
అవును! ఇప్పుడు వైసీపీ నేతలనే ఈ ప్రశ్న పట్టి పీడిస్తోంది. వైసీపీ నాయకుల అంతరంగిక చర్చల్లోనూ ఇదే విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఏ ఇద్దరు నాయకులు మాట్లాడుకున్నా.. ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం.. వైసీపీ అధినేత జగన్ ఎక్కడికి వెళ్తున్నా.. ఎక్కడ సభ నిర్వహిస్తున్నా కూడా.. జనాలు తండోపతండా లుగా రావడమే! అధికార పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా కావొచ్చు.. టీడీపీలోకి కీలక ప్రాంతీయ నేతలకు గట్టి పట్టున్న జిల్లాలు కావొచ్చు! ఏవైనా సరే జగన్ అడుగు పెట్టిన చోట.. మైకు పట్టిన చోట.. జనాలే జనాలు! ఇసకేస్తే రాలనంతగా జనాలు.. మరి ఈ జనాలు ఆయనకు ఓట్లుగా మారతారా? ఆయన కల నెరవేరుతుందా? భారీ సంఖ్యలో కిక్కిరిసిపోతున్న జనాలు.. అంతే సంఖ్యలో జగన్‌కు ఓట్ల రూపంలో మద్దతిస్తారా?
ప్రతి ఒక్కరినీ సంతృప్తి పరుస్తూ…..
ఇదే.. ఇప్పుడు ఏపీలో సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జగన్ పావులు కదుపుతున్నా రు. ప్రజల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. తన ప్రభుత్వం వస్తే ఏం చేస్తుందో చెబుతున్నారు. మీ కన్నీళ్లు తుడుస్తానంటూ హామీల వరద పారిస్తున్నారు. వృద్దులు, వికలాంగులకు ఇస్తున్న పింఛన్‌ను మూడు వేలు చేస్తానని కూడా చెబుతున్నా రు. ఇలా ప్రతి ఒక్కరినీ ఆయన సంతృప్తి పరుస్తున్నారు. ఇక, జగన్ ఏ మారు మూల పల్లెలో సభ నిర్వహించినా.. జనాలు తండోపతండాలుగా క్యూ కడుతున్నారు. రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో వేల సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. మరి ఇవన్నీ ఓట్ల రూపంలో జగన్‌కు వరాలు కురిపిస్తాయా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న!
ఓదార్పు యాత్రలకు కూడా…..
గత అనుభవాన్ని బట్టి చూస్తే.. గతంలోనే జగన్ ఓదార్పు యాత్రలు చేశారు. అప్పట్లోనూ ప్రజలు తండోపతండాలుగా జగన్ సభలకు క్యూ కట్టారు. దూరాభారాలనుసైతం లెక్క చేయకుండా జగన్ నుచూసేందుకు, ఆయన చెప్పేది వినేందుకు ప్రజలు వచ్చేవారు. దీంతో జగన్ ఇవన్నీ ఓట్ల రూపంలో మారడం ఖాయమని భావించారు. తనకు తిరుగులేదని అనుకున్నారు. అధికారం ఇక, తనదేనని భావించారు. దురదృష్టవశాత్తు.. పలు ఎన్నికల సర్వేల్లోనూ ఇదే తేటతెల్లమైంది. కానీ, 2014లో జరిగిన ఎన్నికల తర్వాత జగన్‌కు నిజాలు తెలిసి వచ్చాయి.
వచ్చినోళ్లంతా ఓటేస్తే……
అయితే గత ఎన్నికల్లో ఓటమికి జగన్‌ను తప్పుపట్టలేం…. ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలు కూడా ఇందుకు కొంత కారణమయ్యాయి. కట్ చేస్తే.. ఇప్పుడు జగన్ ప్రజాసంకల్ప యాత్రలో ఉన్నారు. ఇప్పటికి దాదాపు 10 నెలలుగా ఆయన ఇంటి ముఖం కూడా చూడకుండానే ప్రజల్లో తిరుగుతున్నారు. ఆయన ఎక్కడ సభ నిర్వహించినా.. ఎక్కడ పాదయాత్ర చేసినా జనాలు కోకొల్లలుగా కొత్త సినిమాకు వచ్చినట్టు వస్తున్నారు. మరి వీరంతా వచ్చే ఎన్నికల్లో ఆయనకు అండగా నిలుస్తారా? ఆయనకు జై కొడతారా? అనేది ఇప్పుడు చర్చకు వస్తున్న అంశం. వాస్తవానికి వచ్చే ఎన్నికలు కీలకంగా మారడం, త్రిముఖ పోటీ తీవ్రంగా ఉండడంతో జనాలు ఎటు మొగ్గుతారనే ప్రశ్న తెరమీదికి వస్తోంది. మరి జగన్ ఈ జనాల ఓట్లను తనవైపు తిప్పుకొనేందుకు ఏం చేస్తాడో చూడాలి! ఇప్పటికైతే జనాల్లోనూ, .. వైసీపీ నేతల్లో ఈ విషయంపై కొంత మేరకు గందరగోళం ఉందనే చెప్పాలి! మరో మూడు నాలుగు నెలల్లో ఈ విషయంపై పూర్తి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
Leave a Reply