
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర నేడు రెండు వేల కిలోమీటర్లకే చేరుకోనుంది. ఏలూరుకు సమీపంలోని వెంకట్రామపురం వద్ద జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లకు చేరుకోనుండటంతో వైసీపీ నేతలు పెద్దయెత్తున ఏర్పాట్లు చేశారు. వెంకట్రామపురం వద్ద నలభై అడుగుల పైలాన్ ను ఏర్పాటు చేశారు. దీనిని నేడు జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. అలాగే ఈ సందర్భంగా ఏలూరులో జరిగే భారీ బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు.
ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో…..
వైసీపీ అధినేత జగన్ ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు గత ఏడాది నవంబరు 6వ తేదీన కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రజాసంకల్ప పాదయాత్రను ప్రారంభించారు. ప్రతి శుక్రవారం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు జగన్ హాజరుకావాల్సి ఉండటంతో పాదయాత్రకు దాదాపు ప్రతి వారం బ్రేక్ పడుతూ వస్తోంది. ఇప్పటికి జగన్ పాదయాత్ర ప్రారంభించి ఆరునెలలు కావస్తోంది. ఇప్పటికే జగన్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసుకుని నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో అడుగుపెడుతున్నారు.
జగన్ కు సంఘీభావంగా……
జగన్ వెయ్యి కిలోమీటర్ల యాత్ర నెల్లూరు జిల్లాలోని సైదాపురం వద్ద పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జగన్ పార్టీ నేతలు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో జగన్ కు సంఘీభావంగా పాదయాత్రలు చేశారు. అలాగే రెండు వేల కిలోమీటర్ల సందర్భంగా ఈసారి విన్నూత్నంగా వైసీపీ ప్లాన్ చేసింది. ప్రతి నియోజకవర్గంలో రెండు రోజుల పాటు వైసీపీ నేతలు పాదయాత్రలు చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రజాసమస్యలను తెలుసుకుని ఈ నెల 16వ తేదీన జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలి. అక్కడే బహిరంగ సభ ఏర్పాటు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీకి చేసిన అన్యాయం గురించి వివరించాలి.
ఇంకా ఐదు జిల్లాల్లోనే….
నేడు రెండు వేల కిలోమీటర్ల పాదయాత్రకు చేరువ కావడంతో మరో వెయ్యి కిలోమీటర్ల మాత్రమే జగన్ యాత్రను చేయాల్సి ఉంటుంది. పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఆయన పాదయాత్ర ఉంటుంది. ఈ యాత్ర మరో నాలుగు నెలలు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే జగన్ తన పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. ఎక్కడికక్కడ హామీలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. పాదయాత్ర వచ్చే ఎన్నికల్లో తమను జైత్రయాత్ర వైపు నడిపిస్తుందని వైసీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Leave a Reply