వైసీపీలోకి ఊహించని నేతలు…?

వైసీపీ అధినేత జగన్ పక్కాగా వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో పార్లమెంటు స్థానాలకు, శాసనసభ ఎన్నికలకు ఒకేసారి ఎన్నికలు జరగాల్సి ఉండటంతో ప్రధానంగా ఎంపీ అభ్యర్థులపైనే జగన్ దృష్టి కేంద్రీకరించినట్లు చెబుతున్నారు. పార్లమెంటు స్థానాలకు బలమైన అభ్యర్థులను బరిలోకి దింపితే అసెంబ్లీ స్థానాలను కూడా సులువుగా చేజిక్కించుకోవచ్చన్న ఆలోచనతో జగన్ పకడ్బందీగా ఎంపీ అభ్యర్థులను బరిలోకి దించాలని నిర్ణయించుకన్నట్లు సమాచారం.

ఇప్పటికే పాదయాత్రతో…..

ఇప్పటికే ప్రజాసంకల్ప పాదయాత్రతో పార్టీకి మంచి హైప్ రావడం, ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలసి వస్తుందన్న నమ్మకం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఈ సమయంలో వీక్ గా ఉన్న ఎంపీ అభ్యర్థులను పోటీకి దింపితే ఆ ప్రభావం ఎమ్మెల్యేల ఎన్నికపై కూడా పడక తప్పదు. ముఖ్యంగా రాజధానికి చేరువలో ఉన్న విజయవాడ, గుంటూరు పార్లమెంటు స్థానాలకు ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్న వారిని ఎంపిక చేయాలని జగన్ నిర్ణయించారు.

గుంటూరు పార్లమెంటుకు…..

ఈ మేరకు కసరత్తులు కూడా ప్రారంభించారు. గుంటూరు పార్లమెంటు స్థానానికి తొలుత విజ్ఞాన్ సంస్థల అధినేత లావు రత్తయ్య కుమారుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు అనుకున్నారు. కానీ తెలుగుదేశం అభ్యర్థి గల్లా జయదేవ్ ను ఎదుర్కొనాలంటే ఇంకా బలం కలిగిన నేత అవసరమని భావించిన జగన్ ధర్మతేజ అనే కొత్త వ్యక్తిని రంగంలోకి దింపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ధర్మతేజ హీరో కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ భార్య తరుపున బంధువు కావడం విశేషం. ఈ మేరకు ధర్మతేజతో వైసీపీ నేతలు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దర్మతేజ పోటీ చేస్తే కృష్ణ కుటుంబ సభ్యుల మధ్యే ఆసక్తి పోరు నెలకొంటుంది.

ఆయన వస్తే మాత్రం……..

ఇక విజయవాడ స్థానానికి కూడా ఊహించని పేరు బయటకు వచ్చింది. విజయవాడ లోక్ సభ స్థానానికి ఇప్పటి వరకూ సినీ హీరో కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు అనుకున్నారు. కానీ జగన్ మాత్రం లోకల్ గా బలంగా ఉన్న నేతను బరిలోకి దించాలని భావిస్తున్నారు. విజయ ఎలక్ట్రికల్స్ అధినేత దాసరి జై రమేష్ ను విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీకి దింపాలని జగన్ నిర్ణయించారు. ఈ మేరకు జై రమేష్ తో వైసీీపీ కీలక నేత ఒకరు సంప్రదించినట్లు తెలుస్తోంది. దాసరి జైరమేష్ కుటుంబం తొలినుంచి తెలుగుదేశం పార్టీకి బలమైన మద్దతుదారుగా ఉంది. అయితే పార్టీలో వారికి కొంతకాలంగా ప్రయారిటీ లేకపోవడంతో అసంతృప్తిలో ఉన్న జైరమేష్ వైసీపీలోకి వస్తే మాత్రం బలమైన అభ్యర్థి అవుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తం మీద రెండు పార్లమెంటు స్థానాలకు ప్రధాన సామాజికవర్గానికి చెందిన నేతలను ఎంపిక చేయాలన్న ఆలోచనలో వైసీపీ అధినేత ఉన్నారు.

Ravi Batchali
About Ravi Batchali 30204 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*