
వైసీపీ అధినేత జగన్ తీసుకున్న స్టాండ్ కరెక్టేనా? ఒకరకంగా వైసీపీ కోణంలో నుంచి చూస్తే జగన్ తీసుకున్న నిర్ణయం సరైందేనంటున్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి మాత్రం మరోసారి జగన్ విషయంలో అస్త్రం దొరికినట్లయింది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో జగన్ పార్టీ తొలుత బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించింది. విపక్షాల అభ్యర్థికి మద్దతు ఇస్తామని స్పష్టంగా ప్రకటించింది. అయితే అప్పుడు కాంగ్రెస్ డిప్యూటీ ఛైర్మన్ పదవి రేసులో లేదు. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్ధిని విపక్షాల అభ్యర్థిగా బరిలోకి దించాలనుకున్నారు. కాని చివర్లో సీన్ మారింది. కాంగ్రెస్ తన పార్టీకి చెందిన బీకే హరిప్రసాద్ ను పోటీకి దింపింది.
కాంగ్రెస్ కాకుండా…..
ఇది జగన్ కు ఒకరకంగా సమస్యే. ఎందుకంటే కాంగ్రెస్ కాకుండా ఎవరు పోటీకి నిలబెట్టినా వైసీపీ వారికి మద్దతిచ్చేది. కాని కాంగ్రెస్ స్వయంగా రంగంలోకి దించడంతో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించింది. అయితే బీజేపీకి పరోక్షంగా సహకరించాలనే వైసీపీ ఓటింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తోంది. ఆ విమర్శలు పక్కన పెడితే…. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీకి ఎలా మద్దతిస్తామన్నది జగన్ వాదన. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడమే కాకుండా, అర్థరాత్రి తలుపులు మూసి విభజన చేశారని, చట్టంలో ప్రధాన అంశాలన్నీ పెట్టకుండా అన్యాయం చేశారని వైసీపీ తీవ్రంగా ఆరోపిస్తోంది.
వైసీపీ నిర్ణయంపై……
తాము కాంగ్రెస్ పార్టీ నుంచి కాకుండా ఎవరు పోటీ చేసినా మద్దతిచ్చి ఉండేవారమని చెబుతుంది. అయితే తెలుగుదేశం అనుకూల మీడియా దీన్ని జగన్ కు వ్యతిరేకంగా ప్రచారాన్ని అప్పుడే ప్రారంభించింది. తొలుత బీజేపీకి వ్యతిరరేకంగా ఓటేస్తామని చెప్పిన జగన్ యూటర్న్ తీసుకున్నారని అంటోంది. జగన్ పార్టీ గైర్హాజరయితే అది అధికార బీజేపీకే లాభం జరుగుతుందని తెలియదా? అని ప్రశ్నిస్తుంది. కాని వైసీపీ మాత్రం తాము తీసుకున్న స్టాండ్ కరెక్టేనంటుంది. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ ను, విభజన హామీలు అమలు చేయకుండా, ప్రత్యేక హోదా పక్కన పెట్టేసిన బీజేపీకి దూరంగా ఉండాలన్న తమనిర్ణయం సరైందేనని జగన్ పార్టీ నేతలు అంటున్నారు.
సీఎం రమేష్ విషయంలో……
మరి ఇప్పుడు తమ నిర్ణయాన్ని విమర్శించే తెలుగుదేశం పార్టీ నేతలు, బాబు అనుకూల మీడియా ఇటీవల జరిగిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కు మద్దతిచ్చిన విషయాన్ని మర్చిపోయారా? అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తమపై బురద జల్లడమే కార్యక్రమంగా పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు మూడురోజుల క్రితం జరిగిన ఎన్నికను మర్చిపోయారా? అని నిలదీస్తున్నారు. నిజమే…. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కు ఆ ఎన్నికలో వైసీపీ సభ్యులు మద్దతు పలికారు. ఇప్పుడు కూడా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగాని, మరెవరైనా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కాకుండా ఉంటే ఖచ్చితంగా మద్దతిచ్చేవారమని వైసీపీ నేతలు అంటున్నారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ కు మద్దతిచ్చిన తెలుగుదేశం పార్టీ ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. జగన్ నువ్వు కరెక్టే అంటున్నారు వైసీపీ నేతలు.
Leave a Reply