అనివార్యమైతే జగన్ …?

తనపై బీజేపీ ముద్రను చెరిపేసుకోవాలన్న ప్రయత్నంలో వైసీపీ అధినేత జగన్ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని జగన్ నిర్ణయించుకున్నారు. ప్రత్యేక హోదా సాధనలో ఇప్పటికే ముందున్న వైసీపీ తమ రాజీనామాలను ఆమోదించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నెల 29వ తేదీన స్పీకర్ సుమిత్రా మహాజన్ నుంచి పిలుపురావడంతో వైసీపీ ఎంపీలతో జగన్ సమావేశం కానున్నారు. ఇప్పటికే వైసీపీ ఎంపీలు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు సమర్పించారు. అయితే మరొకసారి ఎంపీలతో చర్చించిన తర్వాత రాజీనామాలు ఆమోదించాలా? వద్దా? అన్న నిర్ణయం స్పీకర్ తీసుకోనున్నారు.

రాజీనామాలు ఆమోదించుకున్న తర్వాతే…..

అయితే స్పీకర్ వద్దకు వెళ్లి ఖచ్చితంగా రాజీనామాలను ఆమోదించుకుని రావాల్సిందేనని వైసీపీ ఎంపీలు ఐదుగురిని జగన్ ఆదేశించారు. 29వ తేదీన జరిగే సమావేశంలో కూడా ప్రత్యేక హోదా కోసమే రాజీనామా చేశామని, కేంద్రం హోదా ఇప్పటికప్పుడు ప్రకటిస్తే తాము రాజీనామాలను వెనక్కు తీసుకుంటామని, లేకుంటే తక్షణమే తమ రాజీనామాలను ఆమోదించాలని గట్టిగా స్పీకర్ ను కోరాలని జగన్ వారికి నిర్దేశించారు. రాజీనామాలు ఆమోదించుకున్న తర్వాతనే ఢిల్లీ నుంచి రావాలని కూడా జగన్ ఎంపీలను కోరారు.

నియోజకవర్గాల్లో యాత్రలు…..

మరోవైపు రాజీనామాలు ఆమోదం పొందిన వెంటనే నియోజకవర్గాలకు వెళ్లి యాత్రలు కూడా చేపట్టాలని కోరారు. రాజీనామాలు ఆమోదిస్తే ఉప ఎన్నికలు తప్పకుండా వస్తాయని అందుకు సిద్ధంగా ఉండాలని కూడా జగన్ అభిప్రాయపడ్డారు. ఉప ఎన్నికలు జరిగే ఐదు పార్లమెంటు స్థానాలకు ప్రత్యేక బాధ్యతలను సీనియర్లకు అప్పగించనున్నారు. నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, ఒంగోలు, తిరుపతి, విజయసాయిరెడ్డికి అప్పగించాలని భావిస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక ఇన్ ఛార్జిని నియమించనున్నారు.

తేలిగ్గా తీసుకోవద్దంటూ….

రాజీనామాలు ఆమోదించుకున్న వెంటనే నేరుగా పాదయాత్రలో ఉన్న జగన్ ను కలిసిన తర్వాత వారి నియోజకవర్గాలకు వెళ్లి ప్రతి శాసనసభ నియోజకవర్గాన్ని పర్యటించాలి. ఉప ఎన్నికలను తేలిగ్గా తీసుకోవద్దని కూడా జగన్ హెచ్చరించారు. తాను పాదయాత్ర పూర్తి చేసిన ప్రాంతాల్లోనే ఉప ఎన్నికలు జరగడం తమకు కలిసి వచ్చే అంశమని అభిప్రాయపడుతున్నారు. హోదా కోసం రాజీనామా చేశామని, బీజేపీతో వైసీపీకి ఎలాంటి అవగాహన లేదన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. తాము వచ్చే ఎన్నికల్లో సయితం ఒంటరిగానే పోటీ చేస్తామని తాను చెబుతున్నా టీడీపీ పదేపదే బీజేపీతో మిలాఖత్ అయ్యారని ప్రచారం చేయడాన్ని తిప్పికొట్టాలని జగన్ సీనియర్ నేతలకు పిలుపునిచ్చారు. ఇలా జగన్ ఇప్పటి నుంచే ఉప ఎన్నికలు అనివార్యమైతే ఎలా అన్న వ్యూహాలను ఎప్పటికప్పుడు సీనియర్ నేతలతో చర్చిస్తున్నారు.

Ravi Batchali
About Ravi Batchali 23866 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*