జగన్ విత్ ప్రూఫ్ తో వారి ముందు…?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చేయిస్తున్న సర్వేలు ఆ పార్టీ నేతల్లో వణుకు పుట్టిస్తున్నాయి. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వారికే జగన్ వచ్చే ఎన్నికలలో అభ్యర్థిత్వం ఖరారు చేస్తారన్న ప్రచారం పార్టీలో జరుగుతుంది. ఈ మేరకు జగన్ మూడు నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ లోని 160 నియోజవర్గాల్లో సర్వేలు పూర్తి చేయించినట్లు తెలుస్తోంది. రెండు ప్రయివేటు సంస్థలు, ప్రశాంత్ కిషోర్ టీమ్ లు మూడు నెలలుగా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల అమలవుతున్న తీరుపై ప్రత్యేకంగా సర్వేలు నిర్వహించారు. ఈ మూడు నెలల సర్వే నివేదికలు దగ్గరపెట్టుకున్న జగన్ నియోజకవర్గ ఇన్ ఛార్జుల మార్పునకు శ్రీకారం చుట్టినట్లు చెబుతున్నారు.

పాదయాత్రలో కలిసిన వారికి……

ఇప్పటికే లేళ్ల అప్పిరెడ్డి వంటి నేతలు జగన్ ను వ్యక్తిగతంగా ఆయన పాదయాత్ర శిబిరంలో కలిశారు. జగన్ ఏమీ మాట్లాడకుండా సర్వే నివేదికలను అప్పిరెడ్డి ముందు పెట్టి ‘‘ఏం చేయాలో మీరే చెప్పండి’’ అని అన్నట్లు చెబుతున్నారు. గుంటూరు జిల్లాలోని ఇద్దరు నేతలు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన వైసీపీ ఇన్ ఛార్జులకు కూడా సర్వే రిపోర్ట్ లను చూపించి మరీ జగన్ వారినే ఏం చేయాలో చెప్పమని కోరినట్లు సమాచారం. తాము పార్టీ కోసం శ్రమిస్తున్నామని చెప్పినా… ‘‘ఇవి అబద్ధం చెప్పవు కదా?’’ అని ఎదురు ప్రశ్న వేయడంతో వారు బిక్కమొహాలు వేసినట్లు చెబుతున్నారు.

నవరత్నాల విషయంలో సీరియస్ గా…….

వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి రావాలని భావిస్తున్న జగన్ ఇప్పటికే ప్రజాసంకల్ప పాదయాత్ర ను ప్రారంభించారు. దాదాపు 11 నెలల నుంచి ఆయన ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నారు. పాదయాత్రకు ప్రజల నుంచి వకూడా విపరీతంగా స్పందన లభిస్తుండటం ఆయనకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్లీనరీలో తాను ప్రకటించిన నవరత్నాలను జగన్ సీరియస్ గా తీసుకున్నారు. నవరత్నాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీనేతలకు పిలుపునివ్వడమే కాకుండా వివిధ కార్యక్రమాలను రూపొందించారు. అయితే లైట్ గా తీసుకున్న కొందరు నేతలు నవరత్నాలను ప్రచారం చేయడంలో విఫలమయ్యారని సర్వే ద్వారా తెలుసుకున్న జగన్ సీరియస్ గా లేని లీడర్లు అవసరం లేదన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

మార్పు రాకుంటే మార్పు తప్పదంటూ……

అలాగే వివిధ నియోజకవర్గాల్లో నేతల మధ్య నెలకొన్న విభేదాలు కూడా పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని జగన్ అభిప్రాయపడుతున్నారు. ఒక్కో నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను ఇద్దరు, ముగ్గురు విడివిడిగా చేపట్టడాన్ని కూడా జగన్ తప్పుపడుతున్నారు. పాదయాత్ర విరామ సమయంలో జగన్ నేతలతో చర్చిస్తున్న సందర్భంగా ఈ విషయాలను చెబుతున్నారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో, రాత్రి బసలోనూ వివిధ నియోజవకర్గాలనేతలతో భేటీ అవుతున్నారు. నియోజకవర్గాల వారీగా నేతలతో సమీక్షలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నేతల బలహీనతలు వారికే వివరిస్తుండటం విశేషం. ఎన్నికలు సమీపిస్తున్నా మార్పు రాకుంటే సీటు వేరే వాళ్లకు ఇవ్వాల్సి ఉంటుందని జగన్ చేస్తున్న హెచ్చరికలు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Ravi Batchali
About Ravi Batchali 37102 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*