
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో అప్రతిహతంగా సాగుతుంది. ఆయన తాజాగా పాలకొండ నియోజకవర్గం నుంచి రాజాం నియోజకవర్గంలోకి ప్రవేశించారు. ఇక్కడ జగన్ కు మరోసారి టెన్షన్ తప్పేట్లు లేదు. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతోనే వైసీపీ అభ్యర్ధి గెలుపొందారు. రాజాం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు రెండూ బలంగానే ఉన్నాయి. గత ఎన్నికలలో వైసీపీ గెలిచినా రాజాం నియోజకవర్గానికి సంబధించి రాజకీయంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ధీటైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు సిద్ధమవుతోంది. దీంతో రాజాం నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర పార్టీకి నూతన జవసత్వాలు తెస్తుందన్న ఆశలో వైసీపీ శ్రేణులున్నాయి.
గత ఎన్నికల్లో….
రాజాంనియోజకవర్గంలోకి జగన్ పాదయాత్ర నాగావళి నది వంతెన మీదుగా సాగింది. వేలాది మంది కార్యకర్తలు తరలి వచ్చి జగన్ కు స్వాగతం పలికారు. గత ఎన్నికల్లో ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. రిజర్వ్ డ్ నియోజకవర్గం కావడంతో ఈ ప్రాంతంలో సమస్యలు యధాతధంగానే ఉన్నాయి. గత ఎన్నికలలో రాజాం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కంబాల జోగులు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి కావలి ప్రతిభా భారతిపై విజయం సాధించారు. కేవలం 512 ఓట్ల తేడాతోనే ప్రతిభా భారతి ఓడిపోయారు. అంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచినా పెద్దగా గెలిచినట్లు కాదనే చెప్పాలి. అంకెల ప్రకారం గెలుపే కాని ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎంత పట్టుందో గత ఎన్నికల ఫలితాలే రుజువు చేశాయి. 2009 ఎన్నికల్లో ఇదే ప్రతిభా భారతి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కొండ్రు మురళిమోహన్ పై 27వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.2009ఎన్నికల కంటే2014 ఎన్నికల నాటికి టీడీపీ బలం బాగా పుంజుకుంది.
కొండ్రు మురళి చేరడంతో….
అయితే తాజాగా అక్కడ పరిస్థితులు మారిపోయాయి. మాజీ మంత్రి కొండ్రు మురళి కాంగ్రెస్ కండువా తీసేసి పసుపు కండువా కప్పుకున్నారు. రాజాం టిక్కెట్ ను కొండ్రు మురళికి వచ్చే ఎన్నికల్లో కేటాయిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అప్పటి వరకూ టీడీపీ ఇన్ చార్జిగా ఉన్న ప్రతిభా భారతిని సయితం పక్కన పెట్టి కొండ్రుకు ఇన్ ఛార్జి బాధ్యతలను అప్పగించారు. అయితే గత నాలుగేళ్లుగా తాను నియోజకవర్గంలో కష్టపడి పనిచేస్తున్నానని, తనకు అవకాశం ఇవ్వాలని ప్రతిభా భారతి కోరినా చంద్రబాబు కొండ్రుమురళి వైపే మొగ్గారు. రాజాం నియోజకవర్గంలో కొండ్రుమురళికి సొంతంగా ఒక వర్గం ఉంది. బలమున్న నేత కావడంతోనే ఆయనకు పార్టీ పగ్గాలు చంద్రబాబు అప్పగించారు.
వారిద్దరూ కలిస్తే….
ఇక ప్రస్తుత ఎమ్మెల్యే కంభాల జోగుల విషయానికి వస్తే ప్రతిపక్షంలో ఉండటంతో నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి పనులు చేపట్టలేకపోయారు. ఇక కొండ్రు మురళి, ప్రతిభా భారతి కలసికట్టుగా పనిచేస్తే కంభాల జోగులుకు ఈసారి కష్టమేనని చెప్పక తప్పదు. అందుకే జగన్ ఈ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మురళిని ఎదుర్కొనడం అంత సులువు కాదని జగన్ కూ తెలుసు. అందుకే ఇక్కడ ప్రత్యేక సర్వేలు కూడా జగన్ నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా కంభాల జోగులు పార్టీని వీడలేదు. దీంతో జగన్ ఆయనకే టిక్కెట్ ఇస్తారా? లేదా? అన్నది తేల్చడం లేదు. మొత్తం మీద రాజాంలో రాజెవరన్నది మరోసారి టెన్షన్ తప్పేలాలేదు.
Leave a Reply