
కృష్ణా జిల్లా జగన్ కు కలిసి వచ్చినట్లుంది. కృష్ణా జిల్లాలోకి ప్రవేశించగానే చేరికలు ఊపందుకున్నాయి. కృష్ణా జిల్లాలోకి ప్రవేశించగానే కనకదుర్గ వారధిమీద తెలుగుదేశం పార్టీ నేత యలమంచలి రవి పార్టీలో చేరిపోయారు. ఆయన చేరికతో విజయవాడ పట్టణంలో పార్టీకి కొంత ఊపు వచ్చినట్లయింది. ఇక అక్కడ నుంచి చేరికలు ఊపందుకున్నాయి. అలాగే పాణ్యం నియోజకవర్గానికి చెందిన కాటసాని రాంభూపాల్ రెడ్డి కూడా కృష్ణా జిల్లాలోనే జగన్ సమక్షంలో పార్టీ కండువాను కప్పేసుకున్నారు. బీజేపీ నేతగా ఉన్న కాటసాని వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో రాయలసీమలో బలం పెరిగినట్లేనంటున్నారు.
కన్నబాబు కూడా….
ఇక తాజాగా విశాఖ జిల్లా యలమంచలి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే యు.వి. రమణ మూర్తి (కన్నబాబు) పార్టీ కండువా కప్పేసుకున్నారు. కన్నబాబు పార్టీలో చేరికపై పార్టీలో కొంత వివాదమున్నప్పటికీ అక్కడ పార్టీ బాధ్యతలను చూస్తున్న విజయసాయి రెడ్డి వారికి నచ్చజెప్పి శాంతింప చేశారు. ఇక రేపో మాపో టీడీపీ నేత వసంతకృష్ణ ప్రసాద్ కూడా పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. రెండు, మూడు రోజుల్లో వసంతకృష్ణ ప్రసాద్ వైసీపీ కండువా కప్పేసుకోవడానికి రెడీ అయిపోతున్నారు. ఇలా కృష్ణా జిల్లా జగన్ కు కలసి వచ్చిందంటున్నారు.
నేటి పాదయాత్ర షెడ్యూల్….
ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో జరుగుతోంది. జగన్ పాదయాత్ర నేటికి 154వ రోజుకు చేరుకుంది. పెడన నియోజకవర్గం కొంకెపడి శివారు ప్రాంతం నుంచి పాదయాత్ర ఈరోజు బయలుదేరనుంది. అక్కడ నుంచి రెడ్డిపాలెం, వడ్లమన్నాడు, వేమవరం, కవుతారం మీదుగా గుడ్లవల్లేరు గ్రామానికి చేరుకుంటుంది. గుడ్లవల్లేరులోనే రాత్రికి జగన్ బస చేయనున్నారు. మొత్తం మీద కృష్ణా జిల్లాలో జగన్ పాదయాత్ర పూర్తి సక్సెస్ తో నడుస్తుందని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. యాత్రకు లభిస్తుందన్న ప్రజల స్పందనతో పాటు చేరికలు కూడా వారిలో ఉత్సాహాన్ని నింపాయి.
Leave a Reply