
వైసీపీ అధినేత జగన్ ఒక ఇల్లు ఒక టిక్కెట్ అన్న నినాదం అందుకుంటారా?. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గాల్లో ఆశావహుల సంఖ్య పెరిగిపోవడంతో జగన్ ఈ బాట పట్టారా? అది సాధ్యమేనా..? ఇదే ప్రస్తుతం వైసీపీలో జరుగుతున్న చర్చ. ప్రశాంత్ కిషోర్ టీం సర్వే ప్రకారమే గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలన్నది జగన్ దాదాపుగా డిసైడ్ అయ్యారు. అయితే ఒక కుటుంబానికి రెండు, మూడు టిక్కెట్లు ఇచ్చే కంటే ఒకరికి ఇచ్చి మరొకరిని పార్టీ సేవలకు ఉపయోగించుకోవాలన్న ఆలోచన కూడా జగన్ చేస్తున్నట్లు కనపడుతుందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కోసం చాంతాడంత క్యూలో ఆశావహులు ఉన్నారు. కొన్ని జిల్లాల్లో కుటుంబ రాజకీయాలు నడుస్తుందన్న సంగతి కాదనలేని వాస్తవం. ముఖ్యంగా రాయలసీమలోనే ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఈసారి ఫ్యామిలీ ప్యాక్ ఉండదని వైసీపీలో గోలగోలగా ఉంది.
అనేక చోట్ల కుటుంబ….
చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం, కర్నూలు జిల్లా గౌరు ఫ్యామిలీ, శిల్పా ఫ్యామిలీ ఇలా అనేకం ఉన్నాయి. ఇక నెల్లూరు జిల్లాలో మేకపాటి, ఉత్తరాంధ్రలో బొత్స కుటుంబాలు కుటుంబ రాజకీయాలను కొన్నేళ్లుగా సాగిస్తూ వస్తున్నారు. వీరిలో ఇద్దరికి ఖచ్చితంగా టిక్కెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా, ఆయన కుమారుడు మిధున్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. ఇక నెల్లూరు జిల్లాలో మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎంపీగా ఉండగా, ఆయన కుమారుడు గౌతమ్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు.
శిల్పా సోదరుల మాటేంటి?
ఇక వచ్చే ఎన్నికలలో కర్నూలు జిల్లాలో శిల్పా సోదరులిద్దరికీ టిక్కెట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. శిల్పా మోహన్ రెడ్డికి నంద్యాల టిక్కెట్, శిల్పా చక్రపాణిరెడ్డికి శ్రీశైలం టిక్కెట్ ఇవ్వాల్సి ఉంది. బొత్స ఫ్యామిలీకి మూడు టిక్కెట్లు గ్యారంటీ అన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జగన్ ఇటువంటి నిర్ణయం తీసుకుంటారా? అన్నది కూడా ప్రశ్నే. ముఖ్యంగా పార్టీ అధినేత జగన్ కుటుంబం నుంచే కడప జిల్లాలో మూడు, నాలుగు టిక్కెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఎంపీగా అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేగా రవీంద్రనాధ్ రెడ్డి జగన్ కుటుంబీకులేనన్న విషయాన్ని ఈ సందర్భంగా కొందరు గుర్తు చేస్తున్నారు.
ఆ నిర్ణయం తీసుకోరంటున్న…..
జగన్ అటువంటి నిర్ణయమేదీ తీసుకోలేదని, ఇది కేవలం ప్రచారమేనని కొందరంటున్నారు. అయితే ఈసారి జగన్ తన తల్లి విజయమ్మను మాత్రం పోటీకి దింపే అవకాశాలు లేవని చెబుతున్నారు. గత ఎన్నికల్లో విశాఖలో పోటికీ దింపి తప్పుచేశామని జగన్ ఇప్పటికీ అంటుంటారని, ఈసారి ఆ తప్పు చేయరని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ ప్రచారం ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదని కొందరు నేతలు అంటున్నారు. అయితే వాస్తవం ఏమిటంటే కుటుంబ సభ్యులకు ఇబ్బడి ముబ్బడిగా టిక్కెట్లు ఇస్తే ఆ ప్రభావం జిల్లా అంతటా పడే అవకాశముందని, అందువల్ల ఆ పనిచేయవద్దని కొందరు జగన్ కు సలహా ఇచ్చారంటున్నారు. మరి జగన్ ఈవిషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారోనన్న చర్చ వైసీపీలో విస్తృతంగా జరుగుతుంది.
Leave a Reply