జగన్ మనసు దోచాడే….!!

రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి వైసిపి అభ్యర్థి ని ఆ పార్టీ డిసైడ్ చేసేసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా బిసి సంఘం నాయకుడు మార్గని నాగేశ్వర రావు తనయుడు మార్గని భరత్ కు ఈ టికెట్ ఖాయమయినట్లు వైసిపి వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. జగన్ సమక్షంలో తన అనుచరగణంతో సోమవారం విజయనగరం జిల్లాలో భరత్ వైసిపి తీర్ధం పుచ్చుకోనున్నారు. ఈ విషయాన్నీ భరత్ కూడా ధృవీకరించారు.

ఎవరీ భరత్ …?

మార్గని నాగేశ్వరరావు కు తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన అనుభవంతో పాటు బిసి సంఘాల నాయకుడిగా గుర్తింపు వుంది. అనేక వ్యాపారసంస్థలు, రోటరీ వంటి సంస్థల్లో నాగేశ్వరరావు చురుగ్గా వ్యవహరించారు. తొలినుంచి టిడిపి తో అవినాభావ సంబంధాలను ఆయన కలిగి ఉండేవారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో హోమ్ మంత్రిగా పనిచేసిన దేవేందర్ గౌడ్ కి అత్యంత సన్నిహిత సంబంధాలను నాగేశ్వరరావు కు ఉండేవి.

కేఈ తో బంధుత్వం…..

ప్రస్తుత ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణ మూర్తి తో కూడా మార్గని కుటుంబానికి బంధుత్వం కూడా వుంది. రాజమండ్రి రాజకీయాల్లో చక్రం తిప్పుతారని భావించిన సమయంలో సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజకీయ చతురతకు నాగేశ్వరరావు క్రీయాశీలక రాజకీయాలకు దూరం అయ్యారు. గత ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి బరిలో నిలిచిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయానికి భరత్ తన మిత్ర బృందంతో కృషి చేశారు. ఆ తరువాత రాజకీయాలు తగ్గించి సినీ పరిశ్రమ పై దృష్టి పెట్టిన భరత్ రెండు చిత్రాల్లో హీరోగా నటించినా అవి హిట్ కాకపోవడంతో తిరిగి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.

తండ్రి ఆఫర్ కొడుక్కి …

వాస్తవానికి రాజమండ్రి పార్లమెంట్ స్థానం బిసి కులానికే ఇస్తామంటూ వైసిపి అధినేత పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు లో ప్రకటించారు. ఆ సీటు తనకే అంటూ మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అంతర్గతంగా విస్తృతంగా ప్రచారం సాగించారు. అయితే ఆర్ధికంగా బలం సరిపోదని పార్లమెంట్ పరిధిలోని వైసిపి కోఆర్డినేటర్లు బోస్ అంశంపై ఆందోళన వ్యక్తం చేయడంతో జగన్ వెనక్కి తగ్గి అంగ అర్ధ బలం వున్న బిసి అభ్యర్థి కోసం వేటమొదలు పెట్టారు. ఆ తరువాత మార్గని నాగేశ్వర రావు జగన్ ను కలుసుకుని తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరినట్లు తెలిసింది. దీనిపై అన్ని లెక్కలు చూసుకున్న జగన్ మార్గాని భరత్ కి టిక్ పెట్టినట్లు సమాచారం.

వారితో సమస్య …

గౌడ, శెట్టిబలిజ లు కలిసే గోదావరి జిల్లాల్లో ప్రయాణిస్తున్నారు. సంఖ్యాపరంగా శెట్టిబలిజ వర్గీయులు గోదావరి జిల్లాల్లో అత్యధికంగా వున్నారు. కాపు సామాజిక వర్గంతో సమానమైన ఓటుబ్యాంక్ వుంది. కానీ ఆర్ధికంగా చూస్తే శెట్టిబలిజ సామాజిక వర్గం గౌడ సామాజిక వర్గంతో సరితూగడం లేదు. దాంతో రాజకీయ పార్టీలు టికెట్ల పరంగా బిసిలకు కేటాయిస్తే వాటిలో గౌడలు తమకోటా లాగేస్తున్నారనే భావన పెరిగి పెద్దదై శెట్టిబలిజ మహానాడుకు తెరతీసింది. ఇప్పటికే శెట్టిబలిజలు తమ జనాభాకు అనుగుణంగా అన్ని పార్టీలను టికెట్లను డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు భరత్ అభ్యర్థిత్వాన్ని శెట్టిబలిజల్లోని కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఇవన్నీ రాబోయే రోజుల్లో సెటిల్ అవుతాయని పార్టీ వర్గాలు అంటున్నాయి.

టిడిపి, జనసేనలకు సవాల్ …

బిసిలకు ఎంపి టికెట్ కేటాయించి సంప్రదాయ సీటు కేటాయింపును పక్కకు పెట్టింది వైసిపి. కమ్మ సామాజిక వర్గానికే ఏ పార్టీ అయినా రాజమండ్రి సీటు కేటాయిస్తూ వచ్చేవి. గత ఎన్నికల్లో కూడా జగన్ కమ్మ సామాజిక వర్గానికే రాజమండ్రి ఎంపీ సీటు కట్టబెట్టారు. మాజీ ఎమ్యెల్యే బొడ్డు భాస్కరరామారావు తనయుడు బొడ్డు వెంకటరమణకు కేటాయించి చేతులు కాల్చుకున్నారు. ఆ ఎన్నికల్లో టిడిపి ఎంపి అభ్యర్థి నటుడు మురళీమోహన్ భారీ మెజారిటీ తో గెలిచారు. బోడ్డు వైసిపిని వీడి టిడిపి లో చేరిపోయారు. ఇదంతా టిడిపి డ్రామా లో భాగమేనని వైసిపి టికెట్ కూడా తమవర్గీయుడికి ఇప్పించుకుని మురళీ మోహన్ గెలుపు కోసం అంతర్గతంగా కృషి చేశారన్న టాక్ ఆ తరువాత బాగా ప్రచారం జరిగింది.

గత సంప్రదాయాలకు చెక్…..

ఇవన్నీ దృష్టి లో పెట్టుకోవడంతో బాటు బిసి సామాజిక వర్గాలకు వైసిపి పెద్దపీట వేస్తుందని మెసేజ్ ప్రజలకు ఇచ్చేందుకు జగన్ గత సంప్రదాయాలకు చెక్ పెట్టి కొత్త సమీకరణలకు తెరతీశారు. దాంతో ఇప్పుడు టిడిపి కూడా కమ్మ సామాజిక వర్గానికి కాకుండా వేరే వారికి సీటు కేటాయిస్తుందా లేదా అన్నది చూడాలి. ఇక జనసేన కాపులకు ఈ సీటు కేటాయిస్తుందా లేక బిసి అభ్యర్థిని బరిలోకి దింపుతుందా అన్నది ఆసక్తి రేపుతోంది. ప్రస్తుత సిట్టింగ్ ఎంపి మురళీ మోహన్ కి మాత్రం సీటు సందేహమే అన్న చర్చ బాగా పెరిగింది.

Ram Tatavarthi
About Ram Tatavarthi 1724 Articles
Ram has been continuing in the journalism for the past 25 years. He started his career from Samacharam and worked for various print and electronic media houses like Eenadu, Andhra Bhoomi, the evening daily Sandhya, in cable, Andhra Prabha, Citi Cable, TV 9, CCC channel etc.. By having extensive experience in journalism and also by always keeping up to date with the latest technology he is now working as a freelance journalist.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*