
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అభ్యర్థుల విషయంలో మరింత స్పష్టత ఇవ్వనున్నారు. నేటి నుంచి జరిగే “రావాలి జగన్-కావాలి జగన్” కార్యక్రమం ద్వారా అభ్యర్థుల్లో కొంత స్పష్టత వచ్చే అవకాశముంది. ఇప్పటి వరకూ ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురు సమన్వయ కర్తలు ఉండటంతో పార్టీలో కొంత కన్ఫ్యూజన్ నెలకొని ఉంది. అయితే నేటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించే గడప గడపకూ వైసీపీ కార్యక్రమంలో కొందరు నేతలకు పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చాయని తెలుస్తోంది.
సెంట్రల్ నియోజకవర్గంలో……
ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం విషయంలో మల్లాది విష్ణు, వంగవీటి రాధా పోటీ పడుతున్నారు. ఇద్దరు నేతలు సమ ఉజ్జీలే కావడంతో జగన్ సర్వేల నివేదికల ద్వారా మల్లాది విష్ణునే ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అందుకోసమే జగన్ ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాన్ని మల్లాది విష్ణు చేతుల మీదుగానే జరగాలని ఆదేశించారు. దీంతో వంగవీటి రాధా అలకబూనారు.
పార్లమెంటుకు రాధా……
వంగవీటి రాధాకష్ణకు జగన్ మచిలీపట్నం పార్లమెంటు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మచిలీపట్నం పార్లమెంటు స్థానం నుంచి కాపు అభ్యర్థులకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని భావించిన జగన్ రాధాను ఎంపీగా పంపాలని యోచిస్తున్నారు. కానీ రాధా మాత్రం తాను సెంట్రల్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని పట్టుబడుతున్నారు. దీనిపై అధిష్టానం మరోసారి రాధాతో చర్చించి ఆయనను ఒప్పించే అవకాశాలున్నాయి.
నేటి నుంచి వైసీపీ……
ఇక నేటీ నుంచి ప్రారంభమయ్యే గడప గడపకూ వైసీపీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జగన్ ఇప్పటికే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికి వెళ్లాలన్నది ఈ కార్యక్రమం ఉద్దేశం. ప్రభుత్వ వైఫల్యాలను వివరించడంతో పాటుగా పార్టీ ప్రకటించిన నవరత్నాలను సయితం ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఈ కార్యక్రమం దాదాపు నెల రోజుల పాటు 168 నియోజకవర్గాల్లో జరగనుంది. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో ఈ కార్యక్రమం చేపట్టాలని జగన్ ఆకాంక్ష. మరి వైసీపీ నేతలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారో లేదో చూడాలి.
.
Leave a Reply