
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావాలని తీవ్రస్థాయిలో కృషి చేస్తున్న జగన్.. ఈ క్రమంలోనే ప్రజా సంకల్ప పాదయాత్ర కూడా చేస్తున్నారు. అయితే, కేవలం ఒక పంథాను మాత్రమే అనుసరిస్తూ.. సాగడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని భావించిన జగన్.. రాష్ట్రంలో టీడీపీకి బలంగా ఉన్న ప్రధాన సామాజిక వర్గం ఓట్లు, ఆ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై కన్నేశాడు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆ సామాజికవర్గ ప్రాబల్యం అధికంగా ఉన్న రాజధాని జిల్లాలు అయిన గుంటూరు, కృష్ణాతో పాటు ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలపై జగన్ దృష్టి పెట్టాడు. ఈ జిల్లాల్లో ఏ ప్రధాన పార్టీ అయినా ఆ సామాజికవర్గానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటుంది.
ఇందిర సయితం…..
1978లో అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఆంధ్రా ఎన్నికల్లో ఈ సామాజికవర్గానికి తగిన గుర్తింపు నిచ్చి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు అధికారం దక్కేలా చేశారు. 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఆ సామాజికవర్గంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కూడా గుర్తింపు నిచ్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కింది. అప్పటి నుంచి పైన చెప్పుకున్న జిల్లాల్లో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలంగా ఉన్న ఆ సామజిక వర్గంతో పాటు అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లారు. సమాజంలో ఏ వర్గాన్ని నొప్పించకుండా కలుపుకుపోతూ గత ఐదారు దశాబ్దాలుగా ఉమ్మడి రాష్ట్రమైన మద్రాస్‌తో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా వారి హవా కొనసాగించారు. కానీ వారికి అప్పట్లో ముఖ్యమంత్రి పదవి రాకుండా రాయలసీమకు చెందిన ఓ మాజీ ముఖ్యమంత్రి అడ్డు పడ్డారు.
ఇందిరను ఒప్పించి……
దీంతో అప్పటి రాజ్యసభ సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నేత, ఆంధ్రజ్యోతి ఫౌండర్ డాక్టర్ కెఎల్.ఎన్.ప్రసాద్ ( కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కవతరం గ్రామం), కృష్ణా జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ పిన్నమనేని కోటేశ్వరరావు వ్యూహంతో అప్పటి ప్రధాని ఇందిరను ఒప్పించి జలగం వెంగళరావును సీఎం అయ్యేలా చేశారు. అలాగే నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు తరుణంలో కాంగ్రెస్ సీనియర్ నేత కెఎల్.ఎన్.ప్రసాద్ ఎన్టీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడంలో ఇందిర దగ్గర తన రాజకీయ చతురత చాటుకున్నారు. ఇలా ఎప్పటికప్పుడు రాజకీయాల్లో ఆ సామాజిక వర్గం ప్రాధాన్యం పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే జగన్ కూడా ఇప్పుడు ఆ వర్గాన్ని చేరదీయడం, ఆ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కాలని ఆయన బావిస్తున్నారు.
అదే బాటలో జగన్….?
ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, విద్యా సంస్థల అధినేతలను జగన్ ఇప్పటికే పార్టీలోకి ఆహ్వానించారు. గుంటూరులో ప్రస్తుతం రెండు ఎంపీ స్థానాల్లోనూ టిక్కెట్ల రేసులో ఆ సామాజికవర్గమే ఉంది. ఇక, కృష్ణాలోని రెండు చోట్ల విజయవాడలో ఎంపీగా ఆ వర్గానికి చెందిన నాయకుడే ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా ఆ వర్గానికి చెందిన వారే ఉన్నారు. ప్రకాశంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోను తాను కూడా ఆ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా..వచ్చే ఎన్నికల్లో సాధ్యమైనన్ని సీట్లను కైవసం చేసుకుని ముందుకు సాగవచ్చని, విజయం సాధించి సీఎం సీటును అధిరోహించవచ్చని జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన రాజధాని జిల్లాలతో పాటు రాష్ట్రంలో బలంగా ఉన్న ఆ సామాజిక వర్గం ప్రాధాన్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ గట్టి పోటీ ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Leave a Reply