జగన్ చెప్పిందే జరుగుతుందా?

ముందస్తు ఎన్నికలకు ముహూర్తం ఖరారయిందా? జనవరిలోనే లోక్ సభతో పాటు తొమ్మిది రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయా? అవును ఢిల్లీ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. భారతీయ జనతా పార్టీ కూడా ఇదే వ్యూహంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది నవంబరు నెలలో నిజానికి నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు జరగాలి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మిజోరాం ఎన్నికలను ఈ ఏడాది చివర్లో జరపాల్సి ఉంటుంది. తాజాగా ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రం చేరింది. తెలంగాణ శాసనసభను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రద్దు చేయడంతో తెలంగాణలో కూడా ఎన్నికల కమిషన్ ఆ నాలుగు రాష్ట్రాలతోనే ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. దీనిపై ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది.

ఎన్నికల కమిషన్ ప్రక్రియ……

అయితే మహారాష్ట్ర, హర్యానా, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు లోక్ సభ ఎన్నికలకు వచ్చే ఏడాది మార్చి నాటికి ఎన్నికల ప్రక్రియను ఎన్నికల కమిషన్ ప్రారంభించాల్సి ఉంటుంది. మే 25వ తేదీతో లోక్ సభతో పాటు ఈ నాలుగు రాష్ట్రాల పదవీకాలం ముగియనుంది. అంటే పదవీకాలం ముగిసే ఆరు నెలల ముందు నోటిఫికేషన్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. అంటే నవంబరు 17వతేదీన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాలతో పాటు లోక్ సభకు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, ఒడిశా రాష్ట్రాలకు కూడా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఢిల్లీలో పెద్దయెత్తున ప్రచారం జరుగుతోంది.

కొన్ని రాష్ట్రాల అంగీకారం…..

ఇప్పటికే మహారాష్ట్ర, హర్యానా, ఒడిశా రాష్ట్రాలు లోక్ సభతో పాటు ఎన్నికలకు వెళతామని ఎన్నికల కమిషన్ కు తమ అంగీకారాన్ని తెలిపాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళతామని చెబుతోంది. అయితే ఒక్క రాష్ట్రం కోసం ఎన్నికల కమిషన్ వేచి చూడాల్సిన అవసరం లేదంటున్నారు. ఏపీ ప్రభుత్వాన్ని ఒప్పంచి ఒకేసారి తొమ్మిది రాష్ట్రాలకు, లోక్ సభకు కలిపి ఎన్నికలను నిర్వహించాలనే అభిప్రాయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఉందన్న వార్తలు హస్తినలో హల్ చల్ చేస్తున్నాయి.

జగన్ చేసిన వ్యాఖ్యలతో……

ఇటీవలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సయితం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎన్నికలు ముందు గావచ్చే అవకాశముందని చెప్పడం గమనార్హం. ఢిల్లీ వర్గాల్లోనూ ఇదే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో బీజేపీ కొంత వెనుకబడి ఉండటంతో కమలం పార్టీ కూడా ముందుగానే ఎన్నికలకు వెళ్లాలన్న అభిప్రాయంలోఉంది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలు ముందస్తుకు వెళ్లాలనే అనుకుంటున్నారు. అలాగే జమిలి ఎన్నికలకు కూడా కమలం పార్టీ సై అంటుంది. అందుకే లోక్ సభ ఎన్నికలను ముందస్తుగా వెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. ఎన్నికల ఖర్చు తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందని బీజేపీ వాదిస్తోంది. మొత్తం మీద హస్తినలో మాత్రం ముందస్తు ఊహాగానాలు జోరందుకున్నాయి. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ లో సయితం ఎన్నికలు ముందుగా వచ్చే అవకాశముందంటున్నారు విశ్లేషకులు.

Ravi Batchali
About Ravi Batchali 18721 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*