సీనియర్లకు జగన్ కండిషన్ ఇదే….!

వైసీపీ అధినేత జగన్ ఈసారి ఒకే కుటుంబానికి ఒక టిక్కెట్ అంటే కుదురుతుందా? ఈసారి కూడా అనేకమంది నేతలు తమ కుటుంబంలో టిక్కెట్ల కోసం పోటీ పడుతున్నారు. ఆర్థికంగా బలమైనవారు కావడం, సీనియర్ నేతలవ్వడంతో జగన్ ఈసారి కూడా తలవంచక తప్పకదంటున్నారు. అయితే ఇందుకు కొంత జగన్ రెండు టిక్కెట్లు కావాలంటే మరో రెండు నియోజకవర్గాలను దత్తత తీసుకోవాల్సి ఉంటుందని ముందుగానే సీనియర్ నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. వారి జిల్లాలో ఉన్న ఎస్సీ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులను కూడా గెలిపించే బాధ్యతను ఆ సీనియర్ నేతలకే అప్పగిస్తారని సమాచారం. పార్టీలో దీనిపై విస్తృతంగానే చర్చ జరుగుతుంది.

గత ఎన్నికల్లోనూ….

గత ఎన్నికల్లోనూ భూమా, మేకపాటి, పెద్దిరెడ్డి కుటుంబాల్లో జగన్ పార్టీ రెండు సీట్లు కేటాయించింది. భూమా కుటుంబంలో అయితే ఏకంగా మూడు సీట్లను కేటాయించింది. కర్నూలు ఎస్వీ మోహన్ రెడ్డికి, నంద్యాల భూమా నాగిరెడ్డి, ఆళ్లగడ్డ శోభానాగిరెడ్డికి కేటాయించింది. ఆ తర్వాత భూమా నాగిరెడ్డి టీడీపీలోకి జంప్ అయ్యారు. ఆయన మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ టీడీపీ గెలిచింది. ఇక చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డికి పుంగనూరులో ఆయనకు, రాజంపేట ఎంపీగా ఆయన తనయుడు మిథున్ రెడ్డికి అవకాశమిచ్చారు. నెల్లూర ఎంపీగా మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యేగా మేకపాటి గౌతంరెడ్డికి ఇవ్వగా ఇద్దరూ విజయం సాధించారు.

శిల్పా నుంచి బొత్స వరకూ….

ఈసారి భూమా కుటుంబం పార్టీ నుంచి వెళ్లిపోగా వారి స్థానంలో శిల్పా కుటుంబం వచ్చింది. శిల్పా చక్రపాణిరెడ్డికి శ్రీశైలం నియోజకవర్గ టిక్కెట్, నంద్యాల టిక్కెట్ ను శిల్పా మోహన్ రెడ్డి కుమారుడు రవిరెడ్డికి దక్కనుందంటున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబంలో మరోసారి రెండు టిక్కెట్లు ఇవ్వకతప్పదు. ఇక తాజాగా ఉత్తరాంధ్రలోనూ రెండు సీట్ల పంచాయతీ ప్రారంభమైంది. విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబానికి పట్టున్న సంగతి తెలిసిందే. దీంతో బొత్స మొత్తం నాలుగు సీట్ల వరకూ ఆశిస్తున్నారు. అయితే రెండు సీట్లతో సరిపెట్టాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.

రెండు నియోజకవర్గాలను దత్తత….

అలాగే శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన కుటుంబానికి కూడా రెండు సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇద్దరూ ఎమ్మెల్యేలుగానే పోటీ చేస్తారా? ఒకరు ఎమ్మెల్యేగా, మరొకరు ఎంపీగా పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో జగన్ లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్లతో గతంలో ఎదురయిన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జగన్ ఈసారి టిక్కెట్ల విషయంలో ఆచితూచి అడుగు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. సీనియర్ నేతలైనా సరే సర్వేల ఆధారంగానే టిక్కెట్ల కేటాయింపు ఉంటుందని, ఇందులో ఏమాత్రం తేడా ఉండదని ఇటీవల జరిగిన సమావేశంలో జగన్ తెగేసి చెప్పినట్లు సమాచారం. దీంతో ఒకే కుటుంబంలో రెండు సీట్లు ఇస్తే మరో రెండు సీట్లు దత్తత తీసుకోవాలన్న కండిషన్ కూడా జగన్ పెడుతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.

Ravi Batchali
About Ravi Batchali 20600 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*