బాబు పుణ్యమా అని …?

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఇప్ప్పుడు పీకలలోతు అప్పుల్లో మునిగితేలుతోంది. ఒక పక్క చూస్తే ఉద్యోగుల జీతభత్యాలు తెచ్చిన అప్పులకు వడ్డీలకే సరిపోతుంది. మరోపక్క సంక్షేమ కార్యక్రమాల అమలు కత్తిమీద సాములా మారింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతుంది. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో జగన్ ప్రజలకు ఇవ్వని హామీలేదు. ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే రాష్ట్ర ప్రస్తుత ఆర్ధిక దుస్థితి లో అత్యంత కష్టమైన వ్యవహారమే అంటున్నారు ఆర్ధిక నిపుణులు.

ఆదాయాల అన్వేషణే …

కొత్త ప్రభుత్వం ముందు కోటి సవాళ్లు ఎదురైన నేపథ్యంలో జగన్ వీటిని ఎలా జయిస్తారనే చర్చ సర్వత్రా కొనసాగుతుంది. ప్రస్తుతం ఏపీకి వస్తున్న ఆదాయాన్ని మరింత పెంచకపోతే బండి నడవని పరిస్థితి. అలా భావించి ఏమాత్రం పన్నులు విధించినా ఆదిలోనే ప్రజల నుంచి ప్రతిపక్షం నుంచి విమర్శలు వెల్లువెత్తే ప్రమాదం వుంది. ఈ నేపథ్యంలో నూతన ఆదాయా మార్గాలపై జగన్ దృష్టి సారించక తప్పదు. అందులో ప్రధానంగా మద్యం ధరలను బాగా పెంచే అవకాశం ఉందంటున్నారు.

ఇసుకను….

ఉచిత ఇసుక విధానంతో టిడిపి నేతలు వనరులను దోచుకున్నారని విమర్శలు ఆరోపణలు వెల్లువెత్తాయి. సర్కార్ పై ప్రజావ్యతిరేకత తీవ్ర స్థాయిలోకి రావడం వెనుక ఇది కూడా రీజన్ అయిన నేపథ్యంలో కొత్త ఆలోచనతో ఇసుకను ప్రభుత్వ ఆదాయంగా మార్చక తప్పదన్న ప్రచారం సాగుతుంది. మైనింగ్, టూరిజం లకు అత్యంత ప్రాధాన్యత కల్పించడం ద్వారా అటు ఆదాయం పెంపుదల చేస్తూ ఉపాధి అవకాశాలను పెంచాలనే ఆలోచన వైసిపి సర్కార్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలపై నేరుగా పన్నుల భారం పడకుండా ఆదాయం పెంచడం కష్టమని గుర్తించిన జగన్ మద్యపాన నిషేధం దశలవారీ అని చెప్పడం వెనుక సర్కార్ అప్పుల ఊబి లో కురుకుపోవడమే అంటున్నారు.

కేంద్రంపైనే ఆశలన్నీ …

ఆర్ధిక దుస్థితి నుంచి తక్షణం గట్టెక్కాలంటే ఖచ్చితంగా కేంద్రంపై ఆధారపడాలి అని వైసిపి అధినేత గుర్తించారు. అందుకే హస్తిన వెళ్ళి ప్రధాని మోడీని, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా లను కలిశారు జగన్. ఏపికి సంపూర్ణ సహకారం అందిస్తామని ఈ సందర్భంగా చెప్పినా ఆచరణలో ఏమేరకు తన హామీని నిలబెట్టుకుంటారో చూడాలి. ఒక పక్క రాజధాని నిర్మాణం మరోపక్క పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాలు జగన్ సర్కార్ కి పెద్ద సవాల్ అనే అంతా భావిస్తున్నారు. మరి ఈ కష్టాల సుడిగుండాలనుంచి వైసిపి అధినేత ఎలా బయటపడి రాష్ట్రాన్ని ఒడ్డున పడేస్తారన్నది చూడాలి.

Ram Tatavarthi
About Ram Tatavarthi 1698 Articles
Ram has been continuing in the journalism for the past 25 years. He started his career from Samacharam and worked for various print and electronic media houses like Eenadu, Andhra Bhoomi, the evening daily Sandhya, in cable, Andhra Prabha, Citi Cable, TV 9, CCC channel etc.. By having extensive experience in journalism and also by always keeping up to date with the latest technology he is now working as a freelance journalist.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*