ఇక్కడ టగ్ ఆఫ్ వార్…!

ఒక ద్వీపకల్పంలా వుండే అమలాపురం పార్లమెంట్ విభిన్నమైనది. అమలాపురం, కొత్తపేట, రాజోలు, గన్నవరం, రామచంద్రపురం, మండపేట అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు వచ్చే ఎన్నికల్లో తీర్పు ఇక్కడ ఎవరికీ ఇస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. కాపు, శెట్టిబలిజ, ఎస్సి సామాజిక వర్గాలు అధికంగా వున్న ఈ ప్రాంతంలో ప్రతి ఎన్నిక విభిన్నమే. అమలాపురం పార్లమెంట్ ఏర్పడిన నాటినుంచి విజేతలను పరిశీలిస్తే …

కమ్యూనిస్ట్ ల కోట గా మొదలై …

అమలాపురం పార్లమెంట్ ఏర్పడ్డాక 1952 లో 1957 ఎన్నికల్లో వరుసగా సిపిఐ కి చెందిన కానేటి మోహన రావు విజేతగా నిలిచారు. ఆయన తరువాత కాంగ్రెస్ పార్టీకి చెందిన బయ్యా సూర్యనారాయణ మూర్తి 1962,1967,1971 లలో జరిగిన ఎన్నికల్లో మూడుసార్లు వరుసగా గెలిచి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు.1977, 1980 లో కాంగ్రెస్ అభ్యర్థి కుసుమ కృష్ణ మూర్తి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు.

1984 లో జెండా పాతిన టిడిపి…

రెండు టర్మ్ లు మినహా మిగిలిన ఐదు దఫాలు వరుస విజయాలతో దూసుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి 1984 లో తొలిసారి చెక్ పడింది. ఆ నాటి ఎన్నికల్లో ఎజె బుచ్చి మహేశ్వర రావు టిడిపి అభ్యర్థిగా విజేతగా నిలిచి కొత్త రాజకీయానికి కోనసీమ లో తెరలేపారు. అయితే తరువాత 1989 లో జరిగిన ఎన్నికల్లో వీచిన కాంగ్రెస్ గాలితో కుసుమ కృష్ణ మూర్తి అమలాపురం సీటును కాంగ్రెస్ ఖాతాలో జమ చేశారు.

బాలయోగి పార్లమెంట్ ప్రస్థానం ప్రారంభం …

1991 లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో చంద్రబాబు కి అత్యంత విశ్వాస పాత్రుడు జిఎంసి బాలయోగి తొలిసారి లోక్ సభ ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్ లో అడుగుపెట్టారు. 1996 లో జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి అభ్యర్థి బరిలో నిలవడంతో టిడిపి ఓట్లు చీలి జిఎంసి బాలయోగి ముక్కోణపు పోటీలో మాజీ ఐఏఎస్ కె ఎస్ ఆర్ మూర్తి చేతిలో పరాజయం పాలయ్యారు. తిరిగి 1998 లో వచ్చిన ఎన్నికల్లో టిడిపి, కాంగ్రెస్, బిజెపి అభ్యర్థుల నడుమ సాగిన పోరులో గెలిచి లోక్ సభకు స్పీకర్ గా ఎన్నికయ్యారు. నాటి బిజెపి సర్కార్ లో టిడిపి చేరడంతో బాలయోగి కి అదృష్టం వరించి ఆయన స్పీకర్ కాగలిగారు. ఆ టర్మ్ లో ఒక్కఓటుతో వాజ్ పేయి ప్రభుత్వం కుప్పకూలిన సందర్భంలో ఆయనే స్పీకర్ కావడం విశేషం.

బిజెపి అలయెన్స్ లో. ..

ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి నుంచి పొత్తు తో టిడిపి పోటీ చేయడం బాగా కలిసివచ్చింది. ఫలితంగా సునాయాసంగా బాలయోగి కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు. ఆ తరువాత తిరిగి లోక్ సభకు స్పీకర్ అయిన బాలయోగి హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోవడంతో జరిగిన ఉపఎన్నికలో ఆయన సతీమణి గంటి విజయ కుమారి రెండేళ్లపాటు పార్లమెంట్ సభ్యురాలిగా పనిచేశారు. ఈ సమయంలో ఆమె పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అయ్యింది. ఆమెకు సైతం రాజకీయాలపట్ల ఆసక్తి లేకపోవడంతో 2004 ఎన్నికల్లో టిడిపి ఆమెకు తిరిగి సీటు కేటాయించలేదు.

రెండుసార్లు గెలిచిన హర్ష కుమార్ …

2004, 2009 ఎన్నికల్లో అమలాపురం టికెట్ దక్కించుకున్న జివి హర్ష కుమార్ రెండుసార్లు వరుసగా గెలిచారు. రెండో సారి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి గట్టిగా పోటీ ఇచ్చినా, కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాల వెన్నుపోట్లు తట్టుకుని హర్షకుమార్ తిరిగి గెలిచి బీటలు వారిన కాంగ్రెస్ కంచుకోట ను తిరిగి నిర్మించారు. అయితే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బహిష్కృతుడై సమైక్యాంధ్ర పార్టీ తరపున పోటీ చేసిన హర్ష కుమార్ వైఎస్సాఆర్ సిపి, కాంగ్రెస్ పార్టీల తరువాత స్థానం దక్కించుకున్నారు. ఆ నాటి ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి పండుల రవీంద్ర బాబు లక్షా 20 వేల ఓట్ల తేడాతో వైసిపి అభ్యర్థి పినిపే విశ్వరూప్ పై ఘనమైన విజయాన్ని దక్కించుకున్నారు.

2019 లో విజేత ఎవరు …?

2014 లో రాష్ట్ర విభజన, బిజెపి, జనసేన టిడిపి కి మద్దత్తు గా నిలవడం రకరకాల రాజకీయ సమీకరణలతో జరిగిన ఎన్నిక. కానీ రాబోయే 2019 ఎన్నికలు నాటి ఎన్నికలకు పూర్తి విభిన్నం. జనసేన, బిజెపి ఇప్పుడు టిడిపికి దూరం. హర్ష కుమార్ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో క్లారిటీ లేదు. మరోవైపు వైసిపి అభ్యర్థి గా పినిపే విశ్వరూప్ తిరిగి బరిలోకి దిగుతారా లేక అమలాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారా అన్నది స్పష్టం కాలేదు. ఇదిలా ఉంటే టీడీపీ బాలయోగి తనయుడిని బరిలోకి దింపే యోచన చేస్తున్నట్లు టాక్. సిట్టింగ్ ఎంపీ పండుల రవీంద్ర బాబు పై అసంతృప్తి ని ఇటు క్యాడర్ కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆయన సీటు గ్యారంటీ లేదని తెలుగుదేశం సర్కిల్స్ లో విన వస్తున్న మాట. దాంతో అమలాపురం పార్లమెంట్ నుంచి వచ్చే ఎన్నికల్లో ఎవరు విజేత గా నిలుస్తారు ఎవరు పరాజితులు అవుతారన్న చర్చ కోనసీమలో చక్కెర్లు కొడుతోంది.

Ram Tatavarthi
About Ram Tatavarthi 1795 Articles
Ram has been continuing in the journalism for the past 25 years. He started his career from Samacharam and worked for various print and electronic media houses like Eenadu, Andhra Bhoomi, the evening daily Sandhya, in cable, Andhra Prabha, Citi Cable, TV 9, CCC channel etc.. By having extensive experience in journalism and also by always keeping up to date with the latest technology he is now working as a freelance journalist.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*