్పు పొంది ప్రజల కోసం పని చేసే నాయకులకు ఎప్పుడూ విలువ ఉంటుంది. డ‌బ్బే గెలుపు, ఓటమిలను శాశిస్తుందన్నది పూర్తిగా అవాస్తవం. మనిషి వ్యక్తిత్వం, ప్రజలకు అందుబాటులో ఉండే విధానం ఇవ‌న్ని ప్రస్తుత సమాజంలో కీలకంగా మారాయి. అభివృద్ధి చెందుతున్నా, సమాజం మారుతున్న దృష్ట్యా డబ్బున్న వాళ్లదే రాజకీయాల్లో రాజ్యం అన్నది పూర్తిగా మారిపోతోంది. ప్రజ‌ల్లో మార్పు వ‌చ్చింది. మ‌నిషి అందుబాటులో ఉండ‌డం… వ్యవ‌హార శైలి… అభివృద్ధి చూసే ఓట్లేస్తారు. ఇది భవిష్యత్తులో మరింత‌గా మారుతుంది.

ప్రశ్న: కేంద్రంపై పోరాడ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌ని, బాబు రాష్ట్రానికి చేసిందేమీ లేద‌ంటున్నారు.  మీరు ఎలా చూస్తారు ?
నరేంద్ర వర్మ : బీజేపీని చంద్రబాబు నమ్మి నవ్యాంధ్రకు కేంద్ర ప్రభుత్వం ఎంతో సహకారం అందిస్తుందనే నాలుగేళ్ల పాటు ఆ పార్టీతో కలిసి నడిచారు. బీజేపీ స్నేహం ముసుగులో చేసిన నమ్మక ద్రోహాన్ని నిరసిస్తూనే ఈ రోజు బీజేపీకి దూరమయ్యారు. ఏపీ ప్రయోజనాల కోసం నాలుగేళ్లు చంద్రబాబు ఎంతో ఓర్పుతో, సహనంతో ఆ పార్టీకి స్నేహహస్తం అందించారు. అయితే బీజేపీ ఆ నమ్మకాన్ని పూర్తిగా వమ్ము చేసింది. నవ్వాంధ్ర అభివృద్ధికి అడుగడుగునా ఆటంకాలు కలిగించింది. రాజధాని అమ‌రావ‌తి, పోలవరం ప్రాజెక్ట్‌ విషయాల్లో ఏమాత్రం సహకారం అందించలేదు. ఈ రోజు బీజేపీ చేసిన ద్రోహాన్ని ప్రతి ఒక్క ఆంధ్రుడికి తెలియచెప్పాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. కేంద్రం సహకారం లేకపోయిన ఈ రోజు నవ్యాంధ్రను చంద్రబాబు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. దీనికిగానూ బీసీలు,ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ప్రతీ ఒక్కరు ఆయన పట్ల సానుకూలతతో ఉన్నారు. మరోసారి ఆయనను ఎన్నుకునేందుకు రెడీగా ఉన్నారు.

ప్రశ్న:    టీడీపీ   ఎమ్మెల్యేలు చాలా మంది అవినీతితో అంట‌కాగుతున్నార‌నే వ్యాఖ్యలు ఉన్నాయి. దీనిపై మీ స్పంద‌న ?

నరేంద్ర వర్మ : ఇది పూర్తిగా అవాస్తవం. రాష్ట్రంలో (నాటి ఉమ్మడి స్టేట్లో కూడా క‌లుపుకుని ) 2004 – 2014 మార్చి వ‌ర‌కు ఎంత అవినీతి… జ‌రిగింది…. అప్పుడు జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో ఎంత మంది రాజ‌కీయ నాయ‌కులు, అధికారులు జైళ్ల చుట్టు తిరుగుతున్నారో ఇప్పుడు నాలుగేళ్లలో కొత్త రాష్ట్రం ఎలా అభివృద్ధి జ‌రిగిందో చూస్తున్నాం క‌దా..! చంద్రబాబు పాల‌న అంటేనే అవినీతికి ఆమ‌డ దూరంలో ఉంటుంది.

ప్రశ్న: బాప‌ట్ల టికెట్ వ‌చ్చి.. మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైతే.. తొలి ప్రాధాన్యం దేనికి ఇస్తారు ?
నరేంద్ర వర్మ : నేను బాపట్ల శాసనసభ్యుడిగా ఎన్నికైతే నియోజకవర్గంలో తాగు నీరు, పంట నీరుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ రెండు సమస్యలను పరిష్కరించేందుకు ప్రథ‌మ ప్రాధాన్యం ఇస్తాను. బాపట్ల నియోజకవర్గంలో ప్రతీ ఇంటికి మంచి నీరు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటాను. అలాగే పంట నీరు విషయంలో కూడా రైతన్నలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చెయ్యడమే నా లక్ష్యం. అలాగే నియోజకవర్గంలో పర్యాటకరంగం అభివృద్దికి చాలా అవకాశాలు ఉన్నాయి. పర్యాటకరంగం అభివృద్ధి చేసి బాపట్లను ప్రముఖ పర్యాటక కేంద్రంగా జాతీయ స్థాయిలో తీర్చిదిద్దమే నా లక్ష్యం.

Ravi Batchali
About Ravi Batchali 37102 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*