
వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర ఆదివారం నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు చేరుకుంటోంది. జగన్ యాత్ర శనివారంతో కృష్ణా జిల్లాలో ముగియనుంది. జగన్ ప్రస్తుతం కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే ఈ నెల 13 నుంచి ప్రారంభమయ్యే జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ పార్టీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ ఇప్పటి వరకూ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలో పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. కృష్ణా జిల్లాలోనూ పాదయాత్ర ముగియనుండటంతో మొత్తం ఎనిమిది జిల్లాల్లో పాదయాత్ర జగన్ పూర్తి చేసుకున్నట్లవుతుంది.
ఏలూరుకు సమీపంలో…..
పశ్చిమ గోదావరి జిల్లాలోనే జగన్ పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లకు చేరుకుంటుంది. ఈ నెల 14వ తేదీన ఏలూరు సమీపంలోని మదేపల్లి వద్ద జగన్ పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లకు చేరుకుంటుంది. రెండు వేలకిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా మదేపల్లి వద్ద నలభై అడుగులతో పైలాన్ ను ఏర్పాటు చేశారు. ఈ పైలాన్ ను జగన్ ఆవిష్కరిస్తారు. అదే రోజు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు పాదయాత్రలు చేయనున్నారు. రెండు రోజుల పాటు పాదయాత్రలు చేసిన తర్వాత వైసీపీ నేతలు కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించి ప్రత్యేక హోదాను కోరుతూ జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం సమర్పిస్తారు.
గత ఎన్నికల్లో షాకిచ్చిన….
పశ్చిమగోదావరి జిల్లా గత ఎన్నికల్లో జగన్ పార్టీకి పెద్ద షాకిచ్చింది. ఒక్క సీటంటే ఒక్క సీటు కూడా ఇక్కడ రాకపోవడం విశేషం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలసి క్లీన్ స్వీప్ చేసేశాయి. పార్లమెంటు స్థానాలనూ అవే దక్కించుకున్నాయి. జగన్ పార్టీకి ఇక్కడ జీరో రిజల్ట్ వచ్చింది. అయితే ఎన్నికల అనంతరం జగన్ పశ్చిమ గోదావరి జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పోలవరం ముంపు బాధితులకు అండగా, ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీ బాధితులకు మద్దతుగా నిలిచారు జగన్. అంతేకాకుండా ఈ జిల్లాలోనూ యువభేరి సభలను నిర్వహించివ యువతలో ప్రత్యేక హోదాపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.
ఇక్కడా చేరికలుంటాయా?
అయితే పశ్చిమ గోదావరి జిల్లలో జగన్ పార్టీని నాయకత్వ సమస్య వెంటాడుతుంది. సరైన నాయకుడు లేకపోవడం వైసీపికి పెద్ద సమస్య. చెప్పుకోదగ్గ లీడర్ పార్టీలో ఇప్పటికీ లేకపోవడం మైనస్సేనని చెప్పకతప్పదు. అయితే ఈసారి ఆ సమస్యను అధిగమించాలన్నది జగన్ ఆలోచనగా ఉంది. ఇటీవల పార్టీలో చేరికల జోరు పెరిగింది. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కొందరు సీనియర్ నేతలకు ఇప్పటికే వైసీపీ వల వేసినట్లు తెలుస్తోంది. జగన్ పాదయాత్ర సందర్భంగా వారు పార్టీలోచేరతారని చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 13 నియోజకవర్గాల్లో జగన్ పాదయాత్ర 250 కిలోమీటర్ల మేర సాగనుంది. మొత్తం మీద జీరో ఉన్న జిల్లాలో తన బలాన్ని జగన్ ఏ మేరకు పెంచుకుంటారో చూడాలి.
Leave a Reply