
బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఇలాకాలోకి వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర అడుగుపెట్టబోతోంది. కైకలూరు నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట. కైకలూరు నియోజకవర్గం 1955లో ఏర్పడింది. నియోజకవర్గం ఆవిర్భవించిన తర్వాత ఇప్పటి వరకూ 13 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సార్లు విజయం సాధించింది. స్వతంత్ర అభ్యర్థులు మూడు సార్లు విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ ఒకేసారి ఇక్కడ గెలుపొందడం విశేషం. అదీ 2009లో జయమంగళ వెంకటరమణ టీడీపీ గుర్తుపై పోటీ చేసి ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన కామినేని శ్రీనివాస్ ను ఓడించారు.
గత ఎన్నికల్లో……
అయితే 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పొత్తతో కమలం పార్టీ గుర్తుపై నిలబడిన కామినేని శ్రీనివాస్ దాదాపు 21 వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. కామినేని శ్రీనివాస్ తొలిసారి ఇక్కడ గెలుపొందడం గమనార్హం. గత ఎన్నికలకు ముందు వరకూ కాంగ్రెస్ లో ఉన్న కామినేని శ్రీనివాస్ ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రోద్బలంతో బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన కామినేనికి అదృష్టం కలసి వచ్చింది. టీడీపీ మద్దతు తెలపడంతో కామినేని గెలుపు సులభమయింది. వెంటనే ఏపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా చేరారు. అతి ముఖ్యమైన వైద్య ఆరోగ్యశాఖను ఆయన దాదాపు నాలుగేళ్ల పాటు నిర్వహించారు.
త్రిముఖ పోటీయేనా….?
మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈసారి కైకలూరు నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొనే అవకాశముంది. వైసీపీ, టీడీపీ, జనసేనల మధ్యనే ఇక్కడ పోటీ ఉండే అవకాశముంది. కామినేని శ్రీనివాస్ కు కొంత వ్యక్తిగత ఇమేజ్ ఉంది. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా కామినేని శ్రీనివాస్ 2009లో పోటీ చేసినప్పుడు కేవలం 900 ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు. ఆయనకు దాదాపు యాభై వేల ఓట్లు వచ్చాయి. ఈసారి కామినేని ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీకి ఏపీలో ఎదురుగాలి వీస్తుండటంతో ఆయన సైకిల్ పార్టీ వైపు చూస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి.
బలమైన అభ్యర్థి లేక….
ఇక్కడ వైసీపీకి బలమైన అభ్యర్థి లేరు. గత ఎన్నికల్లో ఉప్పల రాంప్రసాద్ ను పార్టీ పోటీకి దించింది. అయితే పార్టీ ఇమేజ్ కారణంగానే ఆయనకు దాదాపు 66 వేల ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఇక్కడ అభ్యర్థిని మార్చాలన్నది జగన్ నిర్ణయంగా తెలుస్తోంది. మరి అభ్యర్థి ఎవరనేది ఇంకా నిర్ణయించక పోయినప్పటికీ అనేక మంది ఆశావహులు టిక్కెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కైకలూరు నియోజకవర్గంలోనే మాజీ హోంమంత్రి తనయుడు, తెలుగుదేశం నేత వసంతకృష్ణ ప్రసాద్ పార్టీలో కొద్దిసేపట్లో చేరనున్నారు. జగన్ సమక్షంలో ఆయన పార్టీ కండువాను కప్పుకోనున్నారు. మొత్తం మీద కైకలూరులో జగన్ పాదయాత్ర ఆ పార్టీకి హైప్ తెస్తుందా? లేదా? అన్నది చూడాల్సిందే.
Leave a Reply