జగన్ బాట పట్టక తప్పేట్లు లేదు…!

వైసీపీకి పాదయాత్ర కలిసొచ్చేటట్లుంది. వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రకు అన్ని జిల్లాల్లో స్పందన వస్తుండటంతో పాదయాత్ర పూర్తయిన జిల్లాల్లో కూడా స్థానిక సమస్యలపై పాదయాత్ర చేపడితేనే బెటరని భావిస్తున్నట్లుంది. పాదయాత్రతో జనంతో మమేకం కావడానికి వీలవుతుండటంతో జిల్లా నేతలు కూడా జగన్ బాటే పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం జగన్ పాదయాత్ర విశాఖ జిల్లాలోకి ప్రవేశించక మునుపే ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విశాఖ నగరంలో మూడు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. ప్రజాసమస్యలను తెలుసుకున్నారు.

ప్రకాశంలో సీనియర్ నేత…..

ఇక తాజాగా వైసీపీ సీనియర్ నేత, తాజా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కూడా ప్రకాశం జిల్లాలో దాదాపు రెండు వందల కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టారు. ప్రకాశం జిల్లాకు వెలుగొండ ప్రాజెక్టు జీవనాధారం. ఆ ప్రాజెక్టు పనులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయడం లేదని, కావాలని ప్రకాశం జిల్లాకు అన్యాయం చేస్తుందని వైవీ ఆరోపిస్తున్నారు. మిగిలిన ప్రాజెక్టుల మీద పెట్టిన శ్రద్ధ వెలుగొండ ప్రాజెక్టులపై పెట్టడం లేదన్నది ఆయన ఆరోపణ. ముఖ్యమంత్రిగా వై.ఎఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో వెలుగొండ ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తయ్యాయని, అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో 30 శాతం పనులను పూర్తి చేయకుండా ప్రకాశం జిల్లా వాసుల పట్ల పక్షపాత వైఖరిని అవలంబిస్తుందంటున్నారు.

వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలంటూ….

ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకే ఈ పాదయాత్రను చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి వెలుగొండ ప్రాజెక్టు వరకూ ఈ యాత్ర జరుగుతుంది. దాదాపు రెండు వందల కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగుతుంది. వెలుగొండ ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల ప్రజలు కలిసేలా రూట్ మ్యాప్ ను రూపొందించారు. ఇప్పటికే రెండు రోజుల పాదయాత్రను వైవీ సుబ్బారెడ్డిపూర్తి చేసుకున్నారు. జగన్ జిల్లాలో పర్యటించిన తర్వాత పార్టీ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో పార్టీ క్యాడర్ లో కొంత జోష్ తగ్గింది. జోష్ ను మళ్లీ తెచ్చి ఎన్నికల వరకూ కొనసాగించాలంటే ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడాల్సిందేనన్న జగన్ పిలుపు మేరకు ఈ యాత్రను చేపట్టారు.

మిగిలిన జిల్లాల్లోనూ…..

ప్రకాశం జిల్లా తరహాలోనే మిగిలిన జిల్లాల్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా, ప్రజాసమస్యలపై ప్రభుత్వం పై వత్తిడి తెచ్చే విధంగా కార్యక్రమాలను రూపొందించుకోవాలని పార్టీ కేంద్ర కార్యాలయం పిలపునిచ్చింది. ఈమేరకు ఎక్కడిక్కడ జిల్లా నేతలు కార్యాచరణను రూపొందించుకుంటున్నారు. జగన్ పాదయాత్రను ముగించుకుని తిరిగి బస్సుయాత్రతో జిల్లాలకు చేరే వరకూ ఏదో ఒక కార్యక్రమాన్నిచేపట్టాలన్న వైసీపీ అధినేత ఆదేశాన్ని జిల్లా నేతలు ఏ మేరకు ఆచరణలో పెడతారో వేచి చూడాల్సిందే.

Ravi Batchali
About Ravi Batchali 33975 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*