
ఎన్నికల సమయంలో తన పార్టీని బలోపేతం చేసుకోవాలని వైసీపీ అధినేత జగన్ భావించారు. ఈ క్రమంలోనే గత ఏడాది నవంబరులో ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయడంతోపాటు.. లెక్కకు మిక్కిలిగా అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ నుంచి నాయకులను చేర్చుకోవాలని భావించారు. రెడ్ కార్పెట్ పరుస్తామని తెరచాటుగా ప్రచారం కూడా చేశారు. అయితే, కొందరు నాయకులు చేరారు. మరికొందరు ఇంకా ఊగిసలాటలోనే ఉన్నారు. ఇలాంటి వారిలో జగన్ ఆశలపై నీళ్లు జల్లారు ఓ కీలక కాంగ్రెస్ నేత. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆయన తన మనసులో మాటను బయట పెట్టారు. దీంతో ఇప్పుడు వైసీపీలో ఈ అంశం చర్చకు దారితీసింది.
ఆయన పార్టీలో చేరతారని…..
నిన్న మొన్నటి వరకు కూడా ఈ కీలక నాయకుడు తమ పార్టీలో చేరడం ఖాయమని భావించిన జగన్ సదరు నేత తీసుకున్న నిర్ణయంతో షాక్ గురైనట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ ఆ నేత ఎవరు? ఎందుకు జగన్ పార్టీలోకి చేరలేదు? అంశాలు తెరమీదికి వస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. కాంగ్రెస్‌తో అనుబంధాన్నిపెనవేసుకున్న ఎన్నో కుటుంబాల్లో ద్రోణంరాజు ఫ్యామిలీ ఒకటి. ద్రోణం రాజు సత్యనారాయణ కాంగ్రెస్‌లో ఎన్నో కీలక పదవులు అనుభవిం చారు. ఇప్పుడు ఆయన కుమారుడు ద్రోణంరాజు శ్రీనివాసరావు పీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అయితే, ఆయన వైసీపీలో చేరుతున్నారని నిన్న మొన్నటి వరకు కూడా వార్తలు వచ్చాయి.
కాస్త ఊపిరి పీల్చుకుంటుందని…..
2014 విభజన దెబ్బతో కాంగ్రెస్ పని అయిపోయిందని, దీంతో ఆయన పార్టీ మారతారని, ముఖ్యంగా వైఎస్ కుమారుడు జగన్ పెట్టిన పార్టీలోకి చేరతారని కథనాలు వచ్చాయి. అందరూ నిజమనుకున్నారు. అయితే, ఇంతలోనే కాంగ్రెస్ తన పంథా ను మార్చుకుని, పాత కాపులకు పెద్ద పీట వేయడం ప్రారంభించింది. అంతేకాదు, తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే.. ప్రత్యేక హోదాపైనే తొలిసంతకమని ప్రచారం చేసింది. దీంతో ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్‌కు కాస్తో కూస్తో ఊపిరి ఆడే పరిస్థితి వస్తోంది. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి లాంటి వాళ్లు తిరిగి కాంగ్రెస్ గూటికే చేరారు. ఇక కోట్లతో పాటు రఘువీరా లాంటి వాళ్లు పార్టీ మారడం లేదు. ఈ పరిణామాలు గమనించిన శ్రీనివాస్.. వైసీపీలోకి వెళ్లాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
కాంగ్రెస్ లోనే ఉంటానని…..
కాంగ్రెస్ పార్టీ తమ కుటుంబానికి ఎంతో ఇచ్చిందని, తన తండ్రి సత్యనారాయణను మూడు సార్లు ఎంపీగా, తనను రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిందని ఆయన చెప్పుకొచ్చారు. నెహ్రూ, గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసిందన్న ఆయన క్లిష్ట సమయంలో ఇతర పార్టీల్లోకి వెళతానన్నవి ఊహగానాలేనని కొట్టి పారేశారు. తనకు వైసీపీలోకి వెళ్లాలనే ఆలోచన కూడా లేదని కుండబద్దలు కొట్టారు. దీంతో జగన్ ఆశలు ఆవిరయ్యాయని అంటున్నారు పరిశీలకులు. అసలే ఉత్తరాంధ్రలో వైసీపీకి బలమైన అభ్యర్థులు కరువవుతున్నారు. ఈ క్రమంలో జగన్ ఆశలు పెట్టుకున్న సబ్బం హరి, కొణతాల రామకృష్ణ, తాజాగా ద్రోణంరాజు లాంటి వాళ్లు కూడా ఆయనకు హ్యాండ్ ఇచ్చే పరిస్థితి ఏర్పడడంతో వైసీపీకి కీలకమైన విశాఖ జిల్లాలో ఎన్నికల వేళ పుంజుకోవాలంటే చాలా కష్టాలు ఎదుర్కోక తప్పదు.
Leave a Reply